హైదరాబాద్: 203 ఏళ్ల ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం. ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న అమ్మవారి బోనాల జాతరలో సమర్పించేందు కు బంగారు బోనాన్ని తయారుచేయిస్తున్నారు. బోనం తయారీ టెండర్‌ను దక్కించుకున్న మా నేపల్లి జువెలర్స్ ఇప్పటికే 94 శాతం పనులను పూర్తి చేసింది. అమ్మవారికి చేయించిన బంగారు బోనం ఎంతో అద్భుతంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బుధవారం మానేపల్లి జూవెలర్స్‌లో బోనం తయారీ పనులను ఆయన పరిశీలించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ అమ్మవారికి వినియోగించకుండా ఉన్న నగలను కరిగించి బోనం తయారు చేయాలని ఆలోచించి.. దాన్ని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లామని చెప్పారు. వారు వెంటనే దీనికి ఒప్పుకుని ఉత్తర్వులిచ్చారన్నారు. ఈ నెల 29వ తేదీన ఉదయం 8.30 గంటలకు ఎక్సైజ్ మంత్రి పద్మారావు బంగారు బోనాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకర ణ్‌రెడ్డికి అందచేస్తారని తెలిపారు. నిజామా బాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు ఇంద్రకరణ్‌రెడ్డి అందిస్తారని, అక్కడి నుంచి 2 వేల మంది లలితాపారాయణ సత్సంగ్ సభ్యులు, మహిళల ఆధ్వర్యంలో బోనాలతో అమ్మవారి దేవాలయానికి ర్యాలీగా బయలుదేరుతారని చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బంగారు బోనం అమ్మవారికి సమర్పించనున్నామని వివరించారు.
బోన భాగ్యం
అన్ని ఆభరణాల మాదిరిగా కార్ఖానాల్లో కాకుండా అమ్మవారి సన్నిధిలోనే బంగారు బోనం తయారు చేస్తున్నారు. ఎవరికైనా తెలిస్తే పనులకు ఆటంకం కలగడంతోపాటు నియమనిష్టలకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతో గోప్యంగా ఉంచారు.
- దేవాలయానికి చెందిన 3 కిలోల 80 గ్రాముల బంగారాన్ని కరిగించి ఈ బోనం తయారు చేస్తున్నారు. అమ్మవారి బోనం, దానిపై కలశ చెంబు, దీప ప్రమిద ఉంటుంది.
- ఈ నెల 15న బోనం తయారీ పని మొదలైంది. 10 మంది నియమనిష్టలతో దీన్ని తయారుచేస్తున్నారు.
- ఈ బోనంపై దేవాలయంలోని గర్భగుడిలో ఉండే మహంకాళి, మాణిక్యాలమ్మల మాదిరే బొమ్మలను తీర్చిదిద్దారు. ఈ బోనంపై 280 వజ్రాలను పొదిగి మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు.
- బంగారు ఆభరణాల తయారీకి యంత్రాలను వాడతారు. అమ్మవారి బోనం కావడంతో దీన్ని మొత్తం చేతిపనితోనే తయారు చేస్తున్నారు. రసాయనాలను వాడడంలేదు.
కోట్ల వ్యాపారంలో లేని సంతృప్తి
ఈ బోనాల్లో అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నారని తెలిసి ప్రపంచవ్యాప్తంగా దీని కోసం ఆసక్తిగా భక్తులు ఎదురు చూస్తున్నారు. అమ్మవారి భక్తులమైన మా కుటుంబానికి ఈ బంగారు బోనం తయారు చేసే పనులు దక్కడం అమ్మవారి కృపతోనే సాధ్యమైంది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. కోట్ల రూపాయల వ్యాపారంలో లేని సంతృప్తి ఈ బోనం తయారీలో మా కుటుంబానికి దక్కింది.
– మానేపల్లి మురళీకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment