సాక్షి, హైదరాబాద్: సమ్మక్క–సారలమ్మ జాతరకు తెలంగాణ పోలీసుశాఖ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈ వనమహోత్సవం ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మొదలవనున్న నేపథ్యంలో భద్రతాపరంగా పలు ప్రణాళికలు రూపొందించింది. భద్రత, రవాణా, పార్కింగ్, వాహనాల మళ్లింపు, సీసీకెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్‌జామ్‌ల నివారణకు అవలంబించాల్సిన వ్యూహాలను ఇప్పటికే సిద్ధం చేసింది.
వాహనాల రాకపోకలపై ప్రత్యేక దృష్టి
ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి మేడారానికి వచ్చే వారంతా కాటారం రహదారిని రాకపోకలకు వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్‌తోపాటు, హైదరాబాద్, దక్షిణ తెలంగాణ జిల్లాల నుంచి వచ్చేభక్తులంతా ములుగు మీదుగా పస్రా, అక్కడ నుంచి మేడారం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో భూపాలపల్లి మీదుగా వరంగల్ వైపునకు రావాల్సి ఉంటుంది. ఈ రెండు మార్గాల్లోనూ వన్‌వే విధానం సాగుతుంది. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడినా క్లియర్ చేయడానికి ప్రత్యేక బైకులపై పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తారు.
జాతర ముగిసేవరకు ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రైవేటు వాహనాలు, ఇసుక లారీలు, ట్రాక్టర్లను వేరేవైపు వెళ్లాలని పోలీసులు ఆదేశించారు. వరంగల్ మీదుగా మేడారం చేరుకునే భక్తులు జాకారం –జంగాలపల్లి గ్రామాల మధ్య కొలువైన ఘట్టమ్మ తల్లి వద్ద ఆగుతారు. ఇక్కడ భక్తులు, వాహనాల రద్దీ నియంత్రణకు సైతం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక మేడారం చేరుకున్న అన్ని వాహనాలకు ‘ఊరటం’వద్ద విశాల మైదానంలో వేలాది వాహనాల పార్కింగ్‌కు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి ములుగు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జాతర జరగనుంది.
రక్షణ ఇలా: గతంలో ములుగు నుంచి మేడారం వరకు రహదారి వెంట 10 కి.మీ.లకు ఒక పోలీస్ చెక్‌పోస్టు పెట్టగా.. ఈసారి 4 కి.మీ.లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల పోలీసుల సాయం తీసుకోనున్నారు. దాదాపు 380 సీసీ కెమెరాలతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. సమ్మక్క–సారక్క గద్దెలను దర్శించుకునే మార్గాల సంఖ్యను నాలుగుకు పెంచాలని యోచిస్తున్నారు.
మేడారం జాతరకు ప్రధానిని ఆహ్వానిస్తాం
సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను ఆహా ్వనించనున్నట్టు బీజేపీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు తెలిపారు. మంగళవారం ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment