
ప్రభుత్వ కుట్రలో భాగంగానే అరెస్టులు
టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలనే కుట్రలో భాగంగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం టీడీపీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతోందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసులో చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను శనివారం ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, వివేక్, అరెకపూడి గాంధీ, సాయన్నలతో కలసి రమణ ములాఖత్ ద్వారా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన చర్లపల్లి జైలు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాల్పడుతున్న కక్షసాధింపు చర్యలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అక్రమ కేసుల నుంచి తమ నేతలు త్వరలోనే నిర్దోషులుగా బయటకొస్తారన్నారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి చంద్రబాబు అడ్డంకి కాదని, రాజకీయ దురుద్దేశంతోనే అసత్య ప్రచారం సాగిస్తున్నారని చెప్పారు.