
ఒప్పందాలు ఉల్లంఘిస్తున్న ఏపీ సర్కారు: ఒవైసీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన వాటాలు రావాల్సిందేనని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. విద్యుత్ సమస్యపై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడుతూ... కృష్ణపట్నం, హిందుజాల నుంచి కరెంట్ రప్పించాల్సిందేనని స్పష్టం చేశారు. ఏపీ సర్కారు విద్యుత్ ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం తీరు వల్లే తెలంగాణలో కరెంట్ సంక్షోభం తలెత్తిందని విమర్శించారు.
న్యాయపరంగా రావాల్సిన వాటా కోసం పోరాడాల్సిన అవసరముందన్నారు. తక్షణమే విద్యుత్ సమస్య పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలన్నారు. సమస్య ఇప్పుడు ఉంటే ఎప్పుడో విద్యుత్ తెస్తామనడం సమంజసం కాదని అక్బరుద్దీన్ అన్నారు.
దీనికి కేసీఆర్ ఉర్దూలో సమాధానం చెప్పారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఉర్దూలో సమాధానం చెప్పినందుకు అక్బరుద్దీన్ ధన్యవాదాలు తెలిపారు. దీనిపై గీతారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని గుర్తు చేశారు. కేసీఆర్ తెలంగాణ పోరాటం చేశానని చెప్పారు.