
కోర్టులో లొంగిపోయిన తహసిల్దార్
4 రోజుల అజ్ఞాతానికి తెర ఈ నెల 28 వరకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న హైదరాబాద్ జిల్లా అంబర్‌పేట తహసీల్దార్ సంధ్యారాణి సోమవారం ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. న్యాయస్థానం ఆమెకు ఈ నెల 28 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అధికారులు ఆమెను చంచల్‌గూడ మహిళాజైలుకు తరలించారు. ఆమెకు యూటీ(అండర్ ట్రయల్) నంబర్ 4686 కేటాయించినట్లు సమాచారం. కోర్టు ఉత్తర్వుల మేరకు సంధ్యారాణిని ప్రత్యేక ఖైదీగా పరిగణిస్తున్నట్లు జైలు సూపరింటెండెంట్ బషీరాబేగం తెలిపారు. అయితే తనను ఈ కేసులో ఏసీబీ అన్యాయంగా ఇరికిస్తోందని సంధ్యారాణి బెయిల్ కోసం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.
మరోవైపు ఏసీబీ అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించడానికి మంగళవారం కోర్టులో పిటిషన్ వేయాలని ఏసీబీ నిర్ణయించింది. మలక్‌పేటలోని ఒక స్థలానికి ఎన్‌ఓసీ జారీ చేసే నిమిత్తం ఈ నెల 10న తహసీల్దార్ సంధ్యారాణి సూచనల మేరకు ఆమె సోదరుడు రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తహసీల్దార్ కోసం ఏసీబీ డీఎస్పీ రవికుమార్ నేతృత్వంలో అధికారులు మొదటి రోజు నుంచి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, కూకట్‌పల్లిలోని రెమిడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని రెండు రోజుల తర్వాత సంధ్యారాణి జిల్లా కలెక్టర్‌కు సమాచారం పంపించారు. దీంతో ఏసీబీ అధికారులు ఆమె చికిత్స పొందిన ఆస్పత్రికి వెళ్లారు. ఏసీబీ అధికారులు వెళ్లేలోపే ఆమె డిచ్చార్జి కావడంతో వెనుదిరిగారు. తాజాగా సోమవారం న్యాయవాదితో కలసి ఆమె ఏసీబీ కోర్టుకు హాజరు కావడంతో అధికారులు కంగుతున్నారు.