‘కృష్ణా’పై వాస్తవాలను వక్రీకరిస్తోంది
ఏపీ వైఖరిని ఎండగట్టిన ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదంలో ఆంధ్రప్రదేశ్ వాస్తవాలను వక్రీకరిస్తోందని, గతంలో ట్రిబ్యునళ్ల ముందు తాను చేసిన వాదనలను తానే ఖండిస్తోందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు ఆరోపించారు. నీటి వాటాలు, వినియోగం అంశాలను పక్కనపెట్టి లభ్యత నీటిని పంచాలని మూర్ఖంగా తొండి పంచాయితీకి దిగుతోందని విమర్శిం చారు. బోర్డుకు, కేంద్రానికి లేఖలు రాస్తూ రోజు కో వైఖరిని వెల్లడిస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోందన్నారు.
నీటి వినియోగం విషయంలో పూర్తిగా బచావత్ అవార్డు మేరకే నడుచుకుంటున్నామని స్పష్టం చేశారు. జల వివాదంపై ఏపీ కోర్టుకెళ్లినా, కేంద్రం వద్దకు వెళ్లినా వాస్తవాలు తమకే అనుకూలంగా ఉన్నాయని, తమకు న్యాయం జరుగుతోందని, వాస్తవాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణా వివాదం రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ సూచన మేరకు ఆయన పలు సాంకేతిక అంశాలపై స్పష్టతనిచ్చారు.
ప్రత్యేకంగా సూచిం చిన ప్రాజెక్టులకు మినహా మిగతా ప్రాజెక్టులకు గంపగుత్తగా కేటాయించిన నీటిని ఆ రాష్ట్ర భౌగోళిక సరిహద్దు పరిధిలో ఎక్కడైనా వాడుకోవచ్చని బచావత్ అవార్డు స్పష్టంగా పేర్కొందని గుర్తుచేశారు. ఆ మేరకు సాగర్ ఎగువన వాడుకోలేకపోయిన 70 టీఎంసీల నీటిని సాగర్‌లో వాడుకుం టున్నామన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపును గతంలో ఏపీ వ్యతిరేకించిన సమయంలో సుప్రీం తీర్పునిస్తూ, గంపగుత్తగా ఇచ్చిన నీటిని ఎక్కడైనా వాడుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పిందన్నారు.
ఇక సాగర్ దిగువ పరీవాహకంలో 18 టీఎంసీల లభ్యతే ఉందన్న ఏపీ వాదనలో నిజం లేదన్నారు. 1985లో రాజారావు కమిటీ సహా ఏపీ సైతం గతంలో ట్రిబ్యునల్ ముందు వాదనల సమయంలో సాగర్ దిగువన 101.2 టీఎంసీల మేర నీటి లభ్యత ఉందని స్పష్టంగా తెలిపామని వెల్లడించారు. ఇలా ప్రతి అంశం తెలంగాణకే అనుకూలంగా ఉన్నా, ఏపీ మాత్రం చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు.
ఈ ఏడాది లభ్యత నీటిలో ఏపీకి 323 టీఎంసీలు వాడుకునే హక్కుండగా, ఇప్పటికే 360 టీఎంసీలు వినియోగించుకొని ప్రస్తుతం సాగర్‌లో అందుబాటులో ఉన్న నీరంతా తమకే దక్కాలనడం సరికాదన్నారు. ఈ వివాద పరిష్కారంలో బోర్డు చేసేదేమీ ఉండదని, నీటి వాటాలను ట్రిబ్యునల్ లేదా ఇరు రాష్ట్రాల ఒప్పందం మేరకే నిర్ణయించాల్సి ఉంటుందని చెప్పారు.
విద్యాసాగర్‌రావు చెప్పిన మేరకు కేటాయింపులు ఇలా..
సాగర్ వరకు కేటాయింపులు..
ఏపీ: 280.69 టీఎంసీలు (58.39%)
తెలంగాణ: 200 టీఎంసీలు (41.61%)
సాగర్ దిగువన కేటాయింపులు
ఏపీ: 118.21టీఎంసీలు (59.28%)
తెలంగాణ: 81.20 టీఎంసీలు (40.72%)
గంపగుత్తగా జరిపిన కేటాయింపులు
ఏపీ: 512.04 టీఎంసీలు (63.14%)
తెలంగాణ: 298.96 టీఎంసీలు (36.86%)