కళాకారులు భగవత్ స్వరూపులు
కరీంనగర్‌కల్చరల్ : కళాకారులు భగవత్ స్వరూపులని, వారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారులు కేవీ.రమణాచారి అన్నారు. దివంగత ఒగ్గు కథకుడు మిద్దెరాములు కళాపీఠం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నగరంలోని కళాభారతిలో ఏర్పాటు చేసిన స్మారక పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారుతున్న తరుణంలో మిద్దె రాములు తనయుడు పర్శరాములు కళాపీఠం ఏర్పాటు చేసి నాలుగేళ్లుగా కళాకారులను సన్మానించడం, అవార్డులను బహూకరించడం అభినందనీయమన్నారు. మిద్దెరాములు గురించి చెప్పడానికి మాటలు చాలవన్నారు. కళాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఇందులో భాగంగానే పింఛన్లను రూ.1500కు పెంచిందని గుర్తు చేశారు.
ఉద్యమానికి ఊతమిచ్చిన ప్రతి కళాకారుడినీ ఆదుకుంటామని వివరించారు. ప్రభుత్వం తరఫున మిద్దెరాములు పురస్కార అవార్డు ఏర్పాటుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. 2013కు గాను ఒగ్గుకథ కళాకారుడు రాజీవ్‌కు ప్రతిభా పురస్కార్, హంస అవార్డు గ్రహీత చుక్క సత్తయ్యకు ప్రకటించిన అవార్డును ఆయన తనయుడు అంజనేయులుకు, 2014కుగాను జానపద కళాకారుడు ఎస్.ప్రభాకర్‌కు అవార్డు ప్రకటించగా.. వారికి రమణాచారి పురస్కారాలను అందించారు.
మిద్దెరాములు ఒగ్గుకథ పురస్కారాలను యాంకర్ ఎండీ సలీం, సినీగీత రచయిత గుండేటి రమేశ్, జానపద గాయకులు జడల రమేశ్, ఆకునూరి దేవయ్య, లింగ శ్రీనివాస్, కుమారస్వామి, నృత్య కళానికేతన్ అధ్యక్షుడు ఎల్ల పోశెట్టి, గజల్ గాయకులు నర్సన్, ఒగ్గుకథకులు పూడూరి మల్లయ్య, గోపగాని ఓదెన్న, దీకొండ కొమురయ్య, దనే సాగర్, బొల్లి రాజుకు అందజేశారు. కార్యక్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్, ఆర్డీవో చంద్రశేఖర్, జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వంగ శ్రీనివాస్‌గౌడ్, సుంచు లింగయ్య, పత్తిపాక మోహన్, బుర్ర సతీష్, కోడూరి రవీందర్‌గౌడ్, కె.శ్రీనివాసాచారి, గోగుల ప్రసాద్, జి.కృపాదానం, మాడిశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.