హవేళిఘణాపూర్ : మినీ అంగన్‌వాడీ వర్కర్లకు రూ. 10,500 పెంచాలని సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లతో కలిసి సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.నర్సమ్మ మాట్లాడుతూ... ఐసీడీఎస్‌లో పని చేస్తున్న మినీ అంగన్‌వాడీ వర్కర్లకు తక్షణమే వేతనాలు పెంచి ఆదుకోవాలన్నారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా గుర్తించాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే హెల్పర్లకు రూ. 8వేల వేతనం చెల్లించడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.
హెల్పర్లకు పదోన్నతి కల్పించి టీచర్లుగా నియమించాలన్నారు. హెల్పర్లు చేస్తున్న పనికి ప్రభుత్వం ప్రకటించిన రూ. 6వేలు ఏమాత్రం సరిపోవన్నారు. హెల్పర్లకు తక్షణమే రూ. 8వేలు చెల్లించాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ల పోస్టులను భర్తీ చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. ధర్నా చేసిన వారిలో జిల్లా బాధ్యులు అంజలి, రేణుక, వాణి, బుజ్జమ్మ, సునీతా, సుజాత తదితరులున్నారు.