కారు ఎక్కనున్న ఏఐటీయూసీ నాయకులు..?
Published Fri, Mar 11 2016 3:30 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
సింగరేణిలోనూ ‘ఆపరేషన్ ఆకర్ష్’
శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : రాష్ట్రంలో ఇటీవల చర్చనీయూంశంగా మారిన టీఆర్‌ఎస్ ఆపరేషన్ ‘ఆకర్ష్’ సింగరేణిలోనూ మొదలైంది. కంపెనీలో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న ఏఐటీయూసీ నుంచి ఇటీవల రాజీనామ చేసిన ముఖ్య నాయకులు ప్రస్తుత గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌లో చేరడానికి రంగం సిద్ధమైంది. కేంద్ర కార్యదర్శి మంద మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు గోపు సారయ్య, కేంద్ర కమిటీ సభ్యుడు ఖలీందర్‌ఖాన్, కేంద్ర కమిటీ సభ్యుడు రాజమల్లు గురువారం గోదావరిఖనిలో మిర్యాల రాజిరెడ్డితో జరిపిన భేటీ ఇందుకు బలం చేకూర్చుతోంది.
ఎన్నికల వేళ ఎదురుదెబ్బ
సింగరేణి గుర్తింపు సంఘంగానికి మరో మూడు నెలల్లో ఎన్నిక లు రానున్న నేపథ్యంలో ఏఐటీయూసీకి ఎదరుదెబ్బ తప్పేట్టు లేదు. టీబీజీకేఎస్‌లోని గ్రూపుల వల్ల ఈ సారి గుర్తింపు ఎన్నిక ల్లో తామే గెలుస్తామన్న ధీమాతో ఉన్న ఏఐటీయూసీకి అసమ్మ తి వర్గం చాపకింద నీరులా భారీ గండికొట్టనుంది. యూనియన్‌లో క్రియాశీలకంగా పని చేసిన డెప్యూటీ ప్రధాన కార్యదర్శి కె.వీరభద్రయ్య, కేంద్ర కార్యదర్శులు మంద మల్లారెడ్డి, వంగ రాజేశ్వర్‌రావు, ఉపాధ్యక్షుడు గోపు సారయ్య, కేంద్ర కమిటీ సభ్యులు ఖలీందర్‌ఖాన్, జి.రాజమల్లు గత నెల 7వ తేదీన యూనియన్‌తోపాటు సీపీఐలో కలిగిఉన్న పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఏకపక్ష నిర్ణయూలే కారణం
ఎన్నో ఏళ్ల నుంచి యూనియన్ ఎదుగుదలకు కృషి చేస్తున్న తమ విషయంలో కొంత కాలంగా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య వివక్ష చూపుతూ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడని నాయకులు ఆరోపించారు. క్రియూశీలక పాత్ర పోషిస్తున్న తమ అభిప్రాయాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుం డా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో మనస్థాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ పరిస్థితి రావడానికి సీతారామయ్యే పూర్తి బాధ్యుడని వారు సమర్పించిన రాజీ నామా లేఖలో పేర్కొన్నారు. ఈ విషయమై పార్టీ ముఖ్య నేతలు మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ రంగంలోకి దిగి వారిని బుజ్జగిం చే ప్రయత్నం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, యూనియన్ అధ్యక్షుడు నర్సింహన్‌తోపాటు సీతారామయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి కలవేని శంకర్ సైతం రాజీనామాలను ఉపసంహరింపజేయడానికి చేసిన కృషి ఫలించ లేదు. చివరికి కొద్ది రోజుల క్రితం సీపీఐకి సంబంధించి రాజీనామాలను పార్టీ నాయకత్వం ఆమోదించింది. యూనియన్ పదవులకు చేసిన రాజీనామాలపై ఈనెల 19న శ్రీరాంపూర్‌లో నిర్వహించే సెంట్రల్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈలోగానే టీబీజీకేఎస్‌లో చేరితే హూందాగా ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం.
భేటీలో నలుగురు నేతలు
ఏఐటీయూసీకి రాజీనామా చేసిన కేంద్ర కార్యదర్శి మంద మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు గోపు సారయ్య, కేంద్ర కమిటీ సభ్యుడు ఖలీందర్‌ఖాన్, కేంద్ర కమిటీ సభ్యడు రాజమల్లు గురువారం గోదావరిఖనిలో రాజిరెడ్డిని కలిసి చేరికలపై చర్చలు జరిపారు. ఈ విషయమై టీబీజీకేఎస్ అధ్యక్షుడు ఆకునూరి కనకరాజుతో సైతం ఫోన్‌లో మాట్లాడారు. యూనియన్‌లో చేరితే తమకు కల్పించాల్సిన ప్రాధాన్యతపైనా చర్చించినట్లు సమాచారం. త్వరలో ఏఐటీయూసీలోని తమ అనుచరగణంతో కలిసి గులాబీ కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.
గులాబీ దళానికి దన్ను
గ్రూపులతో సతమతమవుతున్న టీబీజీకేఎస్‌కు ఈ చేరికలు కొండంతబలాన్ని ఇవ్వనున్నాయి. ఏఐటీయూసీకి రాజీనామా చేసిన నాయకులు తమతో భారీ ఎత్తున అనుచరులను యూనియన్‌లోకి తీసుకువస్తామని హామీ సైతం ఇచ్చినట్లు సమాచారం. వీరి చేరికలపై యూనియన్ అధ్యక్షుడు ఎ.కనుకరాజు, మిర్యాల రాజిరెడ్డి ఇదివరకే గౌరవ అధ్యక్షురాలు ఎంపీ కవిత దృష్టికి తీసుకుపోయారని, అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. యూనియన్‌లో చేరుతున్న వారికిసముచితం స్థానం కల్పిస్తామని నాయకత్వం నుంచి హామీ సైతం లభించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక వారంతా ఎంపీ కవిత సమక్షంలో గులాబీ కండువా కప్పుకోవడమే తరువాయి.
Advertisement