నల్లగొండ : అంగన్‌వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహించా లని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వేసవి కాలంలో పెరుగుతున్న పగటిపూట ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు ఈ నెల 13 నుంచి వేసవి సెలవులు ఇస్తున్న నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలకు ఈవెసులుబాటు కల్పించారు. ఉష్ణోగ్రతల్లో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల కేంద్రాల్లో పిల్లలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.
ఈ క్రమంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించిన మహిళా, శిశు సంక్షేమశాఖ.. అంగన్‌వాడీ కేంద్రాలను ఈ నెల 13 నుంచి వచ్చే నెల 31 వరకు ఒక్కపూటమాత్రమే నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 31 మండలాల్లో 2,093 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కేంద్రాలు 1,832, మినీ కేంద్రాలు 261 ఉన్నాయి. వీటిల్లో చాలాచోట్ల సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో..అందులోనూ ఇరుకు గదుల్లో పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్యాన్ల సౌకర్యం లేక అరకొర వసతులతో సర్దుకుపోతున్నారు. దీనికితోడు ఇరుకైన గదులు కావడంతో గాలి, వెలుతురు సరిగాలేక ఉక్కపోతతో చిన్నారులు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో అంగన్‌వాడీ కేంద్రాలను ఒక్కపూట నిర్వహించడంతో పిల్లలకు, సిబ్బందికి ఉపశమనం కలిగించినట్లు అవుతుంది.
12 గంటల వరకే కేంద్రాలు...
ఇప్పటిదాకా పాఠశాలలు మాత్రమే ఒక్కపూట నిర్వహించారు. వాటికి అనుసంధానంగా కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. దీంతో చిన్నారులకు ఇబ్బంది తప్పడం లేదు. అంగన్‌వాడీ టీచర్ల కోరిక మేరకు ప్రభుత్వం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఒంటిపూట సమయంలోనే చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి. మధ్యాహ్నం 12 గంటల తర్వా త పౌష్టికాహారం అందించి ఇంటికి పంపాలి. కేంద్రాల వద్ద వేసవి జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్వహణ పకడ్బందీగా నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment