నల్లగొండ టూ టౌన్ :ఒక చిన్న విషయంపైనే తనను సరెండర్ చేయాలని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘ చర్చ పెట్టడంతో నీలగిరి మున్సిపల్ కమిషనర్ కె.అలివేలు మంగతాయారు కినుక వహించారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన ఘటనతో ఆమె ఇక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. కౌన్సిల్ సమావేశం అనంతరం గురువారం హైదరాబాద్ వెళ్లిన ఆమె తనకు 10 రోజులు సెలవు కావాలని మున్సిపల్ పరిపాలన శాఖకు విజ్ఞప్తి చేశారని, కానీ ఉన్నతాధికారులు ఆమె సెలవుపై వెళ్లేందుకు అంగీకరించలేదని తెలుస్తోంది.
సరెండర్ వెనుక ఆంతర్యం ఏమిటీ..?
మున్సిపల్ కమిషనర్‌గా అలివేలు మంగతాయారును తీసుకుచ్చిన అధికార పార్టీ నేతలే ఇప్పుడు ఆమెను సరెండర్ చేయాలని పట్టు పట్టడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో బహిరంగ రహస్యమే. ప్రకాశం బజార్‌లోని మున్సిపల్ మడిగెల వివాదమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ప్రకాశం బజార్‌లోని 234 మున్సిపల్ షాపులను లీజుకు ఇచ్చి 25 సంవత్సరాలు దాటింది. దీనిపై పలుసార్లు కోర్టులో కేసు నడిచింది. హైకోర్టు కూడా బహిరంగ వేలం పెట్టి లీజుకు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. దాదాపు ఏడాది అవుతున్నా వేలం నిర్వహించడానికి అనేక అడ్డంకులు తగిలాయి. రెండు సార్లు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వేలం పెట్టాలని తీర్మానం కూడా చేశారు. కానీ ఆ తరువాత బహిరంగ వేలం వేయకుండా అధికార పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలను కమిషనర్ ఖాత రు చేయకపోవడంతోనే ఇరువురి మధ్య సఖ్య త దెబ్బతిన్నట్లు తెలిసింది.
లీజులో ఉన్న వ్యా పారులు చేసిన లాబీయింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం కూడా చివరి నిమిషంలో నెల రోజులు వాయిదా వేయాలని వేలం నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ షాపుల లీజు బహిరంగ వేలం ఉద్యోగుల మెడపై కత్తిలా మారుతోంది. ఈ విషయంలో ముఖ్యంగా కమిషనర్‌పై అధికార పార్టీ నేతల ఒత్తిడి ఎక్కువ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు వివిధ పనుల కోసం వచ్చే కొంత మంది కౌన్సిలర్లు సైతం ఉద్యోగుల పట్ల అగౌరవంగా మాట్లాతున్నారనే విషయం బహిరంగ రహస్యమే. మున్సిపల్ కమిషనర్ అని కూడా చూడకుండా కొందరు కౌన్సిలర్లు మాట్లాడుతున్న తీరుపై మంగతాయారు గతంలో కూడా ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌కు కూడా ఈ విషయంలో ఫిర్యాదు చేశారు.
సరెండరే పరిష్కారమా?
కొంత కాలం నుంచి నీలగిరి మున్సిపాలిటీలో ఉద్యోగం చేయాలంటేనే ఉద్యోగులు హడలెత్తే పరిస్థితులు వచ్చాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కమిషనర్, ఇతర ఉద్యోగులు తప్పు చేసినప్పుడు ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలే తప్ప ఏకంగా కౌన్సిల్ సమావేశంలో ఒక ఉద్యోగిని ని సరెండర్ చేయాలని పట్టుపట్టడం ఇక్కడ చర్చానీయంశంగా మారింది. అసలు చేసిన తప్పు ఏంటో తేల్చకుండా సరెండర్ చేయాలని కౌన్సిలర్లు మాట్లాడడం వెనుక అంతర్యమేమిటనేది అంతు పట్టడం లేదు.
వీళ్లు ఎస్ అంటే.. వాళ్లు నో
వాస్తవానికి కమిషనర్‌ను సరెండర్ చేయాలనే డిమాండ్ విషయంలో మున్సిపాలిటీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష టీఆర్‌ఎస్‌ల మధ్య ఆధిపత్య పోరు కారణమనే వాదన వినిపిస్తోంది. ఇక్కడ ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాలు అందరికీ తెలిసినవే. అవి ప్రకాశం బజార్ మడిగెల విషయంలో మరింత ముదిరాయి. రాజకీయంగా లబ్ధిపొందేందుకు ఇరు పార్టీలు ఎత్తు మీద ఎత్తు వేస్తున్నాయి. ఇటీవలే ప్రకాశం బజార్ మడిగెల విషయంలో మున్సిపల్ ఛాంబర్ ఎదుట కాంగ్రెస్ కౌన్సిలర్లు ధర్నా నిర్వహించారు. దీంతో టీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు ఏకంగా కమిషనర్‌ను సరెం డర్ చేయాలనే ప్రతిపాదన తీసుకువచ్చారని రాజకీయ వర్గాలంటున్నాయి. అయితే, టీఆర్‌ఎస్ వాళ్లు సరెండర్ చేయాలనడంతో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు నో అనడం గమనార్హం.
నేను సెలవు పెట్టడం లేదు: కమిషనర్
ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ మంగతాయారును ‘సాక్షి’ వివరణ కోరగా తాను సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నానన్న విషయంలో వాస్తవం లేదని చెప్పారు. శాఖాపరమైన సమీక్ష కోసం తాను హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి వెళ్లానని, సెలవు పెట్టి వెళ్లే పరిస్థితుల్లో తాను లేనని తెలిపారు.
‘నీలగిరి’ కమిషనర్ కినుక !
Published Sat, Aug 1 2015 3:18 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement
Advertisement