ఉపాధి కల్పనే లక్ష్యం
⇒ పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక విడుదల చేసిన కేటీఆర్
⇒ పెట్టుబడులను ఆకర్షించేందుకే పరిమితం కాబోం
⇒ కొత్త రంగాలపై దృష్టి సారిస్తూ సెక్టోరల్ పాలసీలు తీసుకొస్తాం
⇒ రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలను విస్తరిస్తాం
⇒ త్వరలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ
⇒ వచ్చే ఏడాది రాష్ట్రంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కేవలం పెట్టుబడులను ఆకర్షించేందుకే కాకుండా.. రాష్ట్ర యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక రంగంపై దృష్టి సారించామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంలో రాష్ట్రానికి ఉన్న బలంపై ఆధారపడుతూనే.. కొత్త రంగాలపై దృష్టి సారించేలా ‘సెక్టోరల్ థింకింగ్ పాలసీ’లకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. పారిశ్రామిక ప్రగతి హైదరాబాద్ పరిసరాలకే పరిమితం కాకుండా రాష్ట్రమంతటికీ విస్తరించేలా ఇండస్ట్రియల్ ప్రమోషన్‌పై దృష్టి సారిస్తామని చెప్పారు.
సులభ వాణిజ్యంతోపాటు తక్కువ వ్యయంతో, ఎక్కువ నాణ్యత కలిగిన ఉత్పత్తుల తయారీతో ఉపాధి అవకాశాలు పెరిగేలా చూస్తామని వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లో పరిశ్రమలు, మైనింగ్ శాఖల ద్వితీయ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. టీ-హబ్ తరహా స్ఫూర్తిని పారిశ్రామిక రంగానికి విస్తరిస్తామని... ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే ‘రిచ్’ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ప్రకటించారు. కీలక రంగాల్లో తెలంగాణ యువతకు ఉపాధి దక్కేలా టాస్క్ తరహాలో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
అమెరికాలోనూ మన విధానం..!
రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని.. అమెరికాలోనూ ఈ విధానాన్ని అమలు చేయాలనే యోచనలో అక్కడి పలు రాష్ట్రాలు ఉన్నాయని కేటీఆర్ వెల్లడించారు. టీఎస్ఐపాస్ను ప్రధాని మోదీ సహా అనేక మంది ప్రశంసించారన్నారు. ఆదిభట్ల ఏరోస్పేస్ సెజ్‌లో తయారయ్యే హెలికాప్టర్‌ను అమెరికా అధ్యక్షుడు ఒబామా ఉపయోస్తున్నారన్నారు.
లైఫ్‌సైన్స్, ఫార్మా, బల్క్ డ్రగ్ రంగాల్లో అభివృద్ధిని స్థిరీకరిస్తూ... కొత్తగా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో బలోపేతమయ్యేందుకు ప్రయత్నిస్తామని తెలి పారు. మెడికల్ డివెజైస్, ఫుడ్ ప్రాసెసింగ్, సీడ్ పార్కుల ద్వారా భారీగా ఉపాధి లభించే అవకాశమున్నందున భవిష్యత్తులో వాటికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ ఉత్పత్తులకు సంబంధించి జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, అమెరికాలో కంట్రీ డెస్కులు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. త్వరలోనే ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ పాలసీని ప్రకటిస్తామన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫార్మాసిటీ, టెక్స్టైల్ పార్కు ఏర్పాటును ఈ ఏడాది కొలిక్కి తెస్తామన్నారు.
మైనింగ్ లక్ష్యం రూ.4 వేల కోట్లు
మైనింగ్ ఆదాయం 2015-16లో 41 శాతం వృద్ధి చెందిందని.. రికార్డు స్థాయిలో రూ.2,774 కోట్లు ఖజానాకు సమకూరాయని కేటీఆర్ వెల్లడించారు. 2016-17లో రూ.4 వేల కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాయల్టీ వసూలు, సీనరేజీ చెల్లింపు, ఆన్లైన్లో అనుమతులు, మినరల్ కన్సెన్షన్స్ తదితర విధానాల్లో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని తెలిపారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా, మైనింగ్ కార్మికుల రక్షణను కూడా దృష్టిలో పెట్టుకుని ‘మైనింగ్ సేఫ్టీ యాక్ట్’ను అమలు చేస్తామని ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. టీఎస్ఎండీసీ ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ఇప్పటి వరకు ఇసుక అమ్మకాల ద్వారా రూ.436 కోట్లు ఆర్జించిందని కేటీఆర్ వెల్లడించారు.
31 పరిశ్రమలకు అనుమతులు
టీఎస్ ఐపాస్‌లో భాగంగా ఏడో విడతలో 31 పరిశ్రమలకు మంత్రి కేటీఆర్ అనుమతి పత్రాలు అందజేశారు. ఈ పరిశ్రమల ద్వారా రూ.2,374 కోట్ల పెట్టుబడులతో 5,800 మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కుతుందని వెల్లడించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యద ర్శి అరవింద్ కుమార్, ఉప కార్యదర్శి సైదా, కమిషనర్ మాణిక్‌రాజ్, టీఎస్ఎండీసీ ఎండీ ఇలంబర్తి, టీఎస్ఐఐసీ ఎండీ ఈ.వి.నర్సింహారెడ్డి, మైన్స్ విభాగం డెరైక్టర్ సుశీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.