సర్వేకు.. సకలం సిద్ధం
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేపై సందిగ్ధత తొల గింది. ఎన్నికల కమిషన్ పచ్చజెండా ఊపటంతో మంగళవారం జిల్లావ్యాప్తంగా ఇంటింటా సర్వే నిర్వహించనున్నారు. కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావ్వికుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వలస జీవుల రాకతో బస్సులు సోమవారం కిటకిటలాడాయి. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం తమ స్వస్థలాలకు చేరుకున్నారు. మరోవైపు పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది.
ప్రజలు తమ సొంత ఊళ్లకు చేరుకోవటంతో పల్లెలు కొత్త కళను సంతరించుకున్నాయి. జిల్లా ప్రత్యేక అధికారి బి. వెంకటేశం అధికారులతో సమావేశమై సర్వే విజయవంతం చేయాలని సూచించారు. సదాశివపేట, జహీరాబాద్‌లో పర్యటించి సర్వే ఏర్పాట్లను పరిశీలించారు. ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ మండల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడి గ్రామాలు, పట్టణాల్లో పకడ్బందీగా సర్వే నిర్వహించాలని సూచించారు. సర్వేలో భాగంగా కుటుంబ సభ్యులు అందజేసే ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలే తప్ప జిరాక్సు ప్రతులు తీసుకోవద్దని ఉద్యోగులకు స్పష్టం చేశారు.
జిల్లాలోని 1066 పంచాయతీలు, ఏడు మున్సిపాలిటీల్లో అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. 8,00,028 గృహాల్లో సర్వే జరపనున్నారు. 32,952 మంది సిబ్బంది సర్వే విధులు నిర్వహించనున్నారు. గ్రామాలు, పట్టణాల్లో సర్వే కోసం ప్రతి 30 ఇళ్లకు ఒక ఎన్యుమరేటర్‌ను నియమించారు. నియోజకవర్గం, మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులకు సర్వే పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఎన్యుమరేటర్లకు 9.60 లక్షల సర్వే ఫారాలను, 9.6 లక్షల స్టిక్కర్లను పంపిణీ చేశారు. అలాగే సర్వే నిర్వహణలో పాల్గొనే సిబ్బంది కోసం 1,340 రూట్లలో ప్రత్యేకంగా బస్సులు నడపనున్నారు. సర్వే వివరాలను కంప్యూటరీకరించేందుకు 110 కేంద్రాలను ఏర్పాటు చేసి 899 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లను సిద్ధం చేశారు.
ఇవి ఉంటే సర్వే సులువు
ఇంటింటి సర్వేకు ప్రజలు ముందస్తుగా సన్నద్ధమవుతే సర్వే సులువుగా పూర్తవుతుంది. తమ ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు తమ కుటుంబానికి సంబంధించిన వివరాలను పూర్తిగా తెలియజేయాలి. సర్వేకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ పుస్తకం, విద్యుత్ బిల్లు, పింఛన్ కార్డులు, బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతా పుస్తకాలు, అంగవైకల్యం ఉంటే పీహెచ్‌సీ సర్టిఫికెట్లు, భూములు ఉంటే పట్టాదారు పాసుప్తుకాలు సిద్ధంగా ఉంచుకోవాలి.
సర్వే విజయవంతం చేయండి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వేను విజయవంతం చేయాలి. సర్వే ద్వారానే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు వీలవుతుంది. ప్రజలు తమ ఇంటి వద్దకు వచ్చే ఎన్యుమరేటర్లకు కుటుంబ వివరాలను పూర్తిగా తెలియజేయాలి.
-బి.వెంకటేశం, ప్రత్యేక అధికారి
ఎలాంటి అనుమానాలు వద్దు
జిల్లా ప్రజలు అపోహలు వీడి సమగ్ర కుటుంబ సర్వే విజయవంతం అయ్యేందుకు సహకరించాలి. ఎన్యుమరేటర్లు కేవలం ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలి. జిరాక్స్ ప్రతులుతీసుకోవద్దు. ప్రతి మూడు గంటలకు ఒకమారు కలెక్టరేట్‌కు సర్వేకు సంబంధించిన సమాచారాన్ని ప్రత్యేక అధికారులు అందజేయాలి.
-శరత్, ఇన్‌చార్జి కలెక్టర్