దొంగల భయంతో రాత్రంతా జాగారం
- పోలీసులకు సవాల్‌గా మారిన చోరీ ముఠా
- వరుస ఘటనలతో హడలె త్తుతున్న ప్రజలు
ములుగు : మండల ప్రజలను దొంగల భయం వెంటాడుతోంది. వారం రోజులుగా పలు గ్రామాల్లో దొంగల ముఠా పర్యటిస్తున్నట్లు ప్రచారం జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు గ్రామాల్లో భద్రతను పెంచి.. పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. వరుసగా ప్రచారంలోకి వస్తున్న వదంతులతో ప్రజలు హడలెత్తుతున్నారు.ఈ నెల 25, 26వ తేదీల్లో జాకారం ఎంపీటీసీ మాజీ సభ్యుడు కలువల పోషాలు, కిరాణ వ్యాపారి యాద శ్రీను ఇంటికి దొంగలు వచ్చారని, వారు 27న మదనపల్లి గుట్టల్లో తలదాచుకున్నారని, ఆ రోజు రాత్రి కాశీందేవిపేట గ్రామస్తుడు సైకిల్‌పై వస్తుంటే ఆపి కొట్టారని, పోలీసులు వె ళ్లడంతో పత్తిపల్లి, కొడిశలకుంట, బుగ్గ ప్రాంతాల్లో తలదాచుకున్నారని జాకారం గ్రామస్తుల తెలిపారు.
తాజాగా శుక్రవారం రాత్రి ముదిరాజ్ కాలనీలో దొంగలు సంచరిస్తున్నట్లు తెలియడంతో కాలనీకి చెందిన మంద శ్రీను వెంబడించాడు. అతడిని గమనించిన దొంగలు చితకబాదారు. గ్రామస్తులు వచ్చేలోగా దొంగలు పారిపోయారు. వారి సమాచారంతో పోలీసులు చేరుకుని అబ్బాపూర్, జాకారం, ఇంచెన్‌చెర్వుల గ్రామాల పరిధిలో సోదాలు నిర్వహించినా ఫలితం లేకుండాపోయింది. దొంగల భయంతో జాకారం, అబ్బాపూర్, మల్లంపల్లి, ములుగు, అన్నంపల్లి, మదనపల్లి, పత్తిపల్లి తదితర గ్రామాల ప్రజలు రాత్రి భయం గుప్పిట్లో గడిపారు. మహిళలు తమ మెడలోని బంగారు ఆభరణాలు తీసి పసుపు తాడు వేసుకోవడం విశేషం.
ఇక వ్యాపారులు, ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. జీవంతరావుపల్లిలో రాత్రి మహిళలు తమ వెంట కారం ముద్దలు ఉంచుకొని కాపలా ఉన్నట్లు తెలిసింది. ఆయా గ్రామాలకు వచ్చే దొంగలు హిందీలో మాట్లాడుతున్నట్లు గ్రామస్తులు చెప్పారు. వారి భాషను బట్టి వేరే రాష్ట్ర్రాలకు చెందిన వారై ఉంటారని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా రాత్రి పోలీసుల సోదాల్లో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా పోలీసులకు దొంగల ముఠా కొరకరాని కొయ్యగా మారింది.