
టీడీపీపై పోరాడిన యోధుడు వంగవీటి
రంగాకు నివాళులర్పించిన వైఎస్సార్‌సీపీ నేత అంబటి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ పాలనకు వ్యతిరేకంగా విజయవాడ నుంచి అనేక పోరాటాలు చేసిన యోధుడు వంగవీటి మోహన్‌రంగా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కొనియాడారు. రంగా వర్ధంతి సందర్భంగా ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులు అర్పించినట్టు చెప్పారు. రంగా వర్ధంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోట స్ పాండ్‌లో అంబటి విలేకరులతో మాట్లాడారు.
26 ఏళ్ల కిత్రం టీడీపీ గూండాల చేతిలో అతి దారుణంగా, అత్యంత కిరాతకంగా చంపబడిన ప్రజల మనిషి రంగా అని పేర్కొన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రజలను అణచివేసేందుకు పోలీసు బిల్లును తీసుకురావడానికి ప్రయత్నిస్తే, ఆ బిల్లుపై రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారని తెలిపారు. ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేని టీడీపీ గూండాలు గాంధేయ పద్ధతుల్లో నిరాహార దీక్ష చేస్తున్న రంగాని విజయవాడ నడిబొడ్డున అతిదారుణంగా హత్య చేశారని గుర్తు చేసుకున్నారు. మరణించినా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి రంగా అని కీర్తించారు.