హైదరాబాద్: సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్)లో పని చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకులకు గౌరవ వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వేతన పెంపుతో పాటు వర్కర్లు, హెల్పర్లు నిర్వహించాల్సిన విధులు, బాధ్యతలు, క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. మార్చి ఒకటో తేదీ నుంచే వేతన పెంపు అమల్లోకి వస్తుందని, వేతనాలను నేరుగా బ్యాంకు ఖాతాలకే జమ చేయాలని సీడీపీవోలను ప్రభుత్వం ఆదేశించింది.
ఏడాదికి 12 క్యాజువల్ సెలవులతో పాటు ప్రత్యేక పరిస్థితుల్లో సెలవు అవకాశాలను కూడా కల్పించింది. కాగా, ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతలకు ఒకపూట ఆహారాన్ని అంగన్‌వాడీల్లోనే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అంగన్‌వాడీల్లో అందిస్తున్న ఆహార పరిమాణాన్ని, ధరలను పెంచుతూ ప్రభుత్వం మరో ఉత్తర్వును జారీ చేసింది. ప్రతిరోజూ ఒక్కో వ్యక్తికి అందించే ఆహార పరిమాణం పెంచడంతో పాటు ప్రస్తుతం వ్యయాన్ని రూ.15 నుంచి రూ.21 కు పెంచింది.
అంగన్‌వాడీల్లో విధులిలా..
అంగన్‌వాడీ కేంద్రాల్లో వర్కర్లకు 24 రకాలు, హెల్పర్లకు 7 రకాల విధులను సూచిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలి.
చిన్నారులకు ఉడకబెట్టిన గుడ్లను ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు పంపిణీ చేయాలి.
ప్రత్యేక రోజుల్లో బాలామృతం, 8 గుడ్లు ఇవ్వాలి.
ఇమ్యునైజేషన్, డీవార్మింగ్ నిమిత్తం ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లను భాగస్వాములు చేయాలి.
ఐసీడీఎస్ వేదికల (ఐజీఎంఎస్‌వై, ఆర్ ఎస్‌బీకే,కేఎస్‌వై.. తదితర)తో సమన్వయం చేసుకోవాలి.
అంగన్‌వాడీ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, పరిశుభ్రమైన ఆహారాన్ని పంపిణీ చేయాలి.
చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలకు తీసుకురావాలి. అంగన్‌వాడీ వర్కర్లు చెప్పిన విధులను నిర్వహించాలి.
ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలనైనా నిర్వహించేందుకు వర్కర్లు, హెల్పర్లు సిద్ధంగా ఉండాలి.
‘అంగన్‌వాడీ’ వేతనాలు పెంపు
Published Sun, May 24 2015 1:49 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
Advertisement