వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో వెలుగుచూసిన అక్రమాలు
‘సాక్షి’ కథనంతో రాష్ట్రవ్యాప్తంగా ఆడిట్ బృందాల తనిఖీలు
హైదరాబాద్: ఆర్టీసీలో అద్దె బస్సుల పేర జరుగుతున్న అక్రమాలు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. ఐదేళ్లు దాటిన బస్సులను తిరిగి కొనసాగించాల్సి వస్తే... తదుపరి చెల్లింపుల్లో కిలోమీటరుకు 99 పైసల చొప్పున తగ్గించాలనే నిబంధనను పక్కన పెట్టి అక్రమంగా చెల్లింపులు జరుపుతున్నారు. బిల్లుల తయారీ సమయంలో, చెల్లింపు సమయంలో సంబంధిత విభాగాలు నిబంధనను తుంగలో తొక్కుతుండగా చూడాల్సిన ఆడిట్ విభాగం కూడా నిద్రపోతోందని స్పష్టమవుతోంది.
వరంగల్ జిల్లా తొర్రూరు డిపోలో రూ.10.80 లక్షల వరకు నిధులను అక్రమంగా చెల్లించిన అంశం ఇప్పుడు ఆర్టీసీలో దుమారం రేపుతోంది. దీన్ని వెలుగులోకి తెస్తూ ‘ఆర్టీసీ ఖజానాకు అద్దె బస్సుల కన్నం’ శీర్షికతో బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో కదలిన ఆర్టీసీ యాజమాన్యం పూర్తిస్థాయిలో తనిఖీలకు ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ జిల్లాతోపాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోల్లో ఆడిట్ విభాగాలు తనిఖీలు ప్రారంభించాయి. దీంతో పలు డిపోల్లో అద్దె బస్సుల అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. 4 నెలల క్రితం వరంగల్ జిల్లాలోనే మరో డిపోలో రూ.8 లక్షలు ఇలాగే అక్రమంగా చెల్లించినట్టు తేలింది. దీనిపై అప్పట్లోనే అనుమానాలు వ్యక్తం కావడంతో హడావుడిగా ఆ మొత్తాన్ని రికవరీ చేసినట్టు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలోని ఓ డిపోలో రూ.10 ల క్షల వరకు అదనంగా చెల్లించినట్టు తేలింది.
కూడబలుక్కునే అద్దె బాగోతాలు...
ఒకటి, రెండు డిపోల్లోనే కాకుండా పలు డిపోల్లో ఇదే విధంగా అద్దె బస్సులకు అక్రమ చెల్లింపుల వ్యవహారం వెలుగుచూస్తుండడంతో ఆర్టీసీ యాజమాన్యం దీనిని సీరియస్‌గా తీసుకుంది. సిబ్బంది కూడబలుక్కునే ఈ తతంగాన్ని నడుపుతున్నట్టు ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండుసార్లు పొరుపాటు పేరుతో కథ నడిపి, ఎవరైనా పసిగడతారన్న అనుమానం రాగానే రికవరీ చేస్తున్నారని, లేకపోతే స్వాహా చేయవచ్చనే ఇలా చేస్తున్నారని భావిస్తున్నారు. గతంలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలోని కొన్ని డిపోలకు సంబంధించి ... ఆర్టీసీ అధీనంలోని దుకాణాల అద్దెలను కూడా ఇదే తరహాలో మింగేశారు. వసూలు చేసిన మొత్తంలో కొంత మినహాయించుకుని బ్యాంకులో జమ చేయడాన్ని అలవాటుగా చేసుకున్నారు. ఇలా దాదాపు రూ.2 కోట్ల వరకు స్వాహా చేశారు. ఈ విషయం వెలుగు చూడడంతో తాత్కాలిక పద్ధతిలో నియమించుకుని రిటైర్డ్ సిబ్బందిని విధుల నుంచి తొలగించి అధికారులు చేతులు దులుపుకొన్నారు. ఇప్పటి వరకు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. పైగా... అభియోగాలు ఎదుర్కొంటున్న కొందరి పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఉన్నతాధికారులే చక్రం తిప్పారు. ఆర్టీసీలో ఆడిట్ విభాగం నిర్వీర్యం కావడంతో ఇలా అద్దెల బాగోతాలు చోటు చేసుకుంటున్నాయి.
మరిన్ని డిపోల్లో అదే గోల్‌మాల్
Published Thu, Apr 23 2015 1:27 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM
Advertisement
Advertisement