చట్టాలపై పట్టు సాధించాలి | all peoples Attain the laws | Sakshi
Sakshi News home page

చట్టాలపై పట్టు సాధించాలి

Published Sun, Mar 26 2017 12:31 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

all peoples Attain the  laws

ఆదిలాబాద్‌: బాధితులకు సరైన న్యాయం చేయాలంటే న్యాయస్థానంలో నిందితులపై నేరారోపణలు రుజువు చేసే బాధ్యత పోలీసు అధికారులపై ఉందని తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ వైజయంతి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీసు సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో పాటు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లకు నూతన చట్టాలపై ఒక్కరోజు వర్క్‌షాప్‌ నిర్వహించారు. కార్యక్రమానికి ప్రాసిక్యూషన్‌ డైరెక్టర్‌ వైజయంతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

సాధారణంగా పోలీసు అధికారులకు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) కేసుల్లో సులువు పరిశోధన చేస్తారని, ప్రస్తుతం మారుతున్న కాలంలో నూతన చట్టాలపై అవగాహన లోపంతో పరిశోధన జరపడంతో న్యాయస్థానంలో కేసులు రుజువు చేయలేకపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రత్యేక చట్టాల్లోని ముఖ్యమైన పద్ధతులను పాటించకపోవడంతో పోలీసు కేసులు న్యాయస్థానాల్లో కొట్టివేస్తున్నారని సూచించారు. చట్టంలోని అంశాలను క్షుణ్ణంగా తెలియక, చట్టాలను కచ్చితంగా అమలు చేయకపోవడంలో జరుగుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రతీ నాలుగో శనివారం అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో వివిధ చట్టాల గురించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

రానున్న రోజుల్లో పరిశోధనలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, నిందితులను శిక్షించే విధంగా ధృడమైన దర్యాప్తు చేయాలన్నారు. అనంతరం అదనపు ఎస్పీ పనసారెడ్డి మాట్లాడుతూ ఎస్పీ ఎం.శ్రీనివాస్‌ నేతృత్వంలో ప్రతీనెల నిర్వహించే నేర సమీక్ష సమావేశంలో పోలీసు అధికారులకు ఎప్పటికప్పుడు నూతన చట్టాలపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రాసిక్యూషన్‌ నిపుణులతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పోలీసు అధికారులు మరింత రాటుదేలాలని సూచించారు. పోలీసు అధికారులకు సైబర్‌ నేరాల్లో దర్యాప్తు సామర్థ్యం పెంచేలా కృషిచేయాలని డైరెక్టర్‌ను కోరారు.

ఈ సందర్భంగా దర్యాప్తులోని ముఖ్య అంశాలైన నేరపరిశోధన, సొత్తు స్వాధీనం, నేరస్థలం పరిశీలించుట, జప్తు, అటాచ్‌మెంట్, ఇతరుల ఆధీనంలో ఉన్న దస్తావేజులను ఎలా నోటీసులు ఇచ్చి సాక్షులుగా సేకరించవచ్చో అనే అంశాలపై మెలకువలను కొత్తగూడెం జిల్లా అదనపు ప్రాసిక్యూషన్‌ నిపుణుడు ఫణికుమార్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్‌ దేవేందర్, జిల్లా కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రమణారెడ్డి, మృత్యుంజయ, కె.శ్రీరాం, మల్లికార్జున్, డీఎస్పీలు లక్ష్మీనారాయణ, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement