మగ్గం నేస్తున్నఅనసూయ , అనసూయతో యువత సెల్ఫీ
భూదాన్‌పోచంపల్లి(భువనగిరి) : పోచంపల్లిలో సినీనటి, ప్రముఖ యాంకర్ అనసూయ(రంగమ్మత్త) సందడి చేశారు. చేనేత ప్రోత్సాహక మండలి అధ్యక్షుడు, చేనేత దినోత్సవ రూపకర్త ఎర్రమాద వెంకన్న ఆధ్వర్యంలో శుక్రవారం ఆమె పోచంపల్లిలోని మహామ్మాయి కాలనీలోని పలు చేనేత కార్మికుల గృహాలను సందర్శించారు. అక్కడ నూలు, చిటికి, రంగులద్దకం, మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలను పరిశీలించారు. కార్మికులతో ముచ్చటిస్తూ ఎన్నాళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నారు.. ఎంత గిట్టుబాటు అవుతుందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. మగ్గం నేసి, కండెలు చుట్టి కార్మికులను ఉత్సాహపరిచారు. అనంతరం కళాత్మకంగా చేనేత వస్త్రాలు రూపొందిస్తున్న ఆరుగురి కార్మిక కుటుంబాలను పూలమాలతో సన్మానించారు.
చిన్ననాటి జ్ఞాపకాలనుగుర్తుచేసుకున్న అనసూయ
తాను కూడా పోచంపల్లి ఆడపడుచునని, తనకు పోచంపల్లితో ఎంతో అనుబంధం ఉందని అనసూయ గుర్తుచేశారు. చేనేత కార్మికులతో ముచ్చటిస్తూ తాను పోచంపల్లి సుందర్‌రావు కూతురునని పరిచయం చేసుకున్నారు. 8వ తరగతిలో ఉండగా పోచంపల్లికి వచ్చానని ఇల్లు, చెరువు ఒక్కటే గుర్తుకున్నాన్నారు. 20 ఏళ్ల తర్వాత పోచంపల్లికి వచ్చానని, సొంతూరి ప్రజలు చూపిస్తున్న ఆదరణ మరువలేనిదని ఆనందభాష్పాలు రాల్చారు. ఇకపై వీలైనపుడల్లా పోచంపల్లికి వస్తానని హామీ ఇచ్చారు. ఇక్కత్ వస్త్రాలు ఎంతో నిండుదనంతో ఉంటాయన్నారు. ఈమె వెంట చేనేత రంగ నిపుణులు తడక యాదగిరి, చేనేత వర్గాల చైతన్యవేదిక జాతీయ అధ్యక్షుడు చిక్క దేవదాసు, సర్పంచ్ తడక లతావెంకటేశం, టీపీసీసీ కార్యదర్శి తడక కల్ప నాకుమారి, పట్నం కృష్ణకుమార్, టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు తడక రమేశ్, భారత లవకుమార్, చేనేత నాయకులు చింతకింది రమేశ్, పాలాది యాదగిరి, అంకం యాదగిరి, అంకం మురళి, ముసునూరి యాదగిరి, చిల్వేరు గోవర్థన్, కర్నాటి పురుషోత్తం, ఏర్వ నీలమ్మ, గోశిక అన్నపూర్ణ, శశిరేఖ, జోగు శ్రీనివాస్, గుద్దేటి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
ఇక్కత్ వస్త్రాలు అద్భుతం
ఇక్కత్ వస్త్రాలు అద్భుతంగా ఉన్నాయని, వాటిని చూసినా, ధరించినా అమ్మకు దగ్గర ఉన్నట్లుగా ఉంటుందని అనసూయ అభిప్రాయం వ్యక్తం చేశారు. పోచంపల్లి టూరిజం పార్క్‌లో ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘చేనేత పండుగ చేద్దాం.. చేనేత కళాకారులను ఘనంగా సన్మానిద్దాం’ అనే పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పోచంపల్లి నా జన్మభూమి అని, తాను చిన్నపుడు పోచంపల్లి చేనేత వస్త్రాలు వేసుకుని స్కూల్‌కు వెళ్తే బెడ్‌షీట్ ధరించి వచ్చిందని తోటి స్నేహితులు హేళన చేశారని చెప్పారు. కానీ నేడు వాళ్లు ముఖం చాటేసుకుంటున్నారని తెలిపారు. ఎంతో కష్టమైన చేనేత పనిని స్వయంగా చూడడం వల్ల ఈ వృత్తిపై మరింత గౌరవం పెరిగిందన్నారు. చేనేత కళను ప్రోత్సహించే ఏ కార్యక్రమానికైనా తాను రెడీ అని అన్నారు. చేనేత వస్త్రాలంటే కేవలం చీరలు అని అపోహ ఉంటుంది. కానీ నేటితరం యువత ధరంచే విధంగా అన్ని రకాల ఇక్కత్ వస్త్రాలు ఎంతో స్టైలిష్‌గా ఉన్నాయని చెప్పారు. అనంతరం అనసూయను పలువురు శాలువా కప్పి సన్మానించారు. అంతకుముందు చేనేత డిజిటల్ సాధికారిత సెంటర్‌ను సందర్శించి, ఇక్కత్ డిజైన్లను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment