అన్ని దారులూ బంద్‌ | All Routes Closed To Corona Hotspots In Telangana | Sakshi
Sakshi News home page

అన్ని దారులూ బంద్‌

Published Sat, Apr 11 2020 1:10 AM | Last Updated on Sat, Apr 11 2020 4:57 AM

All Routes Closed To Corona Hotspots In Telangana - Sakshi

సికింద్రాబాద్‌ ప్రాంతంలోని ఓ కంటైన్మెంట్‌ క్లస్టర్‌ను ఇలా దిగ్బంధించారు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో హాట్‌స్పాట్‌ (కంటైన్మెంట్‌) ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజలు గృహనిర్బంధంలో ఉండిపోయారు. వారిని ప్రభుత్వం పూర్తిగా హోం క్వారంటైన్‌కు పరిమితం చేసింది. తెలంగాణలో వివిధ జిల్లాల్లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం 130 హాట్‌స్పాట్లను ప్రకటించింది. శుక్రవారం ఆయా ప్రాంతాల్లో నిర్ణీత ప్రదేశం మేరకు పూర్తిగా అష్టదిగ్బంధం చేశారు. ఎక్కడికక్కడ  బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరూ ఎటూ వెళ్లకుండా చర్యలు చేపట్టింది. అక్కడున్న ప్రజలకు అవసరమైన పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను కూడా ప్రభుత్వ యంత్రాంగమే సమకూరుస్తోంది. హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో కొన్నిచోట్ల డ్రోన్లను వినియోగిస్తూ పోలీసులు పహారా కాస్తున్నారు. వైద్య బృందాలు ఇళ్లకు వెళ్లి జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలున్న వారిని గుర్తించి ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. 

కేసులు ఎక్కువ ప్రాంతాల్లో... 
రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 27 జిల్లాలకు విస్తరించగా అందులో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, గద్వాల, కరీంనగర్, నిర్మల్, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా వైరస్‌ వ్యాప్తి తక్కువగానే నమోదైనప్పటికీ ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు, వారి కుటుంబీకుల ద్వారా అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేసులు ఎక్కడెక్కడ అత్యధికంగా పెరిగాయో ఆయా ప్రాంతాలను ప్రభుత్వం హాట్‌స్పాట్లుగా గుర్తించింది. కనీసం రెండు, మూడు కేసులు మొదలుకొని గరిష్టంగా ఐదు కేసులు నమోదైన ప్రాంతాలను ఒక్కో హాట్‌స్పాట్‌గా పరిగణించింది. అలా రాష్ట్రంలో 130 హాట్‌స్పాట్లను గుర్తించినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. లాక్‌డౌన్‌ అమలులో కనీసం ఏదైనా అవసరానికి బయటకు వెళ్లడానికి వీలుండగా హాట్‌స్పాట్‌ ప్రాంత ప్రజలు ఎటూ వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో మొత్తం 2.88 లక్షల ఇళ్లను గుర్తించారు. ఒక్కో ఇంట్లో సరాసరి ఐదుగురు సభ్యులుంటారని అంచనా వేశారు. ఆ ప్రకారం 14.40 లక్షల మంది అష్టదిగ్బంధంలో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో 3,116 వైద్య బృందాలు ఇంటింటి సర్వే చేస్తున్నాయి. ఒక్కో వైద్య బృందంలో ఇద్దరు సభ్యులున్నారు. పోలీసు బందోబస్త్‌ ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. 

14 రోజులు ఇంటిపట్టునే ఉండాలి.. 
130 హాట్‌స్పాట్‌లలో ఉండే లక్షలాది మంది ప్రజలు నిర్ణీత తేదీ నుంచి 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లోనే ఉండాలి. కేసుల తీవ్రతను బట్టి జిల్లా అధికారులు హాట్‌స్పాట్‌లను మ్యాపింగ్‌ చేశారు. దాని పరిధిని కిలోమీటర్‌ నుంచి మూడు కిలోమీటర్ల వరకు నిర్ధారించారు. వైద్య, పోలీసు బృందాలతో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌ ఏర్పాటయ్యాయి. ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు వైరస్‌ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో 30 ఇళ్లను కవర్‌ చేస్తారు. హాట్‌స్పాట్‌లలో కొన్ని కేసులున్న సాధారణ ప్రాంతాల్లో 50 ఇళ్లను పర్యవేక్షిస్తారు. పీహెచ్‌సీ వైద్యులు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక్కో హాట్‌స్పాట్‌ ఏరియాలో తమకు కేటాయించిన ఇళ్లకు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తారు. అక్కడి ప్రజల్లో ఎవరికైనా అనుమానిత లక్షణాలుంటే వారిని గుర్తించి అవసరాన్ని బట్టి ఆస్పత్రులకు పంపిస్తారు. జ్వరం లేదా శ్వాసకోశ లక్షణాలు గుర్తించినప్పుడు ఎవరికివారు ఇళ్లలోనే వేర్వేరు గదుల్లో ఉండాలని సూచిస్తారు. హాట్‌స్పాట్‌లలో నిరంతరం పర్యవేక్షించేందుకు అవసరమైన వాలంటీర్లు, సహాయకులను జిల్లా అధికారులు ఏర్పాటు చేస్తారు. మున్సిపల్‌ సిబ్బంది ప్రతిరోజూ సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతోపాటు బ్లీచింగ్‌ పౌడర్‌తో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో అధికారులను సంప్రదించడానికి టోల్‌ ఫ్రీ నంబర్‌ ఇచ్చారు. 

జిల్లాలవారీగా హాట్‌స్పాట్‌ ప్రాంతాలు... 
– ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సిద్దిపేట, మెదక్‌ జిల్లాలను రక్షిత ప్రాంతాలుగానే గుర్తించారు. అయితే సంగారెడ్డి జిల్లాలోని 7 ప్రాంతాలను హాట్‌స్పాట్‌ కేంద్రాలుగా గుర్తించారు. సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్‌ సెంటర్, కొత్త బస్టాండ్‌ సెంటర్, అంగడిపేట్, జహిరాబాద్‌ టౌన్,  జహిరాబాద్‌ పట్టణంలోని గడిమాహేళా, కొండాపూర్, సంగారెడ్డి పట్టణంలోని మధురానగర్‌ ప్రాంతాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించారు. 
– ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 17 హాట్‌స్పాట్లు ఉన్నాయి. వరంగల్‌ అర్బన్‌లో జులైవాడ, సుబేదారి, ఈద్గా, కుమార్‌పల్లి, మండి బజార్, పోచమ్మ మైదాన్, చార్‌బౌళి, కాశిబుగ్గ, గణేష్‌ నగర్, నిజాంపుర, లక్ష్మీపురం, రంగంపేట, శంభునిపేట, బాపూజీనగర్, చింతగట్టు క్యాంపులను ఏర్పాటు చేశారు. 
– జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రం హాట్‌స్పాట్‌గా ఉంది. 
– జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ఎం.డీ.కాలనీ మిలీనియం క్వార్టర్స్‌ను హాట్‌స్పాట్‌గా గుర్తించారు. 
– మహబూబాబాద్‌ జిల్లాలో గడ్డిగూడెం, పక్కనున్న తండాను కంటైన్మెంట్‌ జోన్‌ పరిధిలో చేర్చారు. 
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 14 హాట్‌స్పాట్లను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు, షాహిన్‌నగర్, క్యూబా కాలనీ, ఎంఎం పహాడ్, దుబ్బచర్ల, మణికొండ (ఆరు) ఏరియాలను కంటైన్మెంట్‌ క్లస్టర్లుగా గుర్తించారు. వికారాబాద్‌ టౌన్‌లో రాజీవ్‌ నగర్, మధుకాలనీ, ఇసాక్‌ఖాన్‌ బాగ్, తాండూరు పట్టణంలోని శాంతి నగర్, ఇందిరమ్మ కాలనీ, పరిగి పట్టణంలోని వల్లబ్‌ నగర్, ఎన్టీఆర్‌ నగర్, మర్పల్లిలో హాట్‌స్పాట్లు ఉన్నాయి. 
– నిజామాబాద్‌ జిల్లాలో 19 ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా ప్రకటించారు. నిజామాబాద్‌లో హైమద్‌పుర, బర్కత్‌పుర, గౌతంనగర్, ఎల్లమ్మగుట్ట, మాలపల్లి, ఆటోనగర్, ఖిల్లా రోడ్, హబీబ్‌నగర్, చంద్రశేఖర్‌కాలనీలు ఉన్నాయి. ఇక బోధన్‌లో శక్కర్‌నగర్, రాకాసిపేట్, శక్కర్‌నగర్‌ చౌరస్తా ఉన్నాయి. రెంజల్‌లో కందకుర్తి గ్రామం (9వ వార్డు), మోస్రాలో 9వ వార్డు, మాక్లూర్‌లో మైనారిటీ కాలనీ, నందిపేటలో బర్కత్‌పుర, భీంగల్‌లో బొదిరెగల్లీ, బాల్కొండలో ఆత్తర్‌గల్లీ, ఆర్మూర్‌లో జిరాయిత్‌నగర్‌ ఉన్నాయి. 
– కామారెడ్డి జిల్లాలో మూడు ప్రాంతాలను హాట్‌స్పాట్‌ క్లస్టర్లుగా గుర్తించారు. బాన్సువాడ పట్టణంలోని టీచర్స్‌ కాలనీ, ఆరాఫత్‌కాలనీ, మదీనా కాలనీ వీటి పరిధిలో ఉన్నాయి. 
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 12 హాట్‌స్పాట్‌లు ఉన్నాయి. కరీంనగర్‌లో ఇండోనేసియన్లకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలగానే ముకరంపురా, కశ్మీర్‌గడ్డ ప్రాంతాలను మార్చి 19 నుంచే రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ప్రభుత్వం తాజాగా హాట్‌స్పాట్‌ల నిర్ణయంతో ఈ రెండు ప్రాంతాలతోపాటు హుస్సేనిపురా, మంకమ్మతోటలను కూడా కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల జాబితాలో చేర్చారు. హుజూరాబాద్‌ పట్టణంలోని కాకతీయ కాలనీ, మార్కెట్‌ ఏరియా, విద్యానగర్, మామిండ్లవాడలోని 1,620 ఇళ్లను ఈ పరిధిలోకి తెచ్చారు. 
– పెద్దపల్లి జిల్లాలోని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్టీపీసీ అన్నపూర్ణ నగర్‌ కాలనీ, గోదావరి ఖనిలను హాట్‌స్పాట్లుగా ప్రకటించి ఆ ప్రాంతాలను మూసివేశారు. 
– జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బ, కల్లూరు గ్రామాలలో హాట్‌స్పాట్లను ఏర్పాటు చేశారు. 
– ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదిలాబాద్‌ అర్బన్‌ (19 వార్డులు),  నేరడిగొండ మండలం (మూడు గ్రామాలు), ఉట్నూర్‌ మండలం (ఐదు గ్రామాలు) పరిధిలో 72,666 మంది ప్రజలను హోంక్వారంటైన్‌కు పరిమితం చేశారు. 
– నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని గాజుల్‌పేట్, మొఘల్‌పుర, గుల్జార్‌ మార్కెట్, జోహ్రానగర్‌ ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. భైంసా పట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన మదీనాకాలనీ, పాండ్రి గల్లీలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. 
– ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10 ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించారు. నల్లగొండ పట్టణం పరిధిలో మీర్‌ బాగ్‌ కాలనీ, రహమత్‌ నగర్, బర్కత్‌పుర, మాన్యం చెలక, మిర్యాలగూడ పట్టణంలో సీతారాంపురం, దామరచర్ల మండలంలో దామరచర్ల ఈ జాబితాలో ఉన్నాయి. 
– సూర్యాపేట జిల్లాలో 4 హాట్‌స్పాట్‌లు ఉన్నాయి. సూర్యాపేట పట్టణంలో కుడకుడ, భగత్‌సింగ్‌ నగర్, కొత్తగూడెం బజార్, నాగారం మండలంలో వర్ధమానుకోట ఉన్నాయి. 
– మహబూబ్‌నగర్‌ జిల్లాలో 5 ప్రాంతాలను హాట్‌స్పాట్‌ కేంద్రాలుగా గుర్తించారు. రామయ్య బౌళి, మర్లు, బీకే రెడ్డి కాలనీ, సద్దలగుండు, షాషాబ్‌ గుట్ట (కొంత ప్రాంతం)లలో పకడ్బందీ చర్యలు కొనసాగుతున్నాయి. 
– జోగుళాంబ గద్వాల జిల్లాలో గద్వాల, అయిజ, శాంతినగర్, రాజోళి ప్రాంతాలను అధికారులు కంటైన్‌మెంట్‌ జోన్లుగా గుర్తించారు. గద్వాల జిల్లా కేంద్రంలోని 37 వార్డులను కంటోన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. అయిజలో 12, 17, 19, 20 వార్డుల పరిధిలోని కమతంపేట, కాలమ్మపేట, రంగుపేట, తెలుగుపేట, గుర్రంతోట, ఉప్పరిపేట, కుమ్మరిపేట, నదీమ్‌ మసీద్‌ కాలనీ, బ్రాహ్మణ వీధి, సంత బజార్, అంబేడ్కర్‌ కాలనీ, టీచర్స్‌ కాలనీలను కంటోన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. శాంతినగర్‌లో 7వ వార్డు పరిధిలోని జమ్ములమడుగుకు చెందిన ముగ్గురుకి పాజిటివ్‌ రాగా, అందులో ఒకరు మృతి చెందారు. దీంతో 7వ వార్డుతో వడ్డెపల్లి, శాంతినగర్‌ ప్రాంతాల్లోని 3, 4, 5, 6, 8, 8, 10 వార్డులను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. రాజోళిలో రెండు కేసులు నమోదవడంతో మండల కేంద్రాన్ని పూర్తిగా కంటైన్‌మెంట్‌ జోనుగా ప్రకటించి కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. 
– నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో గాంధీ పార్క్‌ కాలనీని హాట్‌స్పాట్‌గా గుర్తించారు. 
– కల్వకుర్తి పట్టణంలోని బలరాంనగర్, సుభాష్‌ నగర్‌ ప్రాంతాలను రెడ్‌ జోన్లుగా గుర్తించారు. 
– ఖమ్మం జిల్లాలో హాట్‌స్పాట్‌ ప్రాంతాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ మాలతీ తెలిపారు. అయితే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో హాట్‌స్పాట్‌ తరహాలోనే ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలతోపాటు ప్రజలు స్వీయ నిర్బంధం పాటించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఖిల్లా, పెద్దతండా ప్రాంతాల ప్రజలు బయటికి రావద్దని కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement