సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మండల పరిష త్ ప్రాదేశిక నియోజకవర్గాల సంఖ్య ఖరారైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 5,984 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడనున్నట్టు సమాచారం. గతంలో ఉమ్మడి 9 జిల్లా ప్రజా పరిషత్‌ల పరిధిలో 6,473 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వాటి సంఖ్య ప్రస్తుతం 5,984 స్థానాలకు తగ్గనుంది. కొత్తగా 68 మున్సిపాలిటీలు ఏర్పడిన నేపథ్యంలో ఆయా మండలాల పరిధి లోని కొన్ని గ్రామ పంచాయతీలను వాటిలో విలీనం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా 489 ఎంపీటీసీ స్థానాల తగ్గింపునకు ఆస్కారం ఏర్పడింది.
కొత్తగా ఏర్పడిన 32 జిల్లాల (పూర్తిగా పట్ట ణ ప్రాంతమైన జీహెచ్‌ఎంసీ మినహా) ప్రాతిపదికన ఆయా జిల్లాల్లో ఎంపీటీసీ స్థానాల పునర్విభజన చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా 98 స్థానాలు పెరగ్గా, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో అత్యల్పంగా 90 స్థానాలు తగ్గాయి. మంగళవారం నాటికి అత్యధిక శాతం జిల్లాలు ఈ స్థానాల పునర్విభజన ప్రక్రియను పూర్తిచేసి, గెజిట్లు ప్రచురించాయి. ఈ నెల 25 నాటికే ఈ స్థానాల పునర్విభజన పూర్తి చేసి జాబితాలను పంపించాలని జిల్లా సీఈఓలు, డీపీఓలను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆదేశించారు. అయితే మంగళవారం రాత్రి వరకు కూడా అన్ని జిల్లాల నుంచి పూర్తి స్థాయిలో ఈ జాబితాలు అందకపోవడంతో బుధవారం వాటిని ప్రభుత్వానికి సమర్పించాలనే ఆలోచనలో పీఆర్ శాఖ ఉంది.
మార్చి చివరికల్లా ఓటర్ల జాబితాలు
ప్రస్తుతం 32 జిల్లాల పరిధిలోని 535 గ్రామీణ మండలాలను జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (50 పట్టణ స్వరూపమున్న రెవెన్యూ మండలాలు మినహాయించి)గా పరిగణిస్తున్నారు. ఆ మేరకు 32 జిల్లా ప్రజా పరిషత్‌లు, 535 మండల ప్రజాపరిషత్‌లు ఏర్పడనున్నాయి. కొత్త పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సరిహద్దులు ఖరారవుతున్నాయి. వచ్చే నెల చివరికల్లా గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం కానున్నాయి. తాజా అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా ప్రాతిపదికన మార్చి ఆఖరులోగా ఈ ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఇదివరకే జిల్లా కలెక్టర్లు, డీపీఓలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ జాబితాలు సిద్ధమయ్యాక ఏప్రిల్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాతే...
లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దాన్ని బట్టి రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలుంటాయి. మే నెల మధ్యలోగా లోక్‌సభ ఎన్నికలు ముగిస్తే, మే నెలాఖరులో లేదా జూన్ మొదటి లేదా రెండో వారంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు అనువుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment