కరీంనగర్ : తరతరాలుగా అణిచివేతకు గురవుతూ.. సామాజిక న్యాయూనికి దూరమవుతున్న దళితుల సంక్షేమం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఎంతగానో తపిం చారు. అణగారిన వర్గాలకు ఆసరాగా ఉండేం దుకు రాజ్యంగంలో హక్కులు కల్పించాడు. ఇది జరిగి ఆరున్నర దశాబ్దాలు అవుతున్నా ఆ ఫలాలు మాత్రం దళిత వర్గాలకు అందడం లేదు. మహానేతల జయంతి, వర్ధంతి రోజుల్లో తప్పితే దళితుల గురించి పట్టని పాలకులు ఆ వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారనే ఆరోపణలున్నారుు.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తెచ్చామని ఓవైపు గొప్పలు చెప్పుకుంటూనే.. మరోవైపు ఆ నిధులను పక్కదారి పట్టించి ఎక్కడి సమస్యలను అక్కడే వదిలేశారు. ఫలితంగా దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. మంగళవారం అంబేద్కర్ జయంతి. తమ సమస్యలపై ప్రజాప్రతినిధులను, అధికారులను ప్రశ్నించేందుకు దళితులు సిద్ధమయ్యూరు. ఈ సందర్భంగా జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక కథనం.
నత్తనడకన భూ పంపిణీ పథకం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూపంపిణీ పథకం ఒక అడుగు ముందుకు... రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. వెయ్యి ఎకరాలను కోనుగోలు చేసి దళితులకు పంపిణీ చేయాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు 58 మంది లబ్దిదారులకు 155 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. జిల్లాలో 33 మండలాల నుంచి ఇంతవరకు భూమి కోనుగోలు ప్రతిపాదనలే అధికారులకు రాకపోవడం గమనార్హం.
అందని రుణాలు.. ఇబ్బందుల్లో నిరుద్యోగులు
గత ప్రభుత్వ హయూంలో స్వయం ఉపాధి కోసం దరఖాస్తులు పెట్టుకున్న నిరుద్యోగుల ఆశలు కలలుగానే మిగిలాయి. ఈ సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ ఉపాధి అవకాశాలను పది శాతానికి తగ్గించింది. 2013-14 సంవత్సరానికి 3,175 యూనిట్లకు రూ.32.15 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 2818 మంది యుతకు రూ.25.30 కోట్ల సబ్సిడీ మంజూరు చేసింది. బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో 357 మందికి మంజూరు కాలేదు. మంజూరైన యూనిట్లలో 2249 మందికి సబ్సిడీ విడుదల చేశారు.
మూతపడ్డ అంబేద్కర్ స్టడీసర్కిల్
దళిత విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా జిల్లా కేంద్రంలో నెలకొల్పిన అంబేద్కర్ స్టడీసర్కిల్ మూతపడింది. స్టడీసర్కిల్ రెండేళ్లు కూడా నడువకుండానే నిధులు లేవనే సాకుతో అధికారులు మూసివేశారు. దీంతో గత ఏడు సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ పొందాలనుకునే దళిత విద్యార్థులు ఆశలు అడియాశలుగానే మారాయి. స్టడీసర్కిల్ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సందర్శించడానికి మాత్రమే పరిమితమైంది.
తెగని లీడ్‌క్యాప్ లొల్లి
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయూం లో మలుపు పథకం ద్వారా లీడ్‌క్యాప్ పరిశ్రమను పెట్టి నిరుద్యోగ దళిత యువతకు, చర్మకారులకు ఉపాధి చూపిస్తామని ప్రకటించారు. ఇందుకోసం చొప్పదండి మండలం రుక్మాపూర్‌లో సర్వే నెంబర్ 513, 514, 516లో 135 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలాన్ని నాలుగేళ్ల క్రితం పోలీస్ బెటాలియన్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో లీడ్‌క్యాప్ లొల్లి హైదరాబాద్ దాకా చేరి నేటికీ తెగని పంచారుుతీగా మిగిలిపోరుుంది. జిల్లాలో మినీ లెదర్‌పార్కుల కోసం జమ్మికుంటలో 25 ఎకరాలు, రామగుండం మండలంలో 25 ఎకరాలు కేటాయించి నేటికీ నిధులు కేటాయించకుండా చుట్టూ ఫెన్సింగ్ సైతం ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ విషయంలో ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ నాటి సీఎం చంద్రబాబు నుంచి మొన్నటి వరకు ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చించినా ఫలితం లేకపోరుుంది.
అనర్హులకు పట్టాలు... అర్హులకు మొండిచేయి
ఇరవై ఏళ్ల క్రితం ఎల్‌ఎండీలో ముంపుకు గురైన హస్నాపూర్ గ్రామ దళితులకు ఎస్సారెస్పీ భూమిని నివేశన స్థలాల కోసం కేటాయిస్తూ పట్టాలు ఇచ్చారు. పట్టాలు అందుకున్న వారిలో అనర్హులే చాలా మంది ఉన్నారు. నిజమైన అర్హులకు కొందరికి పట్టాలిచ్చినప్పటికీ హద్దులు చూపకోపవడంతో ఇప్పటికీ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అంబేద్కర్, బాబుజగ్జీవన్‌రాం జయంతి వేడుకల్లో వినతిపత్రాలు సమర్పించడమే కాకుండా కలెక్టరేట్ ముందు దీక్షలు చేపట్టినా స్థలాల సమస్య కొలిక్కి రాలేదు.
కమ్యూనిటీ భవనం స్థలం కబ్జా
కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అంబేద్కర్ భవన సముదాయానికి కేటాయిస్తూ అప్పటి కలెక్టర్ సుమితాడావ్రా హయంలో సర్వేనెంబర్ 11404/22లో 19 గుంటలకు పత్రాలు అందజేశారు. సదరు స్థలం తమదేనంటూ ఇతరులు అక్రమణ నిర్మాణాలకు పూనుకున్నారు. ఈ గొడవ పదేళ్లుగా దళిత సంఘాల నేతలకు, భూ అక్రమణదారులకు మధ్య రగులుతూనే ఉంది.
ఆరు గుంటలు హాంఫట్
కోర్టు చౌరస్తా వద్ద ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం కోసం అప్పటి కలెక్టర్ 1986లో ఆరు గుంటల స్థలాన్ని కేటాయించి పట్టా కాగితాలు దళిత సంఘ నాయకులకు అందజేశారు. కానీ కొందరు ఎరుకుల కులస్థులు ఆ భూమి తమదేని గుడిసెలు వేసుకున్నారు. పదిహేనేళ్లుగా ఈ స్థలం సమస్యను ఎటూ తేల్చకపోవడం అధికారుల తీరుకు అద్దం పడుతోంది.
తేలని సరిహద్దు వివాదాలు...
ఎస్సీ కార్పొరేషన్ నుంచి భూమి కొనుగోలు పథకం కింద జిల్లాలో నిరుపేద దళితులకు భూములు కేటాయించిన ప్రభుత్వం పట్టా కాగితాలు ఇవ్వడంలో అలసత్వం వహిస్తోంది. హుస్నాబాద్ మండలం అక్కన్నపేటలో దళితులకు భూమి కేటాయించి పట్టా కాగితాలు ఇచ్చింది. అక్కన్నపేట సరిహద్దు గ్రామాలైన వరంగల్ జిల్లా ప్రజలు ఆ భూమి తమదని గొడవలకు దిగుతున్నారు. గొడవ తారాస్థారుుకి చేరడంతో రెండు జిల్లాల కలెక్టర్లు, డీఆర్‌ఓలు, కొలతల అధికారులు స్పందించి భూముల వివరాలు సేకరించినానేటికీ సరిహద్దు సమస్య అలాగే ఉంది. మంథని నియోజకవర్గంలోని ధన్వాడ, మహదేవపూర్ మండలం పెద్దంపేట, లెంకలగడ్డ, కాటారం మండలం అంకుషాపూర్, చింతకానీ, ఈరాపూర్, పోతుల వాయి, ఇబ్రహీంపేట, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో వందలాది ఎకరాల భూములు ఎస్సీలకు భూమి కోనుగోలు కింద పట్టాలు ఇచ్చారు. వాటికి నేటికి హద్దులు చూపలేదు.
అందని వివాహ ప్రోత్సాహకాలు
ఎస్సీలను ఇతర కులాల వారు వివాహమాడితే అందించాల్సిన వివాహ ప్రోత్సాహక పారితోషికాలు అందించడంలో సైతం జాప్యం జరుగుతోంది. పారితోషకం కోసం 212 జంటలు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారుు. జిల్లాలో ఎస్సీ సంక్షేమ హాస్టళ్లు వంద ఉండగా, అందులో 65కు మాత్రమే పక్కా భవనాలున్నారుు. మిగిలిన హాస్టళ్లు అరకొర వసతులు మధ్య అద్దె భవనాల్లో కొనసాగుతున్నారుు.
తేలని అట్రాసిటీ నూతన కమిటీ
దళితుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మూడు నెలలకోసారి జరగాల్సిన ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ సమావేశం తూతుమంత్రంగా సాగుతూ వినతులు ఇవ్వడానికే పరిమితమవుతోంది. మూడేళ్ల క్రితం అప్పటి మంత్రి నూతన కమిటీ వేయాలని అధికారులకు సూచించగా కమిటీ ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించి నాలుగేళ్లు గడుస్తున్నా నేటికి నూతన కమిటీ ఎంపిక ప్రక్రియ అతీగతీ లేకుండా పోయింది. బాధ్యతాయుతమైన కమిటీ సమావేశాలు సైతం సక్రమంగా నిర్వహించకపోవడమే కాకుండా కీలకమైన నిర్ణయాలు తీసుకోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు అధికారులకు, నేతలకు దాసోహమై సొంత పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారని దళితుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.
విగ్రహాలకు తొలగని ముసుగులు
బీఆర్.అంబేద్కర్, బాబుజగ్జీవన్‌రాం విగ్రహాలను ఆయా కుల సంఘాలు, దళిత సంఘాల నాయకులు ఏర్పాటు చేసుకున్నారు. నిధుల లేమితో జిల్లాలో దాదాపు 60పైగా విగ్రహాలు ముసుగులు తొడిగే ఉన్నాయి. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న నాయకులు, అధికారులు ముసుగేసిన అంబేద్కర్ విగ్రహాలను చూస్తున్నారే తప్ప నిధులు కేటాయించి ముసుగులు తొలగించిన దాఖాలాలు లేవు.
నేతల్లారా...సమస్యలివిగో..
Published Tue, Apr 14 2015 9:13 PM | Last Updated on Sun, Sep 3 2017 12:18 AM
Advertisement