సాక్షి, మంచిర్యాల : ఈ నెల 3న జైపూర్ పవర్ ప్లాంటులో మరో 600 మెగావాట్ల యూనిట్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు ప్రజాప్రతినిధులు, సింగరేణి, జిల్లా అధికారులకు స్పష్టం చేశారు. రెండు నెలల వ్యవధిలో జైపూర్ ప్లాంటుకు రెండుసార్లు రావడం, పనుల ప్రగతిపై సమీక్షించి అధికారులను హెచ్చరించడం, మంత్రులకూ పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడాన్ని పరిశీలిస్తే ప్లాంటు పనుల పూర్తిపై ముఖ్యమంత్రి తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ అర్థమవుతోంది.
తాజా సమీక్షలో.. ప్లాంటు నిర్వహణకు ఒక టీఎంసీ నీరందించే విషయంలో భూసేకరణ జరగకపోవడంతో ఆరు నెలల నుంచి పైప్‌లైన్ నిర్మాణ పనులు నిలిచిపోయాయని తెలుసుకున్న ముఖ్యమంత్రి రెండ్రొజుల్లోగా భూసేకరణ పూర్తి చేయాలని కలెక్టర్, ఆర్డీవోలను ఆదేశించారు. కానీ క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం రెవెన్యూ అధికారులకు సవాల్‌గా మారింది. పైపులైన్ నిర్మాణంలో భాగంగా సేకరిస్తున్న భూమికి జీవో ప్రకారం ఎకరానికి రూ.4.25లక్షలు, ఒక పంట కింద మరో రూ.1.25లక్షలు నష్టపరిహారంగా ఇస్తామని అధికారులు భూ నిర్వాసితులకు సూచిస్తున్నారు.కానీ నిర్వాసితులు ఎకరానికి రూ.10లక్షలు, సింగరేణి ఉద్యోగం డిమాండ్ చేస్తున్నారు.
నష్టపరిహారం పెంపు విషయంలో రెవెన్యూ అధికారులు అంగీకరించడం లేదు. దీంతో ఐదు నెలలుగా పైపులైన్ నిర్మాణ పనులు నిలిచిపోయూయి. నష్ట పరిహారం విషయంలో రెవెన్యూ అధికారులు నిర్వాసితులను ఒప్పించడంలో విఫలం కావడంతో పైపులైన్ పనులు ముందుకు సాగడం లేదు. పవర్‌ప్లాంటుకు షెట్‌పల్లి గోదావరి నది నుంచి పైపులైన్ ద్వారా నీరందించాల్సి ఉంది.
ఇందుకోసం 5 కిలోమీటర్ల మేరకు పైపులైన్ వేయూల్సి ఉంది. ఇప్పటివరకు 2కిలోమీటర్ల వరకు పైపులైన్ వేశారు. తమ డిమాండ్లు నెరవేర్చిన తర్వాతే భూమి ఇస్తామని గంగిపెల్లి నిర్వాసితులు 11మంది స్పష్టం చేయడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బుధవారం గంగిపెల్లికి వెళ్లిన ఆర్డీవో ఆయేషా మస్రత్ ఖానం నిర్వాసితులను నచ్చజెప్పాలని ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో ఆమె నిరాశతో వెనుదిరిగారు. సమస్య పరిష్కారమైతేనే పనుల పురోగతి ఉంటుందని సింగరేణి అధికారి ఒకరు తెలిపారు.
సర్వే దశలోనే రైల్వేట్రాక్ పనులు..
పవర్ ప్లాంటుకు అవసరమైన బొగ్గు ఉత్పత్తికి శ్రీరాంపూర్ నుంచి జైపూర్(11కిలోమీటర్లు) వరకు రైల్వేట్రాక్ నిర్మించాలని సింగరేణి నిర్ణయించింది. వంతెన నిర్మాణానికి 70 ఎకరాలు అవసరమని ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందుకు సంబంధించి సర్వే చేసి.. సింగరేణికి భూమి అప్పగించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉంది. కానీ రె వెన్యూ అధికారులు ఇప్పటికీ భూ సర్వేలోనే ఉన్నారు. నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చి.. సింగరేణికి భూమి అప్పగించే వరకు ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియదు. మరోవైపు.. పవర్ ప్లాంటు నిర్మాణంలో ప్రజాప్రతినిధుల సహకారం కొరవడి నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో నిర్వాసితులను ఒప్పించి భూసేకరణ విషయంలో రెవెన్యూ అధికారులకు సహకరించాల్సిన ప్రజాప్రతినిధులు కొందరు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతోనే భూసేకరణ ఇబ్బందులు తలెత్తుతున్నాయని రెవెన్యూ అధికారి ఒకరు తెలిపారు.
గుంటకు రూ.70వేలు ఇవ్వాలి
- పాలమాకుల దేవేందర్‌రెడ్డి, గంగిపెల్లి
గంగిపెల్లి గ్రామంలో 303/4 సర్వే నెంబర్లో మా భూమి ఉంది. పైప్‌లైన్ నిర్మాణంలో 30 గుంటల భూమి పోతుంది. రెవెన్యూ అధికారులు ఎకరానికి రూ.4.25లక్షలు మాత్రమే ఇస్తామంటున్నారు. నా భూమి ఎకరం కూడా లేదు. గుంటకు రూ.70వేల చొప్పున ఇవ్వాలి. ఇలా అయితే.. ఎకరానికి రూ.20 లక్షలవుతుంది.
పవర్.. సవాల్
Published Fri, Mar 6 2015 2:29 AM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM
Advertisement