సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వికెట్లు రోజుకు కొన్ని చొప్పున పడిపోతున్నాయి. వరుస వలసలతో కంగుతింటున్న ఆ పార్టీకి మరో ఇద్దరు ముఖ్య నేతలు రాజీనామాలు చేశారు. మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్, మహబూబ్‌నగర్‌కు చెందిన చిత్తరంజన్‌దాస్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. ఈమేరకు రాపోలు ఇక్కడ తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘మిత్రులారా..మీ ద్వారా భారమైన ఒక అంశాన్ని కాంగ్రెస్ కార్యకర్తల శ్రేణికి, తెలంగాణ ప్రజానీకానికి ప్రకటిస్తున్నా. 25 ఏళ్ల క్రియాశీలక కార్యకర్తగా అనుబంధం తర్వాత కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేశాను. మాతృ హృదయంతో ఆదరించిన సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపాను.
సంస్థాగత వ్యవహారాల బాధ్యుడిగా, మేనిఫెస్టో రూపశిల్పిగా, పొత్తులను నిర్ధారించిన వ్యక్తిగా, సమన్వయ కర్తగా బాధ్యతలు నిర్వహించాను. ఆరేళ్లపాటు రాజ్యసభలో ప్రతి ప్రస్తావనలో సంస్థ ఔన్నత్యాన్ని చాటాను. అగమ్య గోచరమైన స్థితిలో, అపసవ్య స్థితిలో అంతర్గత వ్యవహారాలు కొనసాగుతున్న తరుణంలో అనేక సూచనలు చేశాను. కానీ వినిపించుకునే ఓపిక కాంగ్రెస్‌కు లేదని తేటతెల్లమైంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తైన తర్వాతే నేను రాజీనామా సమర్పించాను’అని పేర్కొన్నారు. అలాగే సీనియర్లకు పార్టీలో గౌరవం లేదని, సామాజిక సమతుల్యత లోపించిన కారణంగానే తాను కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు చిత్తరంజన్‌దాస్ హైదరాబాద్‌లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే వీరు ఏ పార్టీలో చేరతారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment