
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ఆసరా పెన్షన‍్ల పథకంపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు దృష్టి సారించారు. కొత్త వారితో పాటు, ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వారందరికి కూడా ఏప్రిల్ నుంచి పెంచిన కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ పెన్షన్ దారుల వయో పరిమితి తగ్గించడంతో పాటు, పెన్షన్ మొత్తాన్ని పెంచుతామంటూ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన లబ్ధిదారుల ఎంపికను ఏప్రిల్ వరకూ పూర్తి చేయాలంటూ సీఎం కేసీఆర్, ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
దాంతో సీఎస్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లకు మార్గదర్శకాలను జారీ చేశారు. ఓటర్ లిస్ట్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని.. 57 ఏళ్ల కన్నా ఎక్కువ ఉన్న వారికి పెన్షన్లు ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే దాదాపు 20 లక్షల మంది నూతన లబ్ధిదారులను గుర్తించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొత్తవారితో పాటు పాత లబ్ధిదారులకు కూడా పెంచిన పెన్షన్లను ఇవ్వనున్నట్లు తెలిపారు.