పైలాన్ వద్ద డైరెక్టర్లు, అధికారులు
-
జైపూర్ థర్మల్ పవర్ ప్లాంటు జాతికి అంకితం
-
గజ్వేల్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
-
తొలిరోజు 864 మె.వా విద్యుత్ ఉత్పత్తి
-
దేశచరిత్రలోనే తొలి సారిగా.. ఒకే రోజు రెండు యూనిట్లు
-
ప్లాంటులో భారీ స్క్రీన్లలో వీక్షించిన ప్రజలు, అధికారులు
-
బంగారు తెలంగాణలోనూ ముందుంటాం : సింగరేణి
సాక్షి, మంచిర్యాల/ జైపూర్ : సిరులమాగాణి సింగరేణి.. మరో మైలురాయిని దాటింది. ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తికే పరిమితమైన ఈ సంస్థ విద్యుత్ ఉత్పత్తిలోనూ అడుగుపెట్టింది. ఇకపై.. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు పంచనుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఒకే రోజు రెండు యూనిట్లు (600‘2మె.వా) ప్రారంభించి చరిత్ర సృష్టించింది. నాడు తెలంగాణ ఏర్పాటు కోసం సకల జనుల సమ్మెలో పాల్గొన్న సింగరేణి కార్మికులు.. అధికారులు ఇకముందు బంగారు తెలంగాణ లోనూ పాల్గొంటారని స్పష్టం చేసింది. రూ. 8250 కోట్ల వ్యయంతో.. జైపూర్‌లో సింగరేణి సంస్థ నెలకొల్సిన 1200 మె.వా థర్మల్ విద్యుత్ ప్లాంటును ప్రధానమంత్రి న రేంద్ర మోదీ.. సీఎం కేసీఆర్‌తో కలిసి ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో శిలాఫలకం ఆవిష్కరించడం ద్వారా జాతికి అంకితం చేశారు.
ఈ అపురూప ఘట్టాన్ని దూరదర్శన్ ద్వారా వీక్షించే విధంగా అధికారులు జైపూర్ మండలం పెగడపల్లిలోని సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంటులో రెండు భారీ ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష ప్రసారం చూసిన అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు హర్షధ్వానాలతో సంతోషం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ప్లాంటు పరిధిలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను సింగరేణి డైరెక్టర్, ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ అధికారి ఎ.మనోహర్‌రావు, ఈఅండ్‌ఎం రమేశ్ బాబు, జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి, ఏజీఎం పి.శ్యాంసుందర్‌లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అందరికి సింగరేణి యాజమాన్యం స్వీట్లు పంపిణీ చేసింది. తొలిరోజు మొదటి యూనిట్ ద్వారా 614 మె.వా, రెండో యూనిట్ ద్వారా 250 మె.వా విద్యుత్ ఉత్పత్తి జరిగిందని సింగరేణి అధికారులు వెల్లడించారు.
వైఎస్ హయాంలోనే అంకురార్పణ : సింగరేణి డైరెక్టర్ ఎ.మనోహర్‌రావు
బొగ్గు ఉత్పత్తికే పరిమితమైన సింగరేణి విద్యుత్ ఉత్పత్తిలోనూ ముందుండాలని.. తద్వారా రాష్ట్రానికి విద్యుత్ వెలుగులివ్వాలనే ఉద్దేశ్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. అప్పటి సింగరేణి సీఎండి ఎస్. నర్సింగరావు హయాంలోనే పవర్ ప్లాంటు నిర్మాణ నిర్ణయం తీసుకోవడం జరిగిందని సింగరేణి డైరెక్టర్, ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ అధికారి ఎ.మనోహర్‌రావు పేర్కొన్నారు. గజ్వేల్‌లో ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమం అనంతరం జైపూర్ పవర్ ప్లాంటులో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తోన్న సీఎం కేసీఆర్.. రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందించే బాద్యతను సింగరేణికి అప్పగించడం తమకు గర్వకారణమన్నారు.
ఇప్పటికే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల్లో అగ్రగామిగా ఉన్న సింగరేణి విద్యుత్ ఉత్పత్తిలోనూ ముందంజలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వెనకబడిన ప్రాంతం కావడం.. ఇక్కడ నీటి వనరులు.. బొగ్గు గనులు ఉండడంతో ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లోని పెగడపల్లిని ప్లాంటు నిర్మాణానికి ఎంచుకున్నామన్నారు. నిర్ణీత సమయం కంటే ఎనిమిది నెలలు ఆలస్యమైనా.. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌ల మీదుగా థర్మల్ పవర్ ప్లాంటును ప్రారంభించుకోవడం అనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని సింగరేణి చరిత్రలో అద్భుత ఘట్టంగా పేర్కొన్నారు. ఈ ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నాడు తెలంగాణ ఏర్పాటు కోసం సకల జనుల సమ్మెలో పాల్గొన్న సింగరేణి కార్మికులు బంగారు తెలంగాణలోనూ భాగస్వాములవుతారన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్న.. సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు.. అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జగన్మోహన్, మంథని ఎమ్మెల్యే పుట్టమధు, ఆర్డీవో ఆయేషా మస్రత్‌ఖానం, జైపూర్ ఎంపిపి మెండ హేమలత, జెడ్పీటీసీ జె.రాజ్‌కుమార్‌నాయక్, సర్పంచులు రిక్కుల రాజకుమారి, భీమిని రాజయ్య, జక్కుల వెంకటేశం, నామాల శ్రీనివాస్, ఎంపీటీసీలు మంతెన లక్ష్మణ్, గోనె నర్సయ్యలతో పాటు ప్రాజెక్టు భూనిర్వాసితులు, టిబిజీకెఎస్ అధ్యక్షుడు కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, సీఎంసిఎఐ అధ్యక్షుడు మల్లేశ్, ఐఎన్‌టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావ్, హెచ్‌ఎమ్మెస్ అధ్యక్షుడు రియాజ్ తదితర నాయకులు పాల్గొన్నారు.