
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఎంపికైన సింగరేణి యువత
వరంగల్ స్పోర్ట్స్: భరతమాత సేవకు మేము సైతం అంటున్నారు సింగరేణి యువత.. సరిహద్దుల్లో పహారా కాసే అవకాశం కోసం పరితపిస్తున్నారు. సైనికుడిగా మారాలన్న ఆశయంతో పట్టుదలతో కఠోర సాధన చేసి.. వారం రోజులుగా హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో కొనసాగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 150 మంది యువకులు ఆర్మీలోని వివిధ కేటగిరీల్లోని ఉద్యోగం కోసం పోటీ పడగా 93 మంది ఇప్పటి వరకు ఎంపికయ్యారు.
రెండు నెలలుగా శిక్షణ...
యువత ఆకాంక్షను నెరవేర్చేందుకు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో రెండు నెలలుగా మెరుగైన శిక్షణ అందించింది. అంతేకాదు ర్యాలీలో పాల్గొంటున్న యువతకు హన్మకొండలో ఉచిత భోజన, ఇతర వసతులను ఏర్పాటు చేసింది. సింగరేణి సీఎండీ శ్రీధర్, భూపాలపల్లి జనరల్ మేనేజర్ గురువయ్య ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన శిక్షణను పూర్తి స్థాయిలో యువకులు సద్వినియోగం చేసుకున్నారు. సింగరేణి పరిధిలోని భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, రామగుండంలోని మూడు ఏరియాలు, బెల్లంపల్లి, మందమర్రి మొత్తం పది ప్రాంతాల్లో యువతకు ఉద్యోగ కల్పన కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సింగరేణి సేవా సమితి పేరుతో సంస్థను స్థాపించారు.
2000 సంవత్సరంలో ఏర్పాటైన ఈ సంస్థ ద్వారా సింగరేణి కార్మికుల పిల్లలు, ఆ పరిధిలోని నిరుద్యోగ యువతకు శిక్షణ అందిస్తున్నారు. సింగరేణిలోని ఆయా ప్రాంతాల్లో విధుల్లో స్పోర్ట్స్ కోఆర్డినేటర్లు యువతకు ఫిజికల్‌గా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 18 సంవత్సరాలలో శిక్షణ పొందిన వారిలో 1000 మంది వరకు ఆర్మీలో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలు చేస్తుండడం విశేషం. యువతకు శిక్షణ ఇచ్చేందుకు సింగరేణి కోఆర్డినేషన్ విభాగం ఏర్పాటు చేశారు.
ఈ విభాగం ద్వారా ప్రతి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి నిధులను సైతం విడుదల చేస్తున్నారు. ఈసారి దాదాపు రెండు నెలల పాటు 150 మంది అభ్యర్థులు శిక్షణ ఇచ్చారు. హన్మకొండలోని జేఎన్‌ఎస్‌లో ఈనెల 22 నుంచి నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఇప్పటి వరకు 104 మంది అభ్యర్థులు వివిధ కేటగిరీల్లో పాల్గొన్నారు. అందులో 67 మంది దేహదారుఢ్య పరీక్షలో నెగ్గి మెడికల్ టెస్ట్‌కు క్వాలీఫై కాగా, 26 మంది మెడికల్ పరీక్షల్లో సైతం అర్హత సాధించి రాత పరీక్ష సిద్ధమవుతున్నారు. ఇక మరో 9 మంది మెడికల్ టెస్ట్‌లో అర్హతను కోల్పోయారు.
ట్రేడ్‌మెన్‌కు ఎంపికయ్యాను
జవాన్ ఉద్యోగం చేయాలన్న నా ఆశయం నేటి నెరవేరింది. నెల రోజులకు నాకు శిక్షణ అందించిన సింగరేణి సేవా సమితికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా ఊరిలో కొందరు ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారిని చూసినప్పటి నుంచి నేనూ ఆర్మీలో చేరాలనుకున్నాను. ఏడాదిగా ప్రతి రోజు వ్యాయామం చేస్తున్నాను. అనుకున్న ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది.
జీఎం పంపిన చెక్కును కలెక్టర్ అమ్రపాలికి అందజేస్తున్న నోడల్ ఆఫీసర్ సాధన్

సంతోష్‌కుమార్, రామగుండం
Comments
Please login to add a commentAdd a comment