సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి, చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 100 వెంటిలేటర్లను ప్రభుత్వ ఆసుపత్రులకు డొనేట్ చేసిన మైక్రాన్ ఫౌండేషన్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో అమెరికన్ ఇండియా ఫౌండేషన్, గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మైక్రాన్ సంస్థ వంద వెంటిలేటర్లను మంత్రికి అందించింది. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఊపిరితిత్తుల మీద ఎక్కువ ప్రభావం పడుతుందని, అత్యవసర పరిస్థితుల్లో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయని, అందుకోసమే ఎక్కువ వెంటిలేటర్లను సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వెయ్యి వెంటిలేటర్లు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినట్లు ఆయన తెలిపారు. వివిధ ఆసుపత్రులలో చిన్నచిన్న సమస్యలతో పక్కన పడేసిన వెంటిలేటర్లను ఇప్పటికే రిపేర్ చేయించి వినియోగిస్తున్నామన్నారు. అదే విధంగా కొత్త వెంటిలేటర్స్ కోసం కూడా ఆర్డర్ ఇచ్చామని ఆయన తెలిపారు. 80 వెంటిలేటర్స్ గాంధీ ఆసుపత్రికి, 10 ఉస్మానియా ఆసుపత్రికి, 10 చెస్ట్ ఆసుపత్రికి అందించారు. మరో వంద వెంటిలేటర్స్ కూడా అందిస్తామని గ్రేస్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చిన్నబాబు వెల్లడించారు.
గాంధీలో వైద్య సేవలపై సమీక్ష
లక్ష మంది కరోనా రోగులు వచ్చినా చికిత్స అందించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి ఈటల అన్నారు. గాంధీ ఆసుపత్రిలో ఏర్పాట్లపై మంగళవారం మంత్రి సచివాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుకు పలు సూచనలు, సలహాలు అందించారు. అత్యవసర చికిత్స అవసరమైన పేషంట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐసీయూపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. ప్రస్తుతం 30 మంది రోగులు ఐసీయూలో ఉన్నట్లు డాక్టర్ రాజారావు మంత్రికి తెలిపారు. క్రిటికల్ కండీషన్‌లో ఉన్న రోగుల వివరాలు వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు అందించాలని కోరారు. అలాగే వారికి నాణ్యమైన భోజనం అందేలా, హాస్పిటల్ పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కోరారు.
కరోనా అడ్డుకట్టకు ఏర్పాట్లు
Published Wed, May 27 2020 3:07 AM | Last Updated on Wed, May 27 2020 3:07 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment