పేద విద్యార్థులకు విదేశీ విద్య | Ambedkar Overseas Education Help BPL Students Nalgonda | Sakshi
Sakshi News home page

పేద విద్యార్థులకు విదేశీ విద్య

Published Wed, Aug 21 2019 10:49 AM | Last Updated on Wed, Aug 21 2019 12:11 PM

Ambedkar Overseas Education Help BPL Students Nalgonda - Sakshi

సాక్షి, నల్లగొండ : ఒకప్పుడు పేద విద్యార్థులకు విదేశీ విద్య అందని ద్రాక్షగానే ఉండేది. ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రత్యేక విద్యానిధి పథకాన్ని చేపట్టింది. ఆయా శాఖల వారీగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను అర్హత ఆధారంగా ఎంపిక చేసి విదేశాల్లో పీజీ చదువులకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. దీంతో పేద విద్యార్థులకు విదేశీ విద్య సులభతరం అయింది. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. గత సంవత్సరం 14 మంది విద్యార్థులకు ఆర్థికసాయం అందించగా విదేశాల్లో చదువుతున్నారు. ఈ సంవత్సరం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గతంలో విదేశీ చదువుల కోసం రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే అది వచ్చేది కాదు. ఒకవేళ వచ్చినా కొంతమందికే కొద్దిమొత్తంలో ఇచ్చేవారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిబంధనలను సడలించడంతో ఆ పథకంతో మ రింతమందికి మేలు చేకూరుతోంది. 

నిబంధనలు సడలించిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం విదేశీ విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు నిబంధనల్లో సడలింపు తీసుకొచ్చింది. గతంలో విదేశీ విద్యను అభ్యసించేందుకు దరఖాస్తు చేసుకోవాలంటే రూ. రెండున్నర లక్షలు మాత్రమే ఉండాలి. రూ.10లక్షలు కూడా రుణం ఇచ్చేవారు కాదు. అదికూడా దరఖాస్తు చేసుకున్నవారిలో కొంతమందికే ఇచ్చేవారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పథకంలో సమూలంగా మార్పులు చేశారు. అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం అనే పేరుతో నామకరణం చేశారు. ఈ పథకం కింద విద్యార్థులు విదేశాల్లో అభ్యసించాలంటే ఇక్కడ డిగ్రీలో 60 శాతం మార్కులు కచ్చితంగా సాధించి ఉండాలి. కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.2.50లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. విదేశీ విద్యకు గతంలో రూ.10లక్షలు ఇవ్వగా ప్రస్తుతం దాన్ని రూ.20లక్షలకు పెంచింది. 

పది దేశాల్లో చదివేందుకు అవకాశం
యూఎస్, లండన్, ఆస్ట్రేలియా, సింగపూర్, జర్మనీ, జపాన్, న్యూ జిలాండ్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా తదితర దేశాల్లో పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం ద్వారా రూ.20లక్షల ఆర్థికసాయాన్ని అందిస్తుంది. దీంతో పాటు వీసా, విమాన చార్జీల ను కూడా ప్రభుత్వమే ఇస్తుంది. ఇం దుకు సంబంధిత డిగ్రీలో 60శాతం మార్కులు సాధించడంతో పాటు విదేశీ యూనివర్శిటీలు నిర్వహిం చిన జీఆర్‌ఈటీ, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్‌ తదితర లాంగ్వేజీ కోర్సుల్లో అర్హత కూడా సాధించి ఉండాలి. అదే విధంగా విదేశీ యూనివర్సిటీల్లో సీట్‌ వచ్చి ఉండాలి. మీసేవ నుంచి పొందిన కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రంతోపాటు వీసా, పాస్‌పోర్ట్‌ కలిగి ఉండి అర్హత కలిగిన ఎస్సీ విద్యార్థులు ఈపాస్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

2018–19లో 14 మంది విదేశాలకు..
14 మంది విద్యార్థులు గత సంవత్సరం పీజీ విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్లారు. ఇందులో 8మంది యూఎస్‌లో, ఐదుగురు ఆస్ట్రేలియాలో, ఒకరు కెనడాలో చదువుతున్నారు. 11మందికి రూ.20లక్షల చొప్పున, ముగ్గురికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించింది. 

ఈ సంవత్సరం దరఖాస్తులకు ఆహ్వానం
ఈ సంవత్సరం విదేశీ విద్య కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో ఇద్దరు దరఖాస్తులు చేసుకున్నారు. వారి ఎంక్వయిరీ పూర్తి చేశారు. ఆ ప్రక్రియ పూర్తయితే విదేశాల్లో చదువుకునే అవకాశం ఉంటుంది. 

విద్యానిధితో ఎందరికో ఉన్నత విద్య  
ప్రభుత్వం అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం ప్రవేశపెట్టడం ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు ఉన్నత విద్య చదువుకునే అవకాశం కలుగుతుంది. ఆర్థిక స్థోమత లేని వారు విదేశీ చదువులకు దూరం అవుతున్నారు. ప్రభు త్వ ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల ఎంతోమంది ఆర్థికంగా వెనుకబ డిన విదేశాల్లో ఉన్నత విద్యను అ భ్యసించేందుకు అవకాశం కలి గింది. దరఖాస్తుకు గడువు ఉంది.  
 – సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రాజ్‌కుమార్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement