
లక్ష కోట్లు ఎలా ఖర్చు చేస్తారు?
* బడ్జెట్ లెక్కలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద
* విరుచుకుపడ్డ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ
* ఇంత తక్కువ సమయంలో ఎలా ఖర్చుచేస్తారో చెప్పాలని డిమాండ్
* బడ్జెట్ చూస్తే తెలంగాణ ఉద్యమం ఎందుకు చేశారా అనిపిస్తుంది
* ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయండి
* గత పాలకులేం అన్యాయం చేశారు.. మీరేం చేస్తారో చెప్పండి
* సభలో లేవనెత్తిన ఏ అంశానికి ఆర్థిక మంత్రి సమాధానం ఇవ్వలేదు...
సాక్షి, హైదరాబాద్: ‘వేల మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ, ఇప్పుడు ఈ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే తెలంగాణ ఉద్యమం ఎందుకు చేశారా అనిపిస్తుంది. మొదటి రెండు మాసాల నిధుల వినియోగం గడచిన మూడేళ్ల సగటుతో పోల్చితే తక్కువే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా లక్ష కోట్లు ఎలా ఖర్చు చేస్తారు?’ అని శాసనసభలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘2011 నుంచి 2014 వరకు రాష్ట్రంలో ప్రణాళిక.. ప్రణాళికేతర నిధుల ఖర్చుల వివరాలు నా దగ్గరున్నాయి.
గడచిన ఆర్థిక సంవత్సరం అంటే 2013-14లో తెలంగాణలోనే రమారమి రూ. 68 వేల కోట్ల నిధుల వినియోగం జరిగింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ వివరాలు తీసుకున్నా. తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో రూ. 5,935 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ లెక్కన పది నెలల్లో రూ. 50 వేల కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. మరి లక్ష కోట్లు ఎలా ఖర్చు చేస్తారు..?’ అని నిలదీశారు.
శుక్రవారం బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సమాధానమిచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ ‘సభలో మేము లేవనెత్తిన ఏ అంశానికీ ఆర్థిక మంత్రి సమాధానం ఇవ్వలేదు. విద్యుత్, వ్యవసాయం గురించి అనేక ప్రశ్నలు లేవనెత్తా. జవాబు లేదు. తెలంగాణ వస్తే సమస్యలు తీరుతాయని ప్రజలు భావించారు. బడ్జెట్ చూస్తే ఎంత ఆదాయం ఉంది.. ఎంత ఖర్చు ఉందో చెప్పలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. విద్యుత్తు సమస్యలాగే ఆర్థిక సమస్య ఉంది. వివరాలు ఎందుకు బహిర్గతం చేయలేదు. ప్రభుత్వం వీటిని కావాలనే దాస్తోంది. ఓ మిత్రుడిగా చెపుతున్నా, శ్వేతపత్రం విడుదల చేయండి’ అని ప్రభుత్వానికి సూచించారు.
‘యాభై ఏళ్లుగా తెలంగాణకు జరిగిన అన్యాయం ఒక్క ఏడాదిలో సమసిపోతుందని అనుకోవటం లేదు. బంగారు తెలంగాణ సాధనకు మరో అయిదు, పదేళ్లయినా ఓపిక పడదాం. గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలేం చేశాయి. ఇప్పుడు రాష్ట్రం ఏ స్థితిలో ఉంది. మీరేం చేస్తారో.. ఏం సాధించాలనుకుంటున్నారో చెప్పండి. గత ప్రభుత్వాలు అన్యాయం చేశాయని భావిస్తే ఆ వివరాలు బయటపెట్టండి. తెలంగాణ నిధులు ఇంకా ఆంధ్రప్రదేశ్ ఖజానాలో ఉన్నాయి. వాటి విడుదలకు చర్యలు తీసుకోండి..’ అని ప్రభుత్వానికి అక్బరుద్దీన్ విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్‌లలో రెండు వేల మందికి పైగా ఉద్యోగులుంటే, మైనారిటీ విభాగంలో కేవలం వంద మంది ఉద్యోగులున్నారని, వీళ్లతో మైనారిటీల సంక్షేమానికి కేటాయించిన రూ.1,030 కోట్లు ఖర్చు చేయటం సాధ్యమేకాదని ఆయన పేర్కొన్నారు.