ప్రజల పక్షాన పోరు
రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. యాదగిరిగుట్టలో శనివారం డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో సీఎల్పీ నేత జానారెడ్డితోపాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
భువనగిరి : ‘యాదగిరిగుట్ట సభావేదికపై వెల్లివిరిసిన ఐక్యతతో ప్రజావ్యతిరేక టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై సమరశంఖం పూరించడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి.. 2019 ఎన్నికల్లో విజయం కోసం ఇక్కడి నుంచే రాజీలేని పోరాటం చేయా.. జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అంతా గ్రూపులకు అతీతంగా ఐక్యంగా ఉండాలి.. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం సాగించాలి.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చే వరకు మేమంతా నిద్రపోయేది లేదు’ అని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. శనివారం గుట్టలో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సాగర్ ఆయకట్టులో రెండవ పంటకు నీరిచ్చిందన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుతానికి సాగర్‌నీటి విషయంలో కనీస పరిజ్ఞానం లేకుండా శాసనసభలో ప్రకటించిందన్నారు. రబీలో నీరివ్వడానికి ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవన్నారు. ప్రభుత్వానికి పాలనపై అవగాహన లేదన్నారు. కొందమంది స్వార్థనాయకులే కాంగ్రెస్ వల్ల లాభపడి , టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. అలాంటి వారి వల్ల పార్టీకి ఎలాంటి నష్టం ఉండబోదన్నారు. పార్టీకి కొండంత అండగా పార్టీ కార్యకర్తలు ఉన్నారన్నారు. భవిష్యత్ అంతా యువతదేనన్నారు. ప్రభుత్వంపై పోరాటానికి సమాయత్తం కావాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా ముందుకుపోతామని అందరి ఆమోదం ఉన్న వారిని పోటీలో ఉంచుతామన్నారు.
కార్యకర్తలను వేధిస్తే ఊరుకోం : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
జిల్లాలో ఎమ్మెల్సీని కాంగ్రెస్ పార్టీయే కైవసం చేసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పార్టీ కి చెందిన వారిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందన్నారు. కార్యకర్తలకు ఏం జరిగినా సహించి ఊరుకోబోమని హెచ్చరించారు.
అందరిని కలుపుకొని పోతా : భిక్షమయ్యగౌడ్
జిల్లాలో పార్టీ నాయకులందరినీ కలుపుకొని పోతానని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ తెలిపారు. పార్టీని జిల్లాలో బలోపేతం చేసి తిరుగులేని శక్తిగా మారుస్తామన్నారు.టీఆర్‌ఎస్ ఒంటెద్దు పోకడలను ఎండగడతామన్నారు. కార్యకర్తల మనోభావాలను గుర్తించి జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో ముందుకుసాగుతామన్నారు.
పార్టీ కోసం ఏ త్యాగానికైనా సిద్ధం : గుత్తా సుఖేందర్‌రెడ్డి
పార్టీ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం పార్టీనే ఫణంగా పెట్టిన దేవత సోనియా అని కొనియాడారు. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి ఆమె రుణం తీర్చుకోవాలని కోరారు. ఉన్నవారు పార్టీని వీడిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యతం అందరిపై ఉందన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటా : పాల్వాయి
కార్యకర్తలకు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి అన్నారు. జిల్లాలో పార్టీ ని పటిష్ఠపరిచి , వలసలు నివారించాల్సిన బాధ్యతప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ రుణం తీర్చుకునేలా వ్యవహరించాలన్నారు.
పదవులు ముఖ్యం కాదు - కోమటిరెడ్డి
కార్యకర్తలకు అండగా ఉండడానికి తనను ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చి గెలిపించాలన్నారు భువనగిరి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారు. తమకు పార్టీ తప్ప పదవులు ముఖ్యం కాదని పార్టీ కన్నతల్లి లాంటిదన్నారు. అలాంటి పార్టీకి ఎవరూ ద్రోహం చేయరన్నారు. తాను పదవులను కూడా లెక్క చేయకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉన్నానన్నారు.
శాసనసభలో జానా గళమెత్తాలి : రాంరెడ్డిదామోదర్‌రెడ్డి
ప్రభుత్వంపై శాసన సభలో ప్రతిపక్షనేత జానారెడ్డి గళమెత్తాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. శాసన సభలో ప్రజా సమస్యలపైమీగొంతు తప్పా కేసీఆర్‌తో సహా ఎవరి గొంతు వినపడవద్దన్నారు. కేసీఆర్‌పైన యుద్ధం ప్రకటిద్దామన్నారు. 10 సంవత్సరాల తర్వాత జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిపిన జిల్లా అధ్యక్షుడు బిక్షమయ్యగౌడ్ అభినందనీయుడన్నారు. ఎమ్మెల్సీ టికెట్ ఎవరికి ఇచ్చినా ముందుండి పనిచేస్తానన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే భాస్కర్‌రావు, వేదాసు వెంకయ్య, టి. దేవేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి,జి. నారాయణరెడ్డి, మోతె సోమిరెడ్డి, అద్దంకి దయాకర్, బొందుగుల నర్సింహారెడ్డి,పోతం శెట్టి వెంకటేశ్వరు,్ల గర్దాసుబాలయ్య, సుంకరి మల్లేషం, రాపోలు జయప్రకాష్, పోత్నక్ ప్రమోద్‌కుమార్,బర్రె జహంగీర్, కర్నాటి లింగారెడ్డి, రామకృష్ణారెడ్డి, బీర్ల ఐలయ్య, టి. రవికుమార్, గుడిపాటి నర్సయ్య పాల్గొన్నారు.