సుందిళ్ల రైతులకు కోర్టులో చుక్కెదురు
అనుబంధ పిటిషన్లు కొట్టేసిన న్యాయమూర్తి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథ కం కోసం పెద్దపల్లి జిల్లా గౌలివాడలో నిర్మి స్తున్న సుందిళ్ల బ్యారేజీ పంపుహౌస్ అంశంపై హైకోర్టును ఆశ్రయించిన రైతులకు చుక్కెదురైంది. 240 ఎకరాల విషయంలో జోక్యం చేసుకోకుండా, తమను భూముల నుంచి ఖాళీ చేయించకుండా ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. పంపుహౌస్ పనులకు అనుమతిస్తూ సీసీఎల్‌ఏ ఉత్తర్వుల అమలును నిలిపేయాలన్న అభ్యర్థననూ తిరస్కరిస్తూ.. వారి అనుబంధ పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ శనివారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
ఆ ఉత్తర్వులు పనులకు అడ్డంకి కాదు
గౌలివాడలో సేకరించ తలపెట్టిన 240 ఎకరాల భూముల స్వాధీనం విషయంలో తాము తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు జోక్యం చేసుకోవద్దని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ రైతులను బలవంతంగా వారి భూముల నుంచి ఖాళీ చేయిస్తోందంటూ గుడి వెంకటరెడ్డి, మరో ఐదుగురు రైతులు హైకోర్టులో అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం విచారించిన జస్టిస్ షమీమ్ అక్తర్.. శనివారం నిర్ణయాన్ని వెలువరించారు.
పిటిషనర్లను, ఇతరులను వారి భూముల నుంచి ఖాళీ చేయించవద్దని ధర్మాసనం ఉత్తర్వులిచ్చిన మాట వాస్తవమే అయినా... తగిన పరిహారం చెల్లించి భూములను స్వాధీనం చేసుకునే విషయంలో అధికారులను ఆ ఉత్తర్వులు నియంత్రించడం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులను కొనసాగించేందుకు ఆ ఉత్తర్వులు అడ్డం కి కాదన్నారు.
పరిహారం చెల్లించినట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాదే అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించారు. పిటిషనర్లు సదుద్దేశంతో కోర్టును ఆశ్రయించినట్లు కనిపించడం లేదని ఆక్షేపించారు. నిర్ణయించిన పరిహారా న్ని పిటిషనర్లు సవాలు చేయలేదని, పరిహా రం విషయంలో అభ్యంతరాలుంటే అందుకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్నారు. పరిహా రాన్ని అధికారులు డిపాజిట్ చేశారని, అత్యధికులు తీసుకున్నారని గుర్తు చేశారు.
నష్టాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి
తమ భూముల్లో పంటలు వేశామని, నిర్మాణ పనుల వల్ల ఆ పంటలు దెబ్బతిని నష్టం కలుగుతోందన్న పిటిషనర్ల వాదనలను ఈ దిశలో పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ వ్యాజ్యం విచారణార్హతపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని.. అయితే ఈ దశలో విచారణార్హతను నిర్ణయించడం సాధ్యం కాదని పేర్కొన్నారు.
ప్రాజెక్టు పనుల విషయంలో అడ్వొకేట్ జనరల్, అదనపు అడ్వొకేట్ జనరల్ వేర్వేరు తేదీల్లో ఇచ్చిన అభిప్రాయాలను తప్పుపట్టలేమని... ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు జరిగే నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మొత్తంగా పిటిషనర్లు లేవనెత్తిన వాదనల్లో పసలేదని.. అధికారులు చట్టవిరుద్ధ చర్యలకు దిగారన్న పిటిషనర్ల వాదనలతో ఏకీభవించడం లేదని తెలిపారు. ఈ మేరకు రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టివేశారు.