మంథని/కాళేశ్వరం: ఆగస్టు నాటికి అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తి చేసి నీరు నింపుతామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి ఈ ఏడాది నుంచే రెండు పంటలకు నీరందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజీ నిర్మాణ పనులపై శుక్రవారం మంత్రి సుమారు రెండు గంటల పాటు ఇంజనీరింగ్, ఏజెన్సీ నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బ్యారేజీ నిర్మాణ పనులు చూశారు.
అలాగే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారంలో నిర్మిస్తున్న గ్రావిటీ కాల్వలో చేపడుతున్న అండర్ టన్నెల్ పనులను పరిశీలించారు. వర్షాల కారణంగా గోదావరిలో నీటి ప్రవాహం పెరిగి కొట్టుకుపోయిన తాత్కాలిక నిర్మాణాలను చూశారు. గోదావరి వరద ఉధృతి ఉన్నా పనులు జరిగేలా ప్రణాళికలు చేయాలని, కావాలంటే ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి తెలిపారు. మరిన్ని భారీ యంత్రాలను తీసుకురావాలని ఆఫ్కాన్ ప్రతిని«ధులను ఈ సందర్భంగా కోరారు. గడువు దగ్గర పడుతోందని.. పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్, ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు.
మేడిగడ్డ బ్యారేజీని 2019 జనవరి లక్ష్యంగా పెట్టుకున్నట్లు హరీశ్ తెలిపారు. సుందిళ్ల బ్యారేజీలో నింపిన నీటిని ఎల్లంపల్లికి.. అక్కడి నుంచి మిడ్‌మానేరు ద్వారా వరంగల్, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల రైతాంగానికి నీరిస్తామన్నారు. రెండు బ్యారేజీల్లో 11 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ లక్ష్యం కాగా.. 10 లక్షలు పూర్తయిందన్నారు. సుందిళ్లలో 74 గేట్లకు 26 బిగింపు పూర్తయిందని తెలిపారు. ఇంతపెద్ద ఎత్తున చేపట్టిన బ్యారేజీల నిర్మాణం ఇంత తక్కువ కాలంలో పూర్తి కావడం చరిత్రలో నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు.
గోదావరి నదిపై ఎగువ ఎల్లంపల్లి ప్రాజెక్టును 12 ఏళ్ల పాటు నిర్మించారని, 21 గ్రామాలు ముంపునకు గురయ్యాయని చెప్పారు. దిగువన నిర్మిస్తున్న బ్యారేజీలు కేవలం 24 నుంచి 25 నెలల్లో పూర్తి చేయించే ప్రయత్నమే కాకుండా ఒక్క ఊరు, ఇల్లు మునగకుండా నీరు నిలుపుతున్నామని హరీశ్‌రావు తెలిపారు. వర్షాలతో కాస్త పనులకు ఆటకం కలిగిందన్నారు. వరద నీరు పంట పొలాల్లోకి వెళ్లకుండా ఫ్లడ్ డైవర్షన్ పనులు వేగంగా చేయాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు
అక్కడేమో ధర్నాలు.. ఇక్కడేమో కేసులు
వేరే రాష్ట్రాలలో ప్రాజెక్టు పనులు తొందరగా చేపట్టాలని విపక్షాలు ధర్నాలు చేస్తుంటే.. ఇక్కడ మాత్రం పనులు ఆపాలని కేసులు వేశాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క కాళేశ్వరంపైనే 86 కేసులు వేశారని గుర్తుచేశారు.
రైతుల ఆత్మహత్యలు ఆపాలని.. పచ్చని తెలంగాణ తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రింబవళ్లు కష్టపడుతుంటే ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్నాయని మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాల కంటే వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా ఉందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. వారు కౌరవుల్లా వ్యవహరిస్తున్నారని.. తమది పాండవుల పాత్ర అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment