మరో విద్యుత్ వివాదం మొదలు
* 1,200 మెగావాట్ల జైపూర్ విద్యుత్ ప్లాంట్ పీపీఏల రద్దు
* టీ ట్రాన్స్‌కో, సింగరేణి మధ్య త్వరలో కొత్త పీపీఏ
* విద్యుత్ వాటాల విషయంలో ఏపీకి ఎదురుదెబ్బ
* కృష్ణపట్నం వివాదానికి బదులు తీర్చుకున్న తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొత్త విద్యుత్ వివాదానికి తెర లేచింది. ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో సింగరేణి నిర్మిస్తున్న 1,200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని (పీపీఏ) రద్దు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి, నిర్మాణ దశల్లో వున్న విద్యుత్ ప్రాజెక్టుల నుంచి 53.89 శాతం తెలంగాణకు, 46.11శాతం ఏపీకి వాటాలున్నాయి. సింగరేణి, అప్పటి ఏపీ ట్రాన్స్‌కో మధ్య 2011లో జరిగిన పీపీఏ అమలైతే.. జైపూర్ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తును తెలంగాణ, ఏపీలు అదే వాటాల ప్రకారం పంచుకోవాలి.
కానీ.. కృష్ణపట్నం విద్యుత్తు వాటాల విషయంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా జైపూ ర్ ప్రాజెక్టు నుంచి ఏపీకి విద్యుత్‌వాటా కేటాయించకుండా తెలంగాణ సర్కా రు ఎత్తుగడ వేసింది. అందులో భాగంగా జైపూర్ ప్లాంట్ పీపీఏను రద్దు చేసుకోవాలని ప్రభుత్వంలోని ఉన్నత స్థాయిలో ఆదేశాలు వెలువడ్డాయి. పాత ఒప్పందం రద్దు అయిన వెంటనే తెలంగాణ ట్రాన్స్‌కో, సింగరేణి యాజమాన్యాలు కొత్త పీపీఏను కుదుర్చుకోవాలని నిర్ణయించాయి. ప్రస్తుతమున్న పీపీఏ ప్రకారం.. జైపూర్ ప్లాంట్ నుంచి 1,050 మెగావాట్లను ఇరు రాష్ట్రాల డిస్కంలకు విక్రయించాలి. మిగతా 150 మెగావాట్లు సింగరేణి సొంత అవసరాలకు వినియోగించుకోనుంది.
ఏపీ సెల్ఫ్ గోల్
గతేడాది తెలంగాణలో తీవ్ర విద్యుత్ సంక్షోభ సమయంలో కృష్ణపట్నం నుంచి తెలంగాణకు రావాల్సిన 862 మెగావాట్ల వాటాను ఇచ్చేందుకు ఏపీ ఒప్పుకోలేదు. నిర్మాణ దశలో వున్న కృష్ణపట్నం, హిందుజా, భూపాలపల్లి, జైపూర్ తదితర ప్రాజెక్టుల పీపీఏలను ఆమోదించడంలో ఉమ్మడి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఈఆర్‌సీ ఆమోదం లేని ఈ పీపీఏలు చెల్లవనే సాకుతో ఏపీ తెలంగాణకు విద్యుత్ వాటాలను నిరాకరించింది. ఇది 2 రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదాలకు దారి తీసింది. ఈ వివాద పరిష్కార బాధ్యతలను కేంద్రం సీఈఏ ఆధ్వర్యం లోని ఓ కమిటీకి అప్పగించినా అది ఇంకా నివేదికను సమర్పించలేదు. ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ డిమాండు తగ్గింది. మారిన పరిస్థితుల్లో ఏపీ విద్యుత్ అక్కర్లేదని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. జైపూర్ విద్యుత్ యూనిట్ ధర రూ.4.25-4.50 ఉండనుండగా, కష్ణపట్నం విద్యుత్ యూనిట్ ధర రూ.5.50కి పైనే ఉండనుంది. ఈక్రమంలో కృష్ణపట్నం వాటాలు ఇచ్చేందుకు ఏపీ ముందుకు వచ్చినా, తెలంగాణ తిరస్కరించింది.
ఈ విద్యుత్ అక్కర్లేదని దక్షిణ ప్రాంత లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ)కి లేఖ సైతం రాసింది. సొంత రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న జైపూర్ (1,200), భూపాలపల్లి (600), కేటీపీఎస్ ఏడోదశ (800 మెగావాట్లు) నుంచి తాము సైతం ఏపీకి వాటాలు కేటాయించకుండా ఎదురుదెబ్బ కొట్టాలని ఓ నిర్ణయానికి వచ్చింది. జైపూర్ ప్రాజెక్టు నుంచి వచ్చే ఏడాది మార్చిలో విద్యుదుత్పత్తి ప్రారం భం కానున్న నేపథ్యంలో తొలుత ఈ ప్రాజెక్టు పీపీఏ రద్దుకు చర్యలు ప్రారంభించింది.
ఏపీ సర్కారు మల్లగుల్లాలు !
జైపూర్ ప్రాజెక్టు పీపీఏ రద్దుకు తెలంగాణ తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటి వరకు సీఈఏ ముందు వినిపించిన సొంత వాదనకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందనే వాదనను తెరపైకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ విషయంలో తదుపరి చర్యల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణులను సంప్రదించినట్లు సమాచారం.