మిర్యాలగూడ టౌన్: మారుతీరావుతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత వర్షిణి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రణయ్ హత్య కేసులో నిందితులు మారుతీరావు, శ్రవణ్‌కుమార్, కరీంలకు బెయిల్ మంజూరైన నేపథ్యంలో శనివారం ఆమె నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని నివాసంలో విలేకరులతో మాట్లాడారు. మారుతీరావు నుంచి తమకు ప్రాణహాని ఉందని తెలిసి కూడా బెయిల్ మంజూరు చేయడం సరికాదన్నారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. మారుతీరావు ఇళ్లు తనది కాదని.. తాను చనిపోయేవరకు ఈ ఫ్యామిలీతోనే ఉంటానని, అమృత ప్రణయ్‌గానే ఉంటానని పేర్కొన్నారు.
ప్రణయ్ తండ్రి బాలస్వామి మాట్లాడుతూ.. పీడీ యాక్టు కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితులు బయటకు రావడం వల్ల తమకు హాని ఉందని కోర్టుకు తెలియజేశామన్నారు. వారు బయటకు వస్తే అమృతను బలవంతంగా తీసుకెళ్తారని అనుమానం వ్యక్తం చేశారు. మారుతీరావు కుటుంబం నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు.
రక్షణ కల్పిస్తాం: ఎస్పీ రంగనాథ్
నిందితుల బారి నుంచి ప్రణయ్ కుటుంబ సభ్యులకు ఎటువంటి ముప్పు కలగకుండా రక్షణ కల్పిస్తామని జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. నిందితులకు బెయిల్ లభించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తరఫున తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment