sundilla byareji pump house
-
సుందిళ్ల టు రాజేశ్వర్రావుపేట
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టు బాట విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం పూర్వ జిల్లాలోని సుందిళ్ల బ్యారేజీ నుంచి మొదలైన పర్యటన ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేటలో ముగిసింది. ఉద్యమాల ఖిల్లా... సెంటిమెంట్ జిల్లా కరీంనగర్ నుంచే తొలి అధికారిక పర్యటనకు శ్రీకారం చుట్టిన సీఎం... రెండు రోజుల ప్రాజెక్టుబాట విజయవంతంగా ముగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన ఆయన... మంగళ, బుధవారాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్సీ పునరుజ్జీవం (రివర్స్ పంపింగ్) పనులను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హైదరాబాద్ నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మేడిగడ్డ బ్యారేజీ చేరుకున్న సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు కన్నేపల్లి పంపుహౌస్‌కు చేరుకుని పనుల పురోగతిని సమీ క్షించారు. అనంతరం సుందిళ్ల, గోలివాడ పంపుహౌస్‌లకు వెళ్లకుండానే సాయంత్రం 6 గంటలకు తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌కి చేరుకుని రాత్రి బస చేశారు. బుధవారం ఉదయమే ప్రాజెక్టుల పరిశీలన పర్యటనను మొదలు పెట్టారు. పెద్దపల్లి జిల్లా సుందిళ్ల బ్యారేజీ నుంచి జగిత్యాల జిల్లా రాజేశ్వర్రావుపేట రివర్స్ పంపింగ్ వరకు షెడ్యూల్ ప్రకారం పర్యటించిన సీఎం ప్రాజెక్టుల ప్రగతిపై అధికారులను వివరణ అడుగుతూ.. సూచనలు చేస్తూ ముందుకు సాగారు. మేడిపల్లి బ్యారేజీ, రాజేశ్వర్రావుపేట వద్ద ఎస్సారెస్పీ పునరుజ్జీవం పనుల్లో జాప్యంపై ఆయన అధికారులు, కాంట్రాక్టర్లపై అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. రాజేశ్వర్రావుపేట నుంచి హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. దీంతో సమయాభావం వల్ల సీఎం మల్యాల మండలం రాంపూర్ పర్యటన రద్దు కాగా, సీఎం రాకకోసం ఎదురుచూసిన ప్రజాప్రతినిధులు, అధికారులు తిరుగుపయనమయ్యారు. బ్యారేజీ, పంపుహౌస్ పనుల పరిశీలన.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో కన్నెపల్లికి చేరుకున్న ఆయన.. 13.2 కిలోమీటర్ల మేర అక్కడ జరుగుతున్న గ్రావిటీ కాలువ పనులను రోడ్డు మార్గంలో పరిశీలించారు. మార్గమధ్యంలో నాలుగు చోట్ల ఆగి గ్రావిటీ కాలువ పనులను చూశారు. పనులు నెమ్మదించడాన్ని గమనించిన ఆయన త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. లైనింగ్ పనులు మరింత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అక్కడినుంచి అన్నారం బ్యారేజీ వద్దకు వెళ్లారు. 66 గేట్ల బిగింపు, 90 శాతం పనులు అక్కడ పూర్తవ్వడంతో అధికారులను అభినందించారు. మిగిలిన పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సుందిళ్ల బ్యారేజీ వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు 2టీఎంసీల నీటిని ఎత్తిపోసే దిశగా పనులు జరగాలని, తర్వాత పంపుల ట్రయిల్ రన్ నిర్వహించాలని, ఈ ఖరీఫ్‌లో రైతులకు ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయానికి సాగునీరందాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం పనుల్లో వేగం మరింత పెంచాలని ఆయన సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా రోజుకు మూడు షిప్టల్లో పనులు జరగాలన్నారు. అనంతరం అంతర్గాం మండలంలో నిర్మిస్తున్న గోలివాడ పంప్‌హౌస్ పనులను పరిశీలించారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవంపై అసంతృప్తి... ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేటలో కొనసాగుతున్న రివర్స్ పంపింగ్ పనుల తీరుపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వరద కాలువ వద్ద నిర్మిస్తున్న పంపింగ్ నిర్మాణ పనుల పరిశీలన తర్వాత ఆయన 20 నిమిషాల పాటు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. పనులు 40శాతం కూడా జరగకపోవడంతో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నత్తనడకన పనులు జరుగుతుంటే నిర్ణీత గడువులోగా పనులు ఎలా పూర్తవుతాయని.. ఇలా అయితే అనుకున్న సమయానికి నీళ్లు అందించలేమన్నారు. రాజేశ్వర్రావుపేట పంప్‌హౌస్‌తో పాటు మల్యాల మండలం రాంపూర్‌లో నిర్మిస్లున్న పంప్‌హౌస్‌ను మార్చి 31 వరకు పనులు పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఈ రెండు పంప్‌హౌస్‌లకు కావాల్సిన సిబ్బందిని సమకూర్చుకుని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కావాల్సిన మిషన్లకు మెటీరియల్ చైనా నుంచి వచ్చిందని, మీకు కావాల్సిన భూమితో పాటు వసతులను కూడా జిల్లా యంత్రాంగం సమకూర్చిన తర్వాత పనుల్లో జాప్యమెందుకు జరుగుతోందని మండిపడ్డారు. మూడు నెలల్లో కార్మికులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని పనులను పూర్తి చేయాలని నవయుగ సంస్థను ఆదేశించారు. కేసీఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కర్యాదర్శి ఎస్కే.జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ముఖ్య మంత్రి ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశంగౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ, ఈఎన్సీ మురళీధర్, అనిల్‌కుమార్, ఈఎస్ఈ శ్రీకాంత్, తెలంగాణ నీటిపారుదల సలహాదారు పెంటారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్ సీఈ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సారెస్పీ సీఈ శంకర్, ట్రాన్స్‌కో ఎస్ఈ సంపత్‌రావు, నవయుగ ఇంజనీర్ కంపెనీ చైర్మన్ చంద వెంకటేశ్వర్రావు, వెంకటరమణారావు తదితరులు ఉన్నారు. -
కేసీఆర్ నయా సాల్ ముబారక్.. చలో కాళేశ్వరం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజె క్టుల నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టుల సందర్శన చేయ నున్నారు. జనవరి ఒకటిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో పర్యటించనున్నారు. రెండ్రోజుల పర్యట నలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌస్‌తో పాటు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథక పనులను పరీశీలించనున్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి వారంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించాలని ముఖ్యమంత్రి భావించినా, వాతావరణం అనుకూలించక పర్యటన వాయిదా పడింది. ప్రస్తుతం ఈ పర్యటన జరుగ నుంది. జనవరి 1న హైదరాబాద్‌లో జరిగే హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తుల ప్రమాణ స్వీకా రంలో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు పనుల సందర్శనకు బయలుదేరతారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ, పంపుహౌస్ నిర్మాణాలను పరిశీలిస్తారు. అదేరోజు సాయంత్రం కరీంనగర్ చేరుకుని, అక్కడే బస చేస్తారు. జనవరి 2న ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీకి నీరందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకం పనులు జరిగే ప్రాంతాలను సందర్శిస్తారు. రాజేశ్వరరావుపేట, రాంపూర్‌లో నిర్మాణంలో ఉన్న పంపుహౌస్ పనులను పరిశీలిస్తారు. అనంతరం హైదరాబాద్ చేరుకుంటారు. 3 లేదా 4న సమగ్ర సమీక్ష... సీఎం పర్యటనకు ముందే ఈ నెల 31న రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ, పంపుహౌస్ నిర్మాణ పనులను పరిశీలిస్తుంది. అదే రోజు సాయంత్రం రిటైర్డ్ ఇంజనీర్లు ముఖ్యమంత్రికి ప్రాజెక్టు పనుల పురోగతిని వివరిస్తారు. జనవరి 1న రిటైర్డ్ ఇంజనీర్ల బృందం పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు పనులు జరిగే ప్రాంతాలను సందర్శించి అక్కడ పనులను పర్యవేక్షిస్తుంది. జనవరి 2న సీతారామ ప్రాజెక్టు పనులను సందర్శించి హైదరాబాద్ చేరుకుంటారు. మూడు రోజుల పాటు కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, డిండి, సీతారామ ప్రాజెక్టులను సందర్శించే ఈ బృందం 2వ తేదీ సాయంత్రం హైదరాబాద్ చేరుకుని ముఖ్యమంత్రికి వివరాలు అందిస్తారు. 3 లేదా 4న కేసీఆర్ అన్ని ప్రాజెక్టులపై ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహిస్తారు. ప్రాజెక్టుల పూర్తి, లక్ష్యాలకు అనుగుణంగా కార్యాచరణ, కొత్త పథకాలు వంటి అంశాలపై అధికారులకు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం రెండో దశ ప్రాజెక్టుల సందర్శనలో ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు నుంచి కొండ పోచమ్మ సాగర్ వరకు జరుగుతున్న వివిధ పనులను పరిశీలిస్తారు. పాలమూరు–డిండి, సీతారామ ప్రాజెక్టులను కూడా సందర్శిస్తారు. ఈ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. మేడిగడ్డలో పెరిగిన వేగం.. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలి సమీక్ష సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారులు పనుల్లో వేగం పెంచారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ పనులను వేగవంతం చేయాలన్న ఆదేశాల నేపథ్యంలో ఇంజనీర్లు ఇక్కడి కాంక్రీట్ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నెల 22 ఉదయం నుంచి 23 ఉదయం వరకు 24 గంటల్లో ఏకంగా 16,722 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులతో రికార్డు సృష్టించిన ఇంజనీర్లు ఈ వారం రోజుల వ్యవధిలో 55,844 క్యూబిక్ మీటర్ల మేర పనులు చేశారు. 29 శనివారం ఉదయం నుంచి 30వ తేదీ ఉదయం 8 గంటల వరకు సైతం 9,250 క్యూబిక్ మీటర్ల పనులు చేశారు. మొత్తంగా మేడిగడ్డ పరిధిలో 17,89,382 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు 13,13,876 క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పనులను మరింత వేగం పెంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నల్లా వెంకటేశ్వర్లు నేతృత్వంలో సుమారు 400 మంది ఇంజనీర్లు నిత్యం పనుల పర్యవేక్షణలో మునిగి తేలారు. -
ఆగస్టు నాటికి అన్నారం, సుందిళ్ల
మంథని/కాళేశ్వరం: ఆగస్టు నాటికి అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తి చేసి నీరు నింపుతామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి ఈ ఏడాది నుంచే రెండు పంటలకు నీరందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజీ నిర్మాణ పనులపై శుక్రవారం మంత్రి సుమారు రెండు గంటల పాటు ఇంజనీరింగ్, ఏజెన్సీ నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బ్యారేజీ నిర్మాణ పనులు చూశారు. అలాగే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారంలో నిర్మిస్తున్న గ్రావిటీ కాల్వలో చేపడుతున్న అండర్ టన్నెల్ పనులను పరిశీలించారు. వర్షాల కారణంగా గోదావరిలో నీటి ప్రవాహం పెరిగి కొట్టుకుపోయిన తాత్కాలిక నిర్మాణాలను చూశారు. గోదావరి వరద ఉధృతి ఉన్నా పనులు జరిగేలా ప్రణాళికలు చేయాలని, కావాలంటే ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి తెలిపారు. మరిన్ని భారీ యంత్రాలను తీసుకురావాలని ఆఫ్కాన్ ప్రతిని«ధులను ఈ సందర్భంగా కోరారు. గడువు దగ్గర పడుతోందని.. పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్, ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీని 2019 జనవరి లక్ష్యంగా పెట్టుకున్నట్లు హరీశ్ తెలిపారు. సుందిళ్ల బ్యారేజీలో నింపిన నీటిని ఎల్లంపల్లికి.. అక్కడి నుంచి మిడ్‌మానేరు ద్వారా వరంగల్, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల రైతాంగానికి నీరిస్తామన్నారు. రెండు బ్యారేజీల్లో 11 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ లక్ష్యం కాగా.. 10 లక్షలు పూర్తయిందన్నారు. సుందిళ్లలో 74 గేట్లకు 26 బిగింపు పూర్తయిందని తెలిపారు. ఇంతపెద్ద ఎత్తున చేపట్టిన బ్యారేజీల నిర్మాణం ఇంత తక్కువ కాలంలో పూర్తి కావడం చరిత్రలో నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. గోదావరి నదిపై ఎగువ ఎల్లంపల్లి ప్రాజెక్టును 12 ఏళ్ల పాటు నిర్మించారని, 21 గ్రామాలు ముంపునకు గురయ్యాయని చెప్పారు. దిగువన నిర్మిస్తున్న బ్యారేజీలు కేవలం 24 నుంచి 25 నెలల్లో పూర్తి చేయించే ప్రయత్నమే కాకుండా ఒక్క ఊరు, ఇల్లు మునగకుండా నీరు నిలుపుతున్నామని హరీశ్‌రావు తెలిపారు. వర్షాలతో కాస్త పనులకు ఆటకం కలిగిందన్నారు. వరద నీరు పంట పొలాల్లోకి వెళ్లకుండా ఫ్లడ్ డైవర్షన్ పనులు వేగంగా చేయాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు అక్కడేమో ధర్నాలు.. ఇక్కడేమో కేసులు వేరే రాష్ట్రాలలో ప్రాజెక్టు పనులు తొందరగా చేపట్టాలని విపక్షాలు ధర్నాలు చేస్తుంటే.. ఇక్కడ మాత్రం పనులు ఆపాలని కేసులు వేశాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క కాళేశ్వరంపైనే 86 కేసులు వేశారని గుర్తుచేశారు. రైతుల ఆత్మహత్యలు ఆపాలని.. పచ్చని తెలంగాణ తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రింబవళ్లు కష్టపడుతుంటే ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్నాయని మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాల కంటే వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా ఉందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. వారు కౌరవుల్లా వ్యవహరిస్తున్నారని.. తమది పాండవుల పాత్ర అని చెప్పారు. -
సుందిళ్ల రైతులకు కోర్టులో చుక్కెదురు
అనుబంధ పిటిషన్లు కొట్టేసిన న్యాయమూర్తి సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథ కం కోసం పెద్దపల్లి జిల్లా గౌలివాడలో నిర్మి స్తున్న సుందిళ్ల బ్యారేజీ పంపుహౌస్ అంశంపై హైకోర్టును ఆశ్రయించిన రైతులకు చుక్కెదురైంది. 240 ఎకరాల విషయంలో జోక్యం చేసుకోకుండా, తమను భూముల నుంచి ఖాళీ చేయించకుండా ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. పంపుహౌస్ పనులకు అనుమతిస్తూ సీసీఎల్ఏ ఉత్తర్వుల అమలును నిలిపేయాలన్న అభ్యర్థననూ తిరస్కరిస్తూ.. వారి అనుబంధ పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ శనివారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులు పనులకు అడ్డంకి కాదు గౌలివాడలో సేకరించ తలపెట్టిన 240 ఎకరాల భూముల స్వాధీనం విషయంలో తాము తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు జోక్యం చేసుకోవద్దని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ రైతులను బలవంతంగా వారి భూముల నుంచి ఖాళీ చేయిస్తోందంటూ గుడి వెంకటరెడ్డి, మరో ఐదుగురు రైతులు హైకోర్టులో అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం విచారించిన జస్టిస్ షమీమ్ అక్తర్.. శనివారం నిర్ణయాన్ని వెలువరించారు. పిటిషనర్లను, ఇతరులను వారి భూముల నుంచి ఖాళీ చేయించవద్దని ధర్మాసనం ఉత్తర్వులిచ్చిన మాట వాస్తవమే అయినా... తగిన పరిహారం చెల్లించి భూములను స్వాధీనం చేసుకునే విషయంలో అధికారులను ఆ ఉత్తర్వులు నియంత్రించడం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులను కొనసాగించేందుకు ఆ ఉత్తర్వులు అడ్డం కి కాదన్నారు. పరిహారం చెల్లించినట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాదే అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించారు. పిటిషనర్లు సదుద్దేశంతో కోర్టును ఆశ్రయించినట్లు కనిపించడం లేదని ఆక్షేపించారు. నిర్ణయించిన పరిహారా న్ని పిటిషనర్లు సవాలు చేయలేదని, పరిహా రం విషయంలో అభ్యంతరాలుంటే అందుకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్నారు. పరిహా రాన్ని అధికారులు డిపాజిట్ చేశారని, అత్యధికులు తీసుకున్నారని గుర్తు చేశారు. నష్టాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి తమ భూముల్లో పంటలు వేశామని, నిర్మాణ పనుల వల్ల ఆ పంటలు దెబ్బతిని నష్టం కలుగుతోందన్న పిటిషనర్ల వాదనలను ఈ దిశలో పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ వ్యాజ్యం విచారణార్హతపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని.. అయితే ఈ దశలో విచారణార్హతను నిర్ణయించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనుల విషయంలో అడ్వొకేట్ జనరల్, అదనపు అడ్వొకేట్ జనరల్ వేర్వేరు తేదీల్లో ఇచ్చిన అభిప్రాయాలను తప్పుపట్టలేమని... ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు జరిగే నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మొత్తంగా పిటిషనర్లు లేవనెత్తిన వాదనల్లో పసలేదని.. అధికారులు చట్టవిరుద్ధ చర్యలకు దిగారన్న పిటిషనర్ల వాదనలతో ఏకీభవించడం లేదని తెలిపారు. ఈ మేరకు రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టివేశారు.