మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు
చింతపల్లి (దేవరకొండ) :పని ఒత్తిడి తట్టుకోలేక, తీవ్ర మనస్తాపంతో ఓ అంగన్‌వాడీ టీచర్ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నాగభూషణ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండల కేంద్రానికి చెందిన పగిళ్ల అన్నపూర్ణ(39) మండల కేంద్రంలోని అంగన్‌వాడీ సెంటర్–2లో ఆరు నెలల నుంచి టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. కొంత కాలం నుంచి అనారోగ్యం బారిన పడడం, పైస్థాయి అధికారుల ఒత్తిడి తట్టుకోలేక మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇరుగుపొరుగు వారు గమనించి బంధువులకు సమాచారం అందించగా తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లారు. అప్పటికే అన్నపూర్ణ మృతి చెందింది. మృతురాలి భర్త పదేళ్ల క్రితం మృతి చెందగా, ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
బంధువుల ఆందోళన
చింతపల్లి గ్రామానికి చెందిన అన్నపూర్ణ పదేళ్ల నుంచి గ్రామంలోని అంగన్‌వాడీ సెంటర్లో ఆయాగా కొనసాగుతోంది. ఆరు నెలల క్రితమే పదోన్నతిపై మండల కేంద్రంలోని అంగన్‌వాడీ సెంటర్–2లో టిచర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా గతంలో ఇక్కడ పని చేసిన అంగన్‌వాడీ టీచర్ రికార్డు సక్రమంగా నమోదు చేయకపోవడంతో పనిభారం అన్నపూర్ణపై ఎక్కువైంది. రాత్రి 10 గంటల సమయంలో రికార్డులు రాస్తుండేదని తల్లిదండ్రులు పేర్కొన్నారు. పలుమార్లు తల్లిదండ్రులు, తన కుమారులకు పని ఒత్తిడి పెరిగిందని కన్నీరుమున్నీరైనట్లు వారు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న సీడీపీఓ లావణ్యకుమారి సంఘటన స్థలానికి రాగా బంధువులు ఒక్కసారిగా ఆమెపై మండిపడ్డారు. మీ పనిఒత్తిడి కారణంగానే అన్నపూర్ణ మృతి చెందిందని ఆరోపించారు. ఇదిలా ఉండగా అన్నపూర్ణ మృతి చెందే కంటే ముందు అధికారుల పనిఒత్తిడి, అనారోగ్యం కారణంగా తాను చనిపోతున్నట్లు లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది.
Comments
Please login to add a commentAdd a comment