krishna river dispute
-
కృష్ణా జలాల వివాదం.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
సాక్షి, ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదం కేసుపై విచారణ జరిగింది. ఈ సందర్బంగా కేంద్ర జలశక్తి విజ్ఞప్తి మేరకు ఈ వివాదంపై కేసు విచారణను జనవరి 12కు కోర్టు వాయిదా వేసింది. అయితే, కృష్ణా ట్రిబ్యునల్‌కు నూతన విధి విధానాలు ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో విచారణ సందర్భంగా దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు మరింత సమయం కేంద్ర జలశక్తిశాఖ న్యాయవాది.. సుప్రీంకోర్టును కోరారు. దీంతో, విచారణను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: సాగర్‌పై ఏపీ చర్యలు న్యాయమైనవే: మంత్రి అంబటి -
వివాదాల ముగింపునకు సిద్ధం.. నేడు కృష్ణాబోర్డు సర్వసభ్య సమావేశం
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు ముగింపు పలికేందుకు కృష్ణా బోర్డు సిద్ధమైంది. అనుమతి లేని ప్రాజెక్టులే ప్రధాన అజెండాగా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ అధ్యక్షతన 17వ సర్వ సభ్య సమావేశాన్ని బుధవారం హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలతోపాటు బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు, బడ్జెట్, 2023–24 నీటి సంవత్సరంలో జలాల పంపిణీతో సహా 21 అంశాలతో అజెండాను ఖరారు చేసింది. కృష్ణా తాగు నీటి సరఫరా పథకం ఒకటి, రెండు, మూడు దశల ద్వారా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కాలువ కింద ప్రస్తుతం తెలంగాణ సర్కారు ఆయకట్టుకు నీటిని అందిస్తోంది. ఇందుకోసం నాగార్జున సాగర్ జల విస్తరణ ప్రాంతంలో రూ.1,450 కోట్లతో సుంకిశాల ఇన్‌టేక్ వెల్ ప్రాజెక్టును తెలంగాణ చేపట్టింది. దీనిపై ఏపీ ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో అభ్యంతరం తెలిపింది. సుంకిశాల ఇన్‌టేక్ వెల్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను నిలిపివేయాలని బోర్డును కోరింది. నీటి కేటాయింపులు లేనందున పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతిని కూడా సీడబ్ల్యూసీ తిరస్కరించింది. కృష్ణా ట్రిబ్యునల్–2 కేటాయించిన 4 టీఎంసీలను వాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కుడి కాలువను చేపట్టడంపై తెలంగాణ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై అయ్యాకే పనులు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆర్డీఎస్ను మరోసారి ప్రస్తావించేందకు తెలంగాణ సిద్ధమైంది. గెజిట్ నోటిఫికేషన్ అమలయ్యేనా? బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్నెళ్లలోగా దాన్ని అమలు చేయాలని పేర్కొంది. మరో ఆర్నెల్లు పొడిగించినా నోటిఫికేషన్ అమలుపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదు. దీనిపై రెండు రాష్ట్రాలను ఒప్పించేందుకు బోర్డు సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్రానికి ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల జలాల్లో 66 శాతం (512 టీఎంసీలు) ఏపీ, 34 శాతం (299 టీఎంసీలు) తెలంగాణ వాడుకునేలా 2015 జూన్ 19న తాత్కాలిక ఒప్పందం కుదిరింది. కానీ.. సగ భాగం వాటా కావాలని తెలంగాణ డిమాండ్ చేయడంతో నీటి పంపిణీపై కూడా బోర్డు చర్చించనుంది. హిందీలో కార్యకలాపాలా? కేంద్రంతో బోర్డు ఉత్తర ప్రత్యుత్తరాలు, కార్యకలాపాలు హిందీ భాషలోనే జరగాలని కేంద్ర జల్ శక్తి శాఖ కోరుతోంది. కానీ.. రెండు రాష్ట్రాల అధికారులకు హిందీ భాషలో ప్రావీణ్యం లేదు. దీనిపై బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర జల్ శక్తిశాఖ అనుమతి లేకుండా బోర్డులో పనిచేస్తున్న సిబ్బందికి మూలవేతనంలో 25శాతం ప్రోత్సాహకంగా ఇచ్చిన నిధులు రికవరీ చేయాలన్న కేంద్రం ఆదేశాలపైనా చర్చించనున్నారు. -
గెజిట్ అమలుపై అనిశ్చితి!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై అనిశ్చితి నెలకొంది. ప్రాజెక్టుల అప్పగింత విషయంగా తెలంగాణ ముం దుకురాకపోవడం, పలు అభ్యంతరాల నేపథ్యంలో గందరగోళం నెలకొంది. గెజిట్ నోటిఫికేషన్ అమలు ఎజెండాతో ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల మినిట్స్ (చర్చించిన అంశాలు)ను కృష్ణా, గోదావరి బోర్డుల సభ్యకార్యదర్శులు డీఎం రాయ్‌పురే, బీపీ పాండే బుధవారం రెండు రాష్ట్రాలకు పంపారు. ఈ మినిట్స్ ప్రకారం.. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులను అప్పగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే శ్రీశైలం, సాగర్ జలవిద్యుత్ కేంద్రాలను అప్పగించడంపై తెలంగాణ సర్కారు అభ్యంతరం వ్య క్తం చేసింది. ప్రాజెక్టులను బోర్డులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు మొగ్గుచూపలేదు. రెండు రాష్ట్రాలు కూడా ప్రాజెక్టులను అప్పగిస్తూ ఉత్తర్వులిస్తే గానీ.. వాటిని బోర్డులు తమ పరిధిలోకి తీసుకోలేవు. తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో.. నిర్దేశించిన గడువు అయిన గురువారం (అక్టోబర్ 14న) రోజు న గెజిట్ నోటిఫికేషన్‌ను అమలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లినట్టు రెండు బోర్డుల అధికారవర్గాలు తెలిపాయి. ఈ విషయంలో కేంద్రం జారీ చేసే మార్గదర్శకాల మేరకు చర్యలు చేపడతామని వెల్లడించాయి. ఏపీ రెడీ.. తెలంగాణ నో.. మంగళవారం జరిగిన సమావేశంలో ఇరురాష్ట్రాల వాదనలు విన్న కృష్ణాబోర్డు చైర్మన్ ఎంపీ సింగ్.. తొలుత ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను పూర్తిస్థాయిలో బోర్డు పరిధిలోకి తీసుకుంటామని తీర్మానం ప్రవేశపెట్టారు. దానిని ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. తమ భూభాగంలోని ఆరు ఔట్లెట్లను బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు అంగీకరించింది. కానీ తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసే వరకు గెజిట్ నోటిఫికేషన్ అమలు చేయవద్దని వాదించింది. తెలంగాణకు విద్యుత్ అవసరాలు అధికంగా ఉన్నాయని.. శ్రీశైలం, సాగర్ విద్యుత్ కేంద్రాలను బోర్డుకు అప్పగించాలనడం సరికాదని పేర్కొంది. అయితే తెలంగాణ విద్యుత్ ప్లాంట్లను బోర్డుకు అప్పగించకపోతే.. గెజిట్ నోటిఫికేషన్ అమలు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఏపీ సర్కారు అభిప్రాయం వ్యక్తం చేసింది. విద్యుదుత్పత్తి పేరుతో తె లంగాణ సర్కారు అనధికారికంగా నీటిని వినియోగిస్తోందని, దీనిని నియంత్రించినప్పుడే రెండు రా ష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. పెద్దవాగుకు కృష్ణా ప్రాజెక్టులకు లంకె.. గోదావరి బోర్డుకు పెద్దవాగు ప్రాజెక్టును అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసేందుకు ఏపీ సర్కారు సిద్ధమైనా.. తెలంగాణ మాత్రం వెనుకడుగు వేస్తోంది. పెద్దవాగును గోదావరి బోర్డుకు అప్పగిస్తే.. శ్రీశైలం, సాగర్‌లలో పది ఔట్లెట్లను కృష్ణాబోర్డుకు అప్పగించేలా ఉత్తర్వులు జారీ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని భావిస్తున్నట్టు తెలిసింది. ‘గెజిట్’పై తెలంగాణ నిపుణుల కమిటీ కృష్ణా, గోదావరి బోర్డులు గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయంగా ప్రతిపాదించిన అంశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని తెలంగాణ నిర్ణయించింది. దీనిపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. ఈఎన్సీ మురళీధర్ నేతృత్వంలో పలువురు సీనియర్ ఇంజనీర్లతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ ప్రకటించింది. కృష్ణా, గోదావరి బోర్డులు ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులు, సిబ్బంది, విద్యుత్ కేంద్రాలు, ఇతర ఔట్లెట్లను అప్పగిస్తే.. ఏర్పడే పరిణామాలు, పరిస్థితులపై సమగ్రంగా అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ముఖ్యంగా ప్రాజెక్టులను బోర్డులకు స్వాధీనం చేస్తే.. వరదల నిర్వహణ (ఫ్లడ్ మేనేజ్మెంట్), విపత్తుల నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్మెంట్) ఏవిధంగా చేయాల్సి ఉంటుంది, బోర్డుకు ఉండే అధికారాలేమిటి, రాష్ట్రాలకు ఉండే అధికారాలేమిటన్న అంశాలపై పరిశీలన జరపాలని సూచించింది. ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించి అంతా అనుకూలంగా ఉందని కమిటీ పరిశీలనలో వెల్లడైతేనే.. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందని, లేకుంటే అభ్యంతరాలను మరోసారి బోర్డులు, కేంద్రం దృష్టికి తీసుకెళుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గెజిట్ అమలుకు తెలంగాణ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకొనే పరిస్థితి కనిపించడం లేదని.. ఈ అనిశ్చితి మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కేంద్రం కోర్టులో బంతి! గెజిట్ నోటిఫికేషన్ అమలుకు ఏపీ సర్కారు సహకరిస్తోందని, తెలంగాణ ప్రభుత్వం దాటవేత వైఖరి అవలంబిస్తోందని.. కృష్ణా, గోదావరి బోర్డులు కేంద్ర జలశక్తి శాఖకు విన్నవించాయి. ప్రత్యేక సమావేశాల్లో చర్చించిన అంశాల(మినిట్స్)ను కేంద్రానికి పంపాయి. దీంతో ఈ అంశం కేంద్రం పరిధిలోకి వెళ్లింది. గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా కేంద్రం ఏ చర్యలు తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. -
నేడు పోతిరెడ్డిపాడు టెలిమెట్రీ పరిశీలన
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న గందరగోళానికి తెరదించేం దుకు ఏర్పాటు చేసిన టెలిమెట్రీ పాయింట్ల పరిశీలన సోమవారం ప్రారంభం కానుంది. కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టుల వద్ద ఏర్పా టు చేసిన టెలిమెట్రీలను పరిశీలించేందుకు సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)కు చెందిన ముగ్గురు శాస్త్రవేత్త లు హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లారు. మంగళవారం పోతిరెడ్డిపాడు టెలిమెట్రీపై వారు పరిశీలన చేయనున్నారు. గతంలో హెడ్‌రెగ్యులేటర్ దిగువన 12.264 కి.మీ వద్ద ఉన్న పరికరంతో కచ్చితమైన లెక్కలు రావని తేలడంతో హెడ్‌రెగ్యులేటర్ దిగువన 1–3 కి.మీ. పరిధిలోనే పరి కరాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఆ ప్రదేశంలో సైడ్ లుకింగ్ డాప్లర్ కరెంటు ప్రొఫైలర్ (ఎస్ఎల్డీసీపీ)ని ఎక్కడ ఏర్పాటు చేస్తే పోతిరెడ్డిపాడు నీటి విడుదలపై కచ్చితమైన లెక్కలు వస్తాయనే దానిపై సర్వే చేయనున్నా రు. అనంతరం సుంకేశుల బ్యారేజీ వద్ద కేసీ కెనాల్‌ను పరిశీలించి, అక్కడ ఏ ప్రదేశంలో టెలిమెట్రీ ఏర్పాటు చేయాలనే దానిపై సర్వే చేస్తారు. బుధవారం నాగార్జునసాగర్ పరిధిలో టెలి మెట్రీ పాయింట్లకు అనువైన ప్రదేశాలపై సర్వే చేయనున్నారు. బ్రిజేశ్ విచారణ మళ్లీ వాయిదా.. తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణాజలాల పంపిణీ కోసం బ్రిజేశ్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణలో భాగంగా ఏపీ క్రాస్ ఎగ్జామినేషన్ మొదలు కాకముందే వాయిదా పడింది. ఈ నెల 9–11 తేదీల్లో జరగాల్సిన క్రాస్ ఎగ్జామినేషన్ ఈ నెల 29–31 తేదీలకు వాయిదా పడింది. ఈ తేదీల్లో తమ తరఫు న్యాయవాది విదేశీ పర్యటనలో ఉంటారని ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను కోరింది. దీంతో విచారణను వాయిదా వేస్తూ ట్రిబ్యునల్ అధికారికంగా సోమవారం 2 రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. -
‘కృష్ణా’పై వాస్తవాలను వక్రీకరిస్తోంది
ఏపీ వైఖరిని ఎండగట్టిన ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదంలో ఆంధ్రప్రదేశ్ వాస్తవాలను వక్రీకరిస్తోందని, గతంలో ట్రిబ్యునళ్ల ముందు తాను చేసిన వాదనలను తానే ఖండిస్తోందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు ఆరోపించారు. నీటి వాటాలు, వినియోగం అంశాలను పక్కనపెట్టి లభ్యత నీటిని పంచాలని మూర్ఖంగా తొండి పంచాయితీకి దిగుతోందని విమర్శిం చారు. బోర్డుకు, కేంద్రానికి లేఖలు రాస్తూ రోజు కో వైఖరిని వెల్లడిస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. నీటి వినియోగం విషయంలో పూర్తిగా బచావత్ అవార్డు మేరకే నడుచుకుంటున్నామని స్పష్టం చేశారు. జల వివాదంపై ఏపీ కోర్టుకెళ్లినా, కేంద్రం వద్దకు వెళ్లినా వాస్తవాలు తమకే అనుకూలంగా ఉన్నాయని, తమకు న్యాయం జరుగుతోందని, వాస్తవాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణా వివాదం రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ సూచన మేరకు ఆయన పలు సాంకేతిక అంశాలపై స్పష్టతనిచ్చారు. ప్రత్యేకంగా సూచిం చిన ప్రాజెక్టులకు మినహా మిగతా ప్రాజెక్టులకు గంపగుత్తగా కేటాయించిన నీటిని ఆ రాష్ట్ర భౌగోళిక సరిహద్దు పరిధిలో ఎక్కడైనా వాడుకోవచ్చని బచావత్ అవార్డు స్పష్టంగా పేర్కొందని గుర్తుచేశారు. ఆ మేరకు సాగర్ ఎగువన వాడుకోలేకపోయిన 70 టీఎంసీల నీటిని సాగర్‌లో వాడుకుం టున్నామన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపును గతంలో ఏపీ వ్యతిరేకించిన సమయంలో సుప్రీం తీర్పునిస్తూ, గంపగుత్తగా ఇచ్చిన నీటిని ఎక్కడైనా వాడుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పిందన్నారు. ఇక సాగర్ దిగువ పరీవాహకంలో 18 టీఎంసీల లభ్యతే ఉందన్న ఏపీ వాదనలో నిజం లేదన్నారు. 1985లో రాజారావు కమిటీ సహా ఏపీ సైతం గతంలో ట్రిబ్యునల్ ముందు వాదనల సమయంలో సాగర్ దిగువన 101.2 టీఎంసీల మేర నీటి లభ్యత ఉందని స్పష్టంగా తెలిపామని వెల్లడించారు. ఇలా ప్రతి అంశం తెలంగాణకే అనుకూలంగా ఉన్నా, ఏపీ మాత్రం చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ ఏడాది లభ్యత నీటిలో ఏపీకి 323 టీఎంసీలు వాడుకునే హక్కుండగా, ఇప్పటికే 360 టీఎంసీలు వినియోగించుకొని ప్రస్తుతం సాగర్‌లో అందుబాటులో ఉన్న నీరంతా తమకే దక్కాలనడం సరికాదన్నారు. ఈ వివాద పరిష్కారంలో బోర్డు చేసేదేమీ ఉండదని, నీటి వాటాలను ట్రిబ్యునల్ లేదా ఇరు రాష్ట్రాల ఒప్పందం మేరకే నిర్ణయించాల్సి ఉంటుందని చెప్పారు. విద్యాసాగర్‌రావు చెప్పిన మేరకు కేటాయింపులు ఇలా.. సాగర్ వరకు కేటాయింపులు.. ఏపీ: 280.69 టీఎంసీలు (58.39%) తెలంగాణ: 200 టీఎంసీలు (41.61%) సాగర్ దిగువన కేటాయింపులు ఏపీ: 118.21టీఎంసీలు (59.28%) తెలంగాణ: 81.20 టీఎంసీలు (40.72%) గంపగుత్తగా జరిపిన కేటాయింపులు ఏపీ: 512.04 టీఎంసీలు (63.14%) తెలంగాణ: 298.96 టీఎంసీలు (36.86%)