సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలకు కేంద్రం కొత్తగా తెచ్చిన చట్టంలోని 17 (A) ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా బొగ్గు బ్లాకులు కేటాయించే అవకాశం ఉంది. అయినప్పటికీ వేలం పాటలో పెట్టి ప్రైవేట్ వారికి అవకాశం కలిగించడం అంటే ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని కుదేలు చేయడమేనని వ్యాఖ్యానించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ పాల్గొన్న భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ ఇప్పుడు 39 బొగ్గు గనులతో నడుస్తున్నప్పటికీ కొత్త గనుల కేటాయింపు లేకపోతే ప్రస్తుతం ఉన్న గనులు క్రమంగా తగ్గిపోతాయి.రానున్న ఐదు సంవత్సరాలలో 8 భూగర్భ గనులు, మూడు ఓపెన్ కాస్ట్ గనులు మూతపడనున్నాయి.ఇలా 2032 నాటికి ఐదు భూ గర్భగనులు ఆరు ఓపెన్ కాస్ట్ గనులు,2037-38 నాటికి మరో 5 గనులు మూతపడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
తద్వారా 39 గనులు 40 వేల మంది కార్మికులు ఉన్న సింగరేణి మరో 15 ఏళ్లలో 8 గనులు ఎనిమిది వందల మంది కార్మికుల స్థాయికి పడిపోయి సింగరేణి మూతపడే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రాంత నాయకులుగా ఈ పరిణామాన్ని ఊహించలేము అని అన్నారు.
సింగరేణి సంస్థకు గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇంకా మిగిలి ఉన్న 1400 మిలియన్ టన్నుల బొగ్గు తీసేందుకు వీలుగా చట్ట ప్రకారంగానే రిజర్వేషన్ కోటాలో బ్లాకులు కేటాయించాలని కోరుతున్నట్లు డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై ప్రధాని మోదీని కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ బిడ్డగా కిషన్ రెడ్డి సింగరేణికి న్యాయం చేస్తారని భావిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు,మరో నాలుగు వేల మెగావాట్ల ప్లాంట్ ఎన్టీపీసీ కేంద్రానికి, సింగరేణి సంస్థ నిర్మిస్తున్న మరో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ కు కూడా బొగ్గు ఎంతో అవసరం ఉంది. ఇది సుమారు 24 మిలియన్ టన్నులు. ఈ డిమాండ్‌కు తగ్గట్టు బొగ్గు ఉత్పత్తి జరగాలంటే సింగరేణి సంస్థకు కొత్త గనులు కేటాయించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను స్వయంగా గత బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి ఈ విషయాలు వివరించా. కొత్త బ్లాకులు కేటాయించాలని తాటిచెర్ల బ్లాక్-2కు అవునుమతి ఇవ్వాలని కోరాను.
ఇప్పుడు కిషన్ రెడ్డిని కోరుతున్నాం. సింగరేణి సంస్థ బతకాలన్న, అందులో పనిచేస్తున్న కార్మికుల భవిష్యత్ బాగుండాలంటే కొత్త గనులు కేటాయించడం అవసరం ఉందన్నారు.
గతంలో నిర్వహించిన వేలంపాట ద్వారా సత్తుపల్లి బ్లాక్-3 కోయగూడెం బ్లాకు-3లను పొందిన ప్రైవేటు కంపెనీలు ఇప్పటివరకు అక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభించలేదు. కనుక చట్ట ప్రకారం ఆ కేటాయింపులు రద్దుచేసి ఆ బ్లాకులు సింగరేణికి కేటాయించాలని కోరుతున్నామన్న భట్టి విక్రమార్క.. ఆ రెండు బ్లాకులు కేటాయిస్తే సింగరేణి వెంటనే అక్కడ తవ్వకాలు ప్రారంభిస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment