సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని దామరచర్ల మండలంలో నిర్మించతలపెట్టిన యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంటు విషయంలో కీలకమైన అడుగు పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.16,070 కోట్ల రుణాన్ని రూరల్ ఎలక్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) మంజూరు చేసింది. ఈ మేరకు చెక్కును కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆర్‌ఈసీ అధికారులు అందజేశారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థికపరమైన అడ్డం కులు తొలగినట్టేనని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలకమైన భూసేకరణ పనులు కూడా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమని గుర్తిం చిన 1690 ఎకరాల భూసేకరణకు అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూములు కోల్పోయే వారు మరోమారు పరిహారం కోసం ఆందోళనలు ప్రారంభించారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ కింద పట్టాలున్న అటవీభూములు సాగులో లేకపోయినా తమకు పరిహారం చెల్లించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తుండడం గమనార్హం.
వడివడిగా అడుగులు..
ఆర్‌ఈసీ సహకారంతో దామరచర్ల మండలంలోని దిలావర్‌పూర్ అటవీ ప్రాంతంలో నిర్మించతలపెట్టిన 4,400 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం స్థానిక అధికార యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇక్కడ ప్రాజెక్టు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించిందే తడవుగా అప్పటి కలెక్టర్ చిరంజీవులు, ప్రస్తుత జేసీ ఎన్. సత్యనారాయణల నేతృత్వంలో మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు పర్యవేక్షణలో అటవీభూముల, ఇతర పట్టాభూముల గుర్తింపు ప్రక్రియను వారం రోజుల్లో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి అం దజేశారు. ఈ నివేదిక ఆధారంగా అటవీభూములకు పరి హారంగా ఇవ్వాల్సిన భూములను కూడా జిల్లా వ్యాప్తంగా గుర్తించి కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు కూడా పంపారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు 4,500 ఎకరాల అటవీభూమిని ఈ ప్రాజెక్టు కింద తీసుకునేందుకు అంగీకరించి, ఈ మేరకు జిల్లాలోని పలుచోట్ల ప్రభుత్వ భూములను కూడా అటవీశాఖ పరిధిలోనికి బదలాయించుకుంది.
ఈ ప్రక్రియ పూర్తి కావడంతో జూన్ నెల లో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు వచ్చి యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంటుకు శంకుస్థాపన కూడా చేసి వెళ్లారు. ఈ నేపథ్యంలో పట్టా, ఉడాఫ్‌భూముల సేకరణకు స్థానిక అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఇప్పటికే 870 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రాథమిక నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మరో 920 ఎకరాలకు నోటిఫికేషన్ సిద్ధం చేస్తున్నామని అధికారులు చెపుతున్నారు. ఈ సేకరణ ప్రక్రియ పూర్తయితే ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగిరం కానున్నాయి. అయితే, ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయే వారికి కూడా ప్రభుత్వం తరఫున మంచి పరిహార ప్యాకేజీనే రూపొందించినా, పరిహారం ఎవరికి చెల్లించాలన్న విషయంలో మళ్లీ నిర్వాసితుల నుంచి ఆందోళనలు ఎదురవుతున్నాయి.
తొలిదశలోనే ప్రతిఘటన
వాస్తవానికి ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రకటించి భూములను సర్వే చేస్తున్నప్పుడే మండలంలోని దిలావర్‌పూర్ అటవీరేంజ్‌లో తమ భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులు ఆందోళనలు చేశారు. సర్వే జరగకుండా అడ్డుకున్నారు. అయితే, ప్రభుత్వ ఆలోచనను నిర్వాసితులకు, స్థానిక రాజకీయ పక్షాలకు వివరించిన జేసీ సత్యనారాయణ, ఆర్డీఓ కిషన్‌రావు అప్పట్లో సర్వే ప్రక్రియను సజావుగా నిర్వహించగలిగారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ శంకుస్థాపనకు రావడానికి ముందు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు, జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డిలు కూడా స్థానికులను కలిసి ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజిని చెప్పి వారికి సర్దిజెప్పారు. అయితే, వారి వివరణకు సంతృప్తి చెందిన స్థానికులు కొంత సర్దుమణిగినా మళ్లీ ఆందోళనలు ప్రారంభించడం గమనార్హం.
పరిహారంలో మెలిక..
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గాను కేంద్ర పర్యావరణ శాఖ 4,676 ఎకరాలు అటవీభూములను కేటాయించింది. ఇక, పట్టా భూములు 197.14 ఎకరాలు, ఉడాఫ్ పట్టా భూములు 159.01 ఎకరాలు, ప్రభుత్వ భూములు 116.26 ఎకరాలున్నాయి. వీటిల్లో పట్టా, ఉడాఫ్ భూములకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వగా, అటవీ, ప్రభుత్వ భూముల్లో నిర్వాసితులు ఎవరు కబ్జాలో ఉన్నారన్న వివరాలు వెల్లడించాల్సి ఉంది. పవర్ ప్లాంట్‌లో పరిధిలో అటవీ హక్కుల చట్టం కింద (ఆర్‌వోఎఫ్‌ఆర్) పట్టాలు పొందిన రైతుల వివరాలు తమ వద్ద లేవని, అటవీశాఖ వద్ద మాత్రమే ఉన్నాయని స్థానిక అధికారులు చెపుతున్నారు. పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగనున్న ప్రాంతంలో ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టా ఉండి, సేద్యంలో ఉన్న భూములకు మాత్రమే నష్ట పరిహారం ఇస్తామని అంటున్నారు. అయితే, స్థానికులు మాత్రం సేద్యం చేయనప్పటికీ పట్టాలున్న రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ఈ ఆర్‌వోఎఫ్‌ఆర్ కింద ఇచ్చిన అటవీ భూములకు సంబంధించి కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. సుమారు 100 ఎకరాల వరకూ ఓ మాజీ ప్రజా ప్రతినిధి కుటుంబ సభ్యుల కబ్జాలో ఉన్నాయని, వీటిలో కొన్నింటికి ఆర్‌వోఎఫ్‌ఆర్ కింద పట్టాలున్నాయని, మరో పార్టీకి చెందిన మండలాధ్యక్షుడి చేతిలో 20 ఎకరాల వరకు భూమి ఉందని, ఈ భూమి కింద పరిహారం పొందేందుకు బినామీల పేరిట ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు పొందారని తెలుస్తోంది. ఈ విషయంలో స్థానిక రెవెన్యూ యంత్రాంగం కూడా రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టా భూముల విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోననే చర్చ స్థానికంగా జరుగుతోంది.
రుణమొచ్చేసింది!
Published Thu, Aug 13 2015 12:55 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement