సింగరేణి సంస్థ పరిధిలో రామగుండం ఓసీపీ-3 ఎక్స్‌టెన్షన్, బెల్లంపల్లి ఓసీపీ-2, మణుగూర్ ఏరియాలోని...
గోదావరిఖని : సింగరేణి సంస్థ పరిధిలో రామగుండం ఓసీపీ-3 ఎక్స్‌టెన్షన్, బెల్లంపల్లి ఓసీపీ-2, మణుగూర్ ఏరియాలోని కొండాపురం భూగర్భ గనులను త్వరలో ప్రారంభించనున్నామని ఆ సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. గనుల ప్రారంభోత్సవానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయూలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన గోదావరిఖనిలోని ఇల్లందు గెస్ట్‌హౌస్‌లో కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలోని 11 ఏరియాలకు చెందిన సీజీఎంలు, జీఎంలతో వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
రానున్న రోజుల్లో సింగరేణి సంస్థ వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకోనుందని తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు ఓసీపీలు, ఒక భూగర్భ గనిని త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, వివిధ ఏరియాల్లో ప్రారంభించాల్సి ఉన్న గనులకు సంబంధించి ప్రతిపాదనలు, ప్రయత్నాలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, కార్మిక కాలనీల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. గనులు, ఓసీపీలలో యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించాలని, అప్పుడే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామని సూచించారు. సమావేశంలో ఆపరేషన్స్ డెరైక్టర్ బి.రమేశ్‌కుమార్, పీఅండ్‌పీ డెరైక్టర్ ఎ.మనోహర్‌రావు, ఈఅండ్‌ఎం డెరైక్టర్ పి.రమేశ్‌బాబు, కో-ఆర్డినేషన్ జీఎం సీహెచ్.నరసింహారావుతోపాటు అన్ని ఏరియాల సీజీఎంలు, జీఎంలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.