
అయ్యో పాపం...
- ఫుట్‌పాత్‌పై బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి
నల్లకుంట/ముషీరాబాద్ న్యూస్‌లైన్: చిత్తుకాగితాలు ఏరుకుంటూ ఫుట్‌పాత్‌పై జీవిస్తున్న ఓ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి మృతి చెందింది. నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన జరిగింది. ఎస్సై యాదగిరి, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... కవిత(25), అఖిల్ దంపతులు చిత్తు కాగితాలు ఏరుకుంటూ వీఎస్టీ రోడ్డులో గల కట్టమైసమ్మ ఆలయం సమీపంలో ఫుట్‌పాత్‌పై నివాసముంటున్నారు.
నిండు గర్భిని అయిన కవితకు సోమవారం సాయంత్రం 4 గంటలకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భర్త ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లలేక పోయాడు. దీంతో సమీపంలో ఉండే వృద్ధురాలు ఎల్లమ్మ అక్కడకు వచ్చేలోపే కవిత ప్రసవించింది. వెంటనే బాలింతను ఆ పక్కనే ఉన్న డబ్బాచాటుకు చేర్చింది. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కవిత 15 నిమిషాలకే తీవ్రమైన రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.
అంబులెన్స్ సిబ్బంది వచ్చి కవితను పరీక్షించగా.. అప్పటికే ఆమె మృతి చెందింది. పోలీసులు శవపంచనామా చేసి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. 108 సిబ్బంది కవిత బిడ్డను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పసికందును పరీక్షించిన వైద్యులు బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ ఇన్ఫెక్షన్ సోకిందని, మరో 48 గంటలు గడిస్తేకాని ఏమీ చెప్పలేమని చెప్పారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.