అంగన్‌వాడీల విలీనం | Anganwadi merger | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల విలీనం

Published Wed, Jun 22 2016 1:30 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

Anganwadi merger

నల్లగొండ : అంగన్‌వాడీల విలీనానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. రోజులో కొన్నిగంటలు మాత్రమే తెరవడం, పిల్లలు వచ్చినా .. రాకున్నా పట్టించుకోకుండా ఉన్న కేంద్రాలను గుర్తించి, వాటిని సమీపంలోని మరొక సెంటర్‌లో కలపాలని నిర్ణరుుంచింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం మొదటి విడతలో నిర్వహించిన సర్వేలో 25 కేంద్రాలను గుర్తించింది. ఇందులో భాగంగా అధికారులు ఆరోగ్యలక్ష్మి పథకం లబ్ధిదారుల సంఖ్యనమోదుతో పాటు సంబంధిత కేంద్రంలో గ ర్భిణులు, బాలింతల  సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నారు. మూడు మాసాల్లో సగటున గర్భిణులు, బాలింతల సంఖ్య కనీసం ఐదుగురు లేకుండా ఉన్న కేంద్రాలను గుర్తించారు. వీటిని ఎత్తివేసి, సమీపంలోని సెంటర్లలో విలీనం చేశారు.
 
 జిల్లాలో 4,200 అంగన్ వాడీ కేంద్రాలు
 జిల్లాలో కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తూ.. గర్భిణులు, బాలింతలకు అవసరమైన పౌష్టికాహారం అందించడం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 18 అంగన్‌వాడీ ప్రాజెక్ట్‌ల పరిధిలో 4,200 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో మూడు నుంచి ఆరేళ్ల్ల లోపు ఉన్న 62 వేల మంది పిల్లలు ఉండగా.. గర్భిణులు, బాలింతలు కలిపి మొత్తం 47 వేల మంది లబ్ధిపొందుతున్నారు.  మాతాశిశు మరణాలను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు వారంలో ఆరు రోజులు ఆకుకూర, పప్పు, గుడ్డు, కూరగాయలతో కూడిన సంపూర్ణ భోజనం పెడుతోంది. దీంతోపాటు 200 మిల్లీలీటర్ల పాలు అందిస్తోంది. రక్తహీనతకు గురికాకుండా ఐరన్ మాత్రలు పంపిణీ చేస్తోంది. ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లల్లో పోషణ లోప నివారణకు ప్రతి నెలా రెండున్నర కిలోల బాలామృతం పంపిణీ చేస్తోంది.  
 
 మొదటి విడతలో గుర్తించినవి..
 మోత్కూరు ప్రాజెక్టు పరిధిలో జఠంగిబాయి కేంద్రాన్ని మోత్కూరు-5 కేంద్రంలో, తేర్యాల సెంటర్‌ను తేర్యాల-2 సెంటర్‌లో విలీనం చేశారు. పెద్దవూర ప్రాజెక్టు పరిధిలో పైలా న్ -3 సెంటర్‌ను పైలాన్ -8 సెంటర్‌లో, చింతపల్లి ప్రాజె క్టు పరిధిలో చేపూర్-2 సెంటర్‌ను చేపూర్-1 సెంటర్‌కు, హుజూర్‌నగర్ ప్రాజెక్టు పరిధిలో వేపలసింగారం సెంటర్-2ను వేపల సింగారం-1లో, చెన్నాయిపాలెంట మినీ సెంటర్‌ను చెన్నాయిపాలెం -1 సెంటర్‌లో, చెన్నాయిపాలెం రాయి తండా సెంటర్‌ను చెన్నాయిపాలెం-2 సెంటర్‌లో విలీనం చేశారు. మిర్యాలగూడ ప్రాజెక్టు పరిధిలో.. సేవ్యా తండా మినీ సెంటర్‌ను నందిపాడు మెయిన్ సెంటర్‌లో, గుగులోతు మినీ సెంటర్‌ను జంకుతండా మెయిన్ సెంటర్‌లో, డోంగ్లా సంకెం మినీ సెంటర్‌ను బొత్తల పాలెం మెయిన్ సెంటర్‌లో, దుగ్యా తండా సెంటర్‌ను అమర్యాతండాకు, దేవతల బాయి సెంటర్‌ను తోపుచర్ల-1 సెంటర్‌లో విలీనం చేశారు. ఆలేరు ప్రాజెక్టు పరిధిలో గంగాపురం తండా సెంటర్‌ను ముల్కలపల్లిలో కలిపేశారు.
 
  కోదాడ ప్రాజెక్టు పరిధిలో... కందిబండ సెంటర్-1ని సెంటర్-2లో, మేళ్లచెర్వు సెంటర్ -8ని సెంటర్-5లో, చిమిర్యాల సెంటర్-1 ను మంగలితండా, గోండ్రియాల సెంటర్ -1ను సెంటర్-2లో, దొండపాడు సెంటర్-1 ను గాంధీనగర్ తండా సెంటర్- 1లో, దొండపాడు సెంటర్-4ను సెంటర్-2లో, రేవూరు సెంటర్-1 ను సెంటర్- 3లో,  నడిగూడెం సెంటర్-2ను సెంటర్-3లో, కరివిరాల సెంటర్-1ను సెంటర్- 2లో, తెల్లబెల్లి సెంటర్-1ను సెంటర్-2లో, ఇందిరానగర్ మినీ సెంటర్‌ను మాదారంలో, రామా పురం సెంటర్-1ను సెంటర్-2లో విలీనం చేశారు.
 
 లాభనష్టాలు
 లబ్ధిదారులు తక్కువ ఉన్న కేంద్రాలను ఎత్తివేయడంతో ఇప్పటి వరకు అంగన్ వాడీ కార్యకర్త, సహాయకురాలు లేకుండా ఖాళీగా ఉన్న కేంద్రాల్లో వారిని సర్దుబాటు చేశారు. అంగన్ వాడీ కేంద్రాలకు చెల్లించే అద్దెలు, నిర్వహణ పేరిట చేస్తున్న నెలవారీ ఖర్చులు కూడా తగ్గుతాయి. తద్వారా ప్రభుత్వానికి ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. ఈ సెంటర్లు ఎత్తివేయడం ద్వారా గర్భిణులు, బాలింతలకు మాత్రం ఇబ్బందులు తప్పవు. పూర్వప్రాథమిక విద్యను అందించడానికి ఏర్పాటైన అంగన్‌వాడీ కేంద్రాల లక్ష్యం నెరవేరే అవకాశం ఉండదు. కేంద్రాలు ఎత్తివేసి దూరంలో ఉన్న మరొక కేంద్రంలో కలపడంతో లబ్ధిదారులు అంత దూరం వెళ్లిరావాల్సి ఉంటుంది.
 
 విలీనం మాత్రమే..
 ఐదు మంది లోపు లబ్ధిదారులు ఉన్న కేంద్రాలను సమీపం కేంద్రాల్లో విలీనం చేసే ప్రక్రియ జరుగుతోంది. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. ఆయా సెంటర్లలో మళ్లీ లబ్ధిదారులు పెరిగితే అక్కడే కేంద్రాన్ని తిరిగి ప్రారంభిస్తాం. అంతే తప్ప కేంద్రాన్ని పూర్తిగా రద్దు చేయరు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాతే విలీనం చేస్తున్నాం.
 - సునంద, ఐసీడీఎస్ పీడీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement