Jaipur Power plant
-
ఇక సింగరేణి వెలుగులు
జైపూర్ థర్మల్ పవర్ ప్లాంటు జాతికి అంకితం గజ్వేల్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం తొలిరోజు 864 మె.వా విద్యుత్ ఉత్పత్తి దేశచరిత్రలోనే తొలి సారిగా.. ఒకే రోజు రెండు యూనిట్లు ప్లాంటులో భారీ స్క్రీన్లలో వీక్షించిన ప్రజలు, అధికారులు బంగారు తెలంగాణలోనూ ముందుంటాం : సింగరేణి సాక్షి, మంచిర్యాల/ జైపూర్ : సిరులమాగాణి సింగరేణి.. మరో మైలురాయిని దాటింది. ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తికే పరిమితమైన ఈ సంస్థ విద్యుత్ ఉత్పత్తిలోనూ అడుగుపెట్టింది. ఇకపై.. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు పంచనుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఒకే రోజు రెండు యూనిట్లు (600‘2మె.వా) ప్రారంభించి చరిత్ర సృష్టించింది. నాడు తెలంగాణ ఏర్పాటు కోసం సకల జనుల సమ్మెలో పాల్గొన్న సింగరేణి కార్మికులు.. అధికారులు ఇకముందు బంగారు తెలంగాణ లోనూ పాల్గొంటారని స్పష్టం చేసింది. రూ. 8250 కోట్ల వ్యయంతో.. జైపూర్‌లో సింగరేణి సంస్థ నెలకొల్సిన 1200 మె.వా థర్మల్ విద్యుత్ ప్లాంటును ప్రధానమంత్రి న రేంద్ర మోదీ.. సీఎం కేసీఆర్‌తో కలిసి ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో శిలాఫలకం ఆవిష్కరించడం ద్వారా జాతికి అంకితం చేశారు. ఈ అపురూప ఘట్టాన్ని దూరదర్శన్ ద్వారా వీక్షించే విధంగా అధికారులు జైపూర్ మండలం పెగడపల్లిలోని సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంటులో రెండు భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష ప్రసారం చూసిన అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు హర్షధ్వానాలతో సంతోషం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ప్లాంటు పరిధిలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను సింగరేణి డైరెక్టర్, ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ అధికారి ఎ.మనోహర్‌రావు, ఈఅండ్ఎం రమేశ్ బాబు, జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి, ఏజీఎం పి.శ్యాంసుందర్లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అందరికి సింగరేణి యాజమాన్యం స్వీట్లు పంపిణీ చేసింది. తొలిరోజు మొదటి యూనిట్ ద్వారా 614 మె.వా, రెండో యూనిట్ ద్వారా 250 మె.వా విద్యుత్ ఉత్పత్తి జరిగిందని సింగరేణి అధికారులు వెల్లడించారు. వైఎస్ హయాంలోనే అంకురార్పణ : సింగరేణి డైరెక్టర్ ఎ.మనోహర్‌రావు బొగ్గు ఉత్పత్తికే పరిమితమైన సింగరేణి విద్యుత్ ఉత్పత్తిలోనూ ముందుండాలని.. తద్వారా రాష్ట్రానికి విద్యుత్ వెలుగులివ్వాలనే ఉద్దేశ్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. అప్పటి సింగరేణి సీఎండి ఎస్. నర్సింగరావు హయాంలోనే పవర్ ప్లాంటు నిర్మాణ నిర్ణయం తీసుకోవడం జరిగిందని సింగరేణి డైరెక్టర్, ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ అధికారి ఎ.మనోహర్‌రావు పేర్కొన్నారు. గజ్వేల్‌లో ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమం అనంతరం జైపూర్ పవర్ ప్లాంటులో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తోన్న సీఎం కేసీఆర్.. రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందించే బాద్యతను సింగరేణికి అప్పగించడం తమకు గర్వకారణమన్నారు. ఇప్పటికే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల్లో అగ్రగామిగా ఉన్న సింగరేణి విద్యుత్ ఉత్పత్తిలోనూ ముందంజలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వెనకబడిన ప్రాంతం కావడం.. ఇక్కడ నీటి వనరులు.. బొగ్గు గనులు ఉండడంతో ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లోని పెగడపల్లిని ప్లాంటు నిర్మాణానికి ఎంచుకున్నామన్నారు. నిర్ణీత సమయం కంటే ఎనిమిది నెలలు ఆలస్యమైనా.. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌ల మీదుగా థర్మల్ పవర్ ప్లాంటును ప్రారంభించుకోవడం అనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని సింగరేణి చరిత్రలో అద్భుత ఘట్టంగా పేర్కొన్నారు. ఈ ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నాడు తెలంగాణ ఏర్పాటు కోసం సకల జనుల సమ్మెలో పాల్గొన్న సింగరేణి కార్మికులు బంగారు తెలంగాణలోనూ భాగస్వాములవుతారన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్న.. సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు.. అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జగన్మోహన్, మంథని ఎమ్మెల్యే పుట్టమధు, ఆర్డీవో ఆయేషా మస్రత్‌ఖానం, జైపూర్ ఎంపిపి మెండ హేమలత, జెడ్పీటీసీ జె.రాజ్‌కుమార్‌నాయక్, సర్పంచులు రిక్కుల రాజకుమారి, భీమిని రాజయ్య, జక్కుల వెంకటేశం, నామాల శ్రీనివాస్, ఎంపీటీసీలు మంతెన లక్ష్మణ్, గోనె నర్సయ్యలతో పాటు ప్రాజెక్టు భూనిర్వాసితులు, టిబిజీకెఎస్ అధ్యక్షుడు కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, సీఎంసిఎఐ అధ్యక్షుడు మల్లేశ్, ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావ్, హెచ్ఎమ్మెస్ అధ్యక్షుడు రియాజ్ తదితర నాయకులు పాల్గొన్నారు. -
కూలీ మృతి : కార్మికులు ఆందోళన
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కి చెందిన ఓ కూలీ బుధవారం ఉదయం పై నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు నుంచి జారి పడి ప్రమాదవశాత్తు మరణించాడు. అయితే ఆ విషయాన్ని యాజమాన్యం గోప్యం ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో కూలీ మృతదేహన్ని యాజమాన్యం మాయం చేసిందని ఆరోపిస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. అందులోభాగంగా విధులు బహిష్కరించి పవర్ ప్లాంట్ ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. -
మరో విద్యుత్ వివాదం మొదలు
* 1,200 మెగావాట్ల జైపూర్ విద్యుత్ ప్లాంట్ పీపీఏల రద్దు * టీ ట్రాన్స్‌కో, సింగరేణి మధ్య త్వరలో కొత్త పీపీఏ * విద్యుత్ వాటాల విషయంలో ఏపీకి ఎదురుదెబ్బ * కృష్ణపట్నం వివాదానికి బదులు తీర్చుకున్న తెలంగాణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొత్త విద్యుత్ వివాదానికి తెర లేచింది. ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో సింగరేణి నిర్మిస్తున్న 1,200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని (పీపీఏ) రద్దు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి, నిర్మాణ దశల్లో వున్న విద్యుత్ ప్రాజెక్టుల నుంచి 53.89 శాతం తెలంగాణకు, 46.11శాతం ఏపీకి వాటాలున్నాయి. సింగరేణి, అప్పటి ఏపీ ట్రాన్స్‌కో మధ్య 2011లో జరిగిన పీపీఏ అమలైతే.. జైపూర్ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తును తెలంగాణ, ఏపీలు అదే వాటాల ప్రకారం పంచుకోవాలి. కానీ.. కృష్ణపట్నం విద్యుత్తు వాటాల విషయంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా జైపూ ర్ ప్రాజెక్టు నుంచి ఏపీకి విద్యుత్‌వాటా కేటాయించకుండా తెలంగాణ సర్కా రు ఎత్తుగడ వేసింది. అందులో భాగంగా జైపూర్ ప్లాంట్ పీపీఏను రద్దు చేసుకోవాలని ప్రభుత్వంలోని ఉన్నత స్థాయిలో ఆదేశాలు వెలువడ్డాయి. పాత ఒప్పందం రద్దు అయిన వెంటనే తెలంగాణ ట్రాన్స్‌కో, సింగరేణి యాజమాన్యాలు కొత్త పీపీఏను కుదుర్చుకోవాలని నిర్ణయించాయి. ప్రస్తుతమున్న పీపీఏ ప్రకారం.. జైపూర్ ప్లాంట్ నుంచి 1,050 మెగావాట్లను ఇరు రాష్ట్రాల డిస్కంలకు విక్రయించాలి. మిగతా 150 మెగావాట్లు సింగరేణి సొంత అవసరాలకు వినియోగించుకోనుంది. ఏపీ సెల్ఫ్ గోల్ గతేడాది తెలంగాణలో తీవ్ర విద్యుత్ సంక్షోభ సమయంలో కృష్ణపట్నం నుంచి తెలంగాణకు రావాల్సిన 862 మెగావాట్ల వాటాను ఇచ్చేందుకు ఏపీ ఒప్పుకోలేదు. నిర్మాణ దశలో వున్న కృష్ణపట్నం, హిందుజా, భూపాలపల్లి, జైపూర్ తదితర ప్రాజెక్టుల పీపీఏలను ఆమోదించడంలో ఉమ్మడి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఈఆర్సీ ఆమోదం లేని ఈ పీపీఏలు చెల్లవనే సాకుతో ఏపీ తెలంగాణకు విద్యుత్ వాటాలను నిరాకరించింది. ఇది 2 రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదాలకు దారి తీసింది. ఈ వివాద పరిష్కార బాధ్యతలను కేంద్రం సీఈఏ ఆధ్వర్యం లోని ఓ కమిటీకి అప్పగించినా అది ఇంకా నివేదికను సమర్పించలేదు. ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ డిమాండు తగ్గింది. మారిన పరిస్థితుల్లో ఏపీ విద్యుత్ అక్కర్లేదని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. జైపూర్ విద్యుత్ యూనిట్ ధర రూ.4.25-4.50 ఉండనుండగా, కష్ణపట్నం విద్యుత్ యూనిట్ ధర రూ.5.50కి పైనే ఉండనుంది. ఈక్రమంలో కృష్ణపట్నం వాటాలు ఇచ్చేందుకు ఏపీ ముందుకు వచ్చినా, తెలంగాణ తిరస్కరించింది. ఈ విద్యుత్ అక్కర్లేదని దక్షిణ ప్రాంత లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ)కి లేఖ సైతం రాసింది. సొంత రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న జైపూర్ (1,200), భూపాలపల్లి (600), కేటీపీఎస్ ఏడోదశ (800 మెగావాట్లు) నుంచి తాము సైతం ఏపీకి వాటాలు కేటాయించకుండా ఎదురుదెబ్బ కొట్టాలని ఓ నిర్ణయానికి వచ్చింది. జైపూర్ ప్రాజెక్టు నుంచి వచ్చే ఏడాది మార్చిలో విద్యుదుత్పత్తి ప్రారం భం కానున్న నేపథ్యంలో తొలుత ఈ ప్రాజెక్టు పీపీఏ రద్దుకు చర్యలు ప్రారంభించింది. ఏపీ సర్కారు మల్లగుల్లాలు ! జైపూర్ ప్రాజెక్టు పీపీఏ రద్దుకు తెలంగాణ తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటి వరకు సీఈఏ ముందు వినిపించిన సొంత వాదనకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందనే వాదనను తెరపైకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ విషయంలో తదుపరి చర్యల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణులను సంప్రదించినట్లు సమాచారం. -
పోలీసు బందోబస్త్ మధ్య పైప్ లైన్ పనులు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్‌కు గోదావరి జలాలు తరలించేందుకు పైపులైన్ పనులు పోలీసుల సహాయంతో రెండోరోజు శుక్రవారం కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని జైపూర్ పవర్ ప్లాంట్‌కు ఓ టీఎంసీ గోదావరి నీటిని తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో గందిపల్లి నుంచి పైపులైన్ పనులు ప్రారంభించగా గ్రామ రైతులు అడ్డుకున్నారు. అంతేకాకుండా పైపులైన్ కోసం తమ భూములు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో పోలీసుల సహాయంతో గురువారం పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
పవర్.. సవాల్
సాక్షి, మంచిర్యాల : ఈ నెల 3న జైపూర్ పవర్ ప్లాంటులో మరో 600 మెగావాట్ల యూనిట్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు ప్రజాప్రతినిధులు, సింగరేణి, జిల్లా అధికారులకు స్పష్టం చేశారు. రెండు నెలల వ్యవధిలో జైపూర్ ప్లాంటుకు రెండుసార్లు రావడం, పనుల ప్రగతిపై సమీక్షించి అధికారులను హెచ్చరించడం, మంత్రులకూ పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడాన్ని పరిశీలిస్తే ప్లాంటు పనుల పూర్తిపై ముఖ్యమంత్రి తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ అర్థమవుతోంది. తాజా సమీక్షలో.. ప్లాంటు నిర్వహణకు ఒక టీఎంసీ నీరందించే విషయంలో భూసేకరణ జరగకపోవడంతో ఆరు నెలల నుంచి పైప్‌లైన్ నిర్మాణ పనులు నిలిచిపోయాయని తెలుసుకున్న ముఖ్యమంత్రి రెండ్రొజుల్లోగా భూసేకరణ పూర్తి చేయాలని కలెక్టర్, ఆర్డీవోలను ఆదేశించారు. కానీ క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం రెవెన్యూ అధికారులకు సవాల్‌గా మారింది. పైపులైన్ నిర్మాణంలో భాగంగా సేకరిస్తున్న భూమికి జీవో ప్రకారం ఎకరానికి రూ.4.25లక్షలు, ఒక పంట కింద మరో రూ.1.25లక్షలు నష్టపరిహారంగా ఇస్తామని అధికారులు భూ నిర్వాసితులకు సూచిస్తున్నారు.కానీ నిర్వాసితులు ఎకరానికి రూ.10లక్షలు, సింగరేణి ఉద్యోగం డిమాండ్ చేస్తున్నారు. నష్టపరిహారం పెంపు విషయంలో రెవెన్యూ అధికారులు అంగీకరించడం లేదు. దీంతో ఐదు నెలలుగా పైపులైన్ నిర్మాణ పనులు నిలిచిపోయూయి. నష్ట పరిహారం విషయంలో రెవెన్యూ అధికారులు నిర్వాసితులను ఒప్పించడంలో విఫలం కావడంతో పైపులైన్ పనులు ముందుకు సాగడం లేదు. పవర్‌ప్లాంటుకు షెట్పల్లి గోదావరి నది నుంచి పైపులైన్ ద్వారా నీరందించాల్సి ఉంది. ఇందుకోసం 5 కిలోమీటర్ల మేరకు పైపులైన్ వేయూల్సి ఉంది. ఇప్పటివరకు 2కిలోమీటర్ల వరకు పైపులైన్ వేశారు. తమ డిమాండ్లు నెరవేర్చిన తర్వాతే భూమి ఇస్తామని గంగిపెల్లి నిర్వాసితులు 11మంది స్పష్టం చేయడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బుధవారం గంగిపెల్లికి వెళ్లిన ఆర్డీవో ఆయేషా మస్రత్ ఖానం నిర్వాసితులను నచ్చజెప్పాలని ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో ఆమె నిరాశతో వెనుదిరిగారు. సమస్య పరిష్కారమైతేనే పనుల పురోగతి ఉంటుందని సింగరేణి అధికారి ఒకరు తెలిపారు. సర్వే దశలోనే రైల్వేట్రాక్ పనులు.. పవర్ ప్లాంటుకు అవసరమైన బొగ్గు ఉత్పత్తికి శ్రీరాంపూర్ నుంచి జైపూర్(11కిలోమీటర్లు) వరకు రైల్వేట్రాక్ నిర్మించాలని సింగరేణి నిర్ణయించింది. వంతెన నిర్మాణానికి 70 ఎకరాలు అవసరమని ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందుకు సంబంధించి సర్వే చేసి.. సింగరేణికి భూమి అప్పగించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉంది. కానీ రె వెన్యూ అధికారులు ఇప్పటికీ భూ సర్వేలోనే ఉన్నారు. నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చి.. సింగరేణికి భూమి అప్పగించే వరకు ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియదు. మరోవైపు.. పవర్ ప్లాంటు నిర్మాణంలో ప్రజాప్రతినిధుల సహకారం కొరవడి నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో నిర్వాసితులను ఒప్పించి భూసేకరణ విషయంలో రెవెన్యూ అధికారులకు సహకరించాల్సిన ప్రజాప్రతినిధులు కొందరు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతోనే భూసేకరణ ఇబ్బందులు తలెత్తుతున్నాయని రెవెన్యూ అధికారి ఒకరు తెలిపారు. గుంటకు రూ.70వేలు ఇవ్వాలి - పాలమాకుల దేవేందర్‌రెడ్డి, గంగిపెల్లి గంగిపెల్లి గ్రామంలో 303/4 సర్వే నెంబర్లో మా భూమి ఉంది. పైప్‌లైన్ నిర్మాణంలో 30 గుంటల భూమి పోతుంది. రెవెన్యూ అధికారులు ఎకరానికి రూ.4.25లక్షలు మాత్రమే ఇస్తామంటున్నారు. నా భూమి ఎకరం కూడా లేదు. గుంటకు రూ.70వేల చొప్పున ఇవ్వాలి. ఇలా అయితే.. ఎకరానికి రూ.20 లక్షలవుతుంది. -
జైపూర్ వరకు ఫోర్‌లేన్ నిర్మాణం
శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ ఓసీపీ చౌరస్తా నుంచి జైపూర్ పవర్ ప్లాంటు వరకు ఉన్న రోడ్డును విస్తరించి నాలుగు లేన్ల రహదారిగా మారుస్తున్నామని శ్రీరాంపూర్ సీజీఎం సీహెచ్ వెంకటేశ్వర్రావు తెలిపారు. శనివారం తన చాంబర్లో ఉత్పత్తి వివరాల కోసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. పవర్ ప్రాజెక్టు అవసరాల కోసం నిత్యం వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయని దీని కోసం ప్రస్తుతం ఉన్న రోడ్డును వెడల్పు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకుగాను కంపెనీ రూ.19 కోట్లను ప్రభుత్వ జాతీయ రహదారుల శాఖకు ఇచ్చామని, వారి ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయన్నారు. 108 శాతం ఉత్పత్తి శ్రీరాంపూర్ ఏరియాలో అక్టోబర్‌లో 108 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించగా ఏరియా ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉందన్నారు. గత నెల వరకు 114 శాతం ఉత్పత్తి నమోదైన శ్రీరాంపూర్ ఓసీపీలో సమస్య రావడం వల్ల లక్ష్యాన్ని సాధించలేదన్నారు. ఓబీ కోసం భూ సమస్య రావడం వల్ల గత నెల కంటే 1.25 లక్షల టన్నుల ఉత్పత్తి తగ్గింద ని చెప్పారు. గతేడాదితోపోల్చితే ఈ యేడు 30 శాతం ప్రమాదాలు తగ్గాయన్నారు. సింగరేణి స్థలాల్లో అక్రమ నిర్మాణాలు అనుమతించమన్నారు. సింగరేణి మైనింగ్ అవసరాల కోసం ఫారెస్టు శాఖ నుంచి లీజు తీసుకుందని మళ్లీ తిరిగి భూమి అప్పగించాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఎస్ఓటు సీజీఎం సత్యనారాయణ, డీజీఎం(ఐఈడీ) ఫణి, డీజీఎం(పర్సనల్) శర్మ, పీఎం కిరణ్‌కుమార్ ఉన్నారు. ఏరియాలో 76 శాతం ఉత్పత్తి రెబ్బెన : గత అక్టోబర్‌లో బెల్లంపల్లి ఏరియాలోని గనులు 76 శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించాయని ఏరియా జనరల్ మేనేజర్ రాంనారాయణ తెలిపారు. శనివారం గోలేటిలోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. అక్టోబర్‌లో ఏరియా లక్ష్యం 5,32,400 టన్నులు కాగా 4,05,740 టన్నులు సాధించి 76శాతం నమోదు చేశాయన్నారు. బెల్లంపల్లి ఓసీపీ-2 ఎక్స్‌టెన్సన్ ఓసీపీలో అక్టోబర్ లోనే ఉత్పత్తి ప్రారంభం కావాల్సి ఉండగా అబ్బాపూర్ గ్రామానికి పునరావాసం కల్పించిన తర్వాత ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. అలాగే డోర్లి-2 ఓసీపీలో సైతం ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభం కాకపోవటంతోనే నెల వారీ లక్ష్యాన్ని సాధించలేకపోయామని తెలిపారు. సమావేశంలో డీజీఎం పర్సనల్ చిత్తరంజన్కుమార్, డీవైపీఎం రాజేశ్వర్, ఐఈడీ యోహాన్ పాల్గొన్నారు.