సాక్షి, హైదరాబాద్: దసరా, దీపావళి పండుగల సం దర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే నగరవాసులకు ఈసారి ప్రయాణంలో కష్టాలు ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. సాధారణంగా పండుగలు, వరుస సెలవులను దృష్టిలో ఉంచుకొని కనీసం నెల, 15 రోజులు ముందే ప్రత్యేక రైళ్లను ప్రకటించే దక్షిణమధ్య రైల్వే ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకటి, రెండు మార్గాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా భారీ చార్జీలు వసూలు చేసే సువిధ రైళ్లు మినహా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.
హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్ రైళ్లలో ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్ వందల్లోకి చేరింది. ఏసీ, నాన్ ఏసీ బెర్తులన్నీ బుక్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక రైళ్లు వేయడం, రెగ్యులర్ రైళ్లలో బోగీలు పెంచడం మాత్రమే పరిష్కారం. కానీ ఇప్పటివరకు అధికారులు ఆ దిశగా దృష్టి సారించకపోవడం గమనార్హం. తెలంగాణ ఆర్టీసీ దసరా సెలవుల సందర్భంగా 4 వేలకు పైగా ప్రత్యేక బస్సులను ప్రకటించింది. దూరప్రాంతాలకు వెళ్లే అన్ని బస్సుల్లోనూ 50 శాతం అదనపు చార్జీలను విధించింది. అతి తక్కువ ప్రయాణ చార్జీలతో, స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించే మెజారిటీ ప్రయాణికులకు ఈ చార్జీలు భారం కానున్నాయి.
చివరి నిమిషంలో హడావుడిగా..
చివరి నిమి షం వరకు వేచి చూసి హడావుడిగా అదనపు రైళ్లను ప్రకటించడం దక్షిణమధ్య రైల్వేలో ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది. దీంతో ముందస్తు రిజర్వేషన్‌లకు అవకాశం లేకుండా పోతుంది. రెగ్యులర్ రైళ్లలో భారీగా నమోదయ్యే వెయిటింగ్ లిస్టు చూసి ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఆర్టీసీ, ప్రైవేట్ వంటి ప్రత్యామ్నాయ వాహనా ల వైపు వెళ్తున్నారు. సాధారణ రోజుల్లో జంటనగరాల నుం చి 2.5 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండగా.. పండుగలు, వరుస సెలవుల్లో 3 నుంచి 3.5 లక్షల మంది అదనంగా బయలుదేరుతారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, కాకినాడ, బెంగళూర్, తిరుపతి, ముంబై మార్గాల్లో డిమాండ్‌బాగా ఉంది.
భారంగా సువిధ రైళ్లు..
పేద, మధ్యతరగతి వర్గాలకు చౌకగా లభించే రైల్వే ప్రయాణం ఈ ప్రీమియం రైళ్లతో భారంగా మారింది. దూరప్రాంతాలకు వెళ్లే అన్ని వర్గాల ప్రయాణికులకు అందుబాటులో ఉండే స్లీపర్ బోగీలను సైతం వదిలిపెట్టకుండా సువిధ సర్వీసుల పేరుతో రైల్వేశాఖ బెర్తుల బేరానికి దిగింది. ఈ రైళ్లలో విమాన సర్వీసుల తరహాలో ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి చార్జీలు పెరుగుతాయి. సాధారణ చార్జీలపై రెండు నుంచి మూడు రెట్లు అధికంగా విధిస్తారు. సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రస్తుతం సువిధ రైళ్లు వేశారు. ప్రయాణికుల రద్దీ బాగా ఉండే ఈ మార్గంలో సువిధ రైళ్లు భారంగా పరిణమించాయి.
Comments
Please login to add a commentAdd a comment