చిత్రవిచిత్ర పనులకు వందల కోట్లు వృథా | Arabesque work Hundreds Crore waste | Sakshi
Sakshi News home page

చిత్రవిచిత్ర పనులకు వందల కోట్లు వృథా

Published Sun, May 17 2015 2:24 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

చిత్రవిచిత్ర పనులకు వందల కోట్లు వృథా - Sakshi

చిత్రవిచిత్ర పనులకు వందల కోట్లు వృథా

రైతులను ఆదుకోవడానికి మాత్రం చేతులు రావా? : ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్‌కు రాత్రి కలలో ఏమి వస్తే, దానిని నిజం చేసుకోవడానికి పొద్దునే జీఓలు వస్తున్నాయి. చిత్రవిచిత్రమైన పనుల కోసం వందల కోట్లు వృథా చేస్తున్న ముఖ్యమంత్రికి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల కోసం 13.5 కోట్లు కేటాయించడానికి మాత్రం చేతులు రావడం లేదు. దేశానికి తిండిపెడుతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం సభ్య సమాజానికే సిగ్గుచేటు.

రైతులను పరామర్శించే తీరిక కేసీఆర్‌కు లేకపోవడం దుర్మార్గం’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. శనివారమిక్కడ పార్టీనేతలు ఎం.కోదండరెడ్డి, దాసోజు శ్రవణ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నవారి కుటుంబాలనే రాహుల్ పరామర్శించినట్టుగా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడడం పచ్చి అబద్ధమని, రాహుల్ పరామర్శించిన కుటుంబాలన్నీ 2014 తరువాత ఆత్మహత్య చేసుకున్నవారివేనన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్న తేదీలు, పోలీసుస్టేషన్లలో నమోదైన ఎఫ్‌ఐఆర్ నంబర్లతో సహా ఉత్తమ్ వివరించారు.
 
ఎమ్మెల్సీ అవకాశాలపై రాహుల్ ఆరా...
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న శాసనమండలి ఎన్నికల గురించి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ టీపీసీసీ ముఖ్యులను అడిగి తెలుసుకున్నారు. నాందేడ్ నుంచి నిర్మల్‌కు గురువారం రాత్రి రోడ్డుమార్గంలో వస్తుండగా కారులో తనతోపాటు ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో రాహుల్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.

శాసనసభ్యుల కోటాలో కాంగ్రెస్‌కు సీట్లు వస్తాయి అని రాహుల్ ప్రశ్నించగా... ఆరు స్థానాలకోసం ఎన్నికలు జరుగుతుండగా, పార్టీకి ఒక్కస్థానం వస్తుందని ఉత్తమ్ సమాధానమిచ్చారు. 119 ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్ర అసెంబ్లీలో ఒక్కొక్క ఎమ్మెల్సీ కోసం సుమారు 20 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంటుందని, పోటీ జరిగినా కాంగ్రెస్‌కు ఒక్కసీటు వస్తుందని ఉత్తమ్ వివరించారు. అయితే అభ్యర్థి ఎవరు, ఎంపిక ఎలా అనే విషయాలపై చర్చ పూర్తికాకముందే భైంసా రావడంతో దానిపై స్పష్టత రాలేదని తెలిసింది. కాగా, ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం 40 మంది పోటీపడుతున్నారని పీసీసీ ముఖ్యనాయకుడు ఒకరు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement