kalabharati
-
చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్దాలు కోరు అని.. ఆయన అసత్యాలను సానుకూల మీడియా వక్రీకరించి పదే పదే ప్రచారం చేసి ప్రజలను మభ్యపెడుతోందని విశ్రాంతి ఐఏఎస్ అధికారి ఐ.వై.ఆర్.కృష్ణారావు ధ్వజమెత్తారు. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో సోమవారం జరిగిన బ్రహ్మణ చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర సహాయం చేయలేదని చంద్రబాబు పదేపదే అబద్దాలను చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తానంటున్న ప్రత్యేక హోదాపై చంద్రబాబు, రాహుల్‌గాంధీ రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇవ్వాలన్నారు. పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కేవలం రాష్ట్రానికి ఆర్థిక సహాయంతో కూడిన ప్రత్యేక హోదా మాత్రమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేక హోదాతో పనిలేకుండా రాష్ట్రానికి నిధులు కేటాయించిందన్నారు. కేంద్ర బడ్జెట్ సుమారుగా లక్షన్నర కోట్లు కాగా.. రాష్ట్రానికి లక్ష కోట్లు కావాలని అడగడం ఎంతవరకు సమంజసమన్నారు. కేంద్రం విశాఖకు రైల్వేజోన్ ప్రకటించిన 24 గంటల్లో చంద్రబాబు అండ్‌కో మీడియా లేనిపోని అర్థరహిత వ్యాఖ్యానాలు చేసిందన్నారు. ఎక్కడ జోన్ ప్రకటించినా తప్పనిసరిగా రిక్రూట్మోంట్ బోర్డు ఉంటుందని ఇంగిత జ్ఞానం లేకుండా ఆరోపణలు చేశారన్నారు. మాట్లాడితే పోలవరం పాట పాడే బాబు నాలుగన్నరేళ్లు ఎందుకు పట్టించుకోలేదన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బుతో గెలవాలనే తాపత్రయంతో చంద్రబాబు ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడ్డారన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అబద్దాలు చెప్పే చంద్రబాబును గెలిపించే పరిస్థితిలో ప్రజలు లేరని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో విశాఖ తూర్పు బీజేపీ అభ్యర్థి సుహాసినీ తదితరులు పాల్గొన్నారు. -
కళాభారతి కథే లేదు!
సాక్షి, సిటీబ్యూరో: బడ్జెట్లో సీఎం కలల స్వప్నం కళాభారతి ప్రస్తావనే లేదు. జాతీయ కళావేదిక రవీంద్రభారతికి రూ.2 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది ప్రభుత్వం. భాషా సాంస్కృతిక శాఖ రూ.103 కోట్లతో ప్రతిపాదనలు పంపగా... అందులో సగమే రూ.58 కోట్లు కేటాయించింది. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పడంలో ఈ శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతి ఏటా బోనాలు, బతుకమ్మ, రాష్ట్ర అవతరణ దినోత్సవం తదితర ప్రభుత్వ వేడుకల్లో సాంస్కృతిక శాఖది ముఖ్య భూమిక. తెలంగాణ మహనీయుల పేరుతో అవార్డులు అందిస్తూ, వారి జయంతి, వర్ధంతి నిర్వహిస్తోంది. ఇవన్నీ దిగ్విజయంగా జరగాలంటే రూ.103 కోట్లు పైనే ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికిప్రతిపాదనలు పంపగా.. బడ్జెట్లో మాత్రం రూ.58 కోట్లు కేటాయించింది. కాకపోతే గతేడాదితో పోలిస్తే రూ.12కోట్లు పెంచారు. వీటిలో దాదాపు రూ.3.5 కోట్లతో మన టీవీ కార్యాలయంలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయనున్నారు. సాహిత్య అకాడమీకి రూ.4 కోట్లు వరకు ఖర్చు చేయాల్సి ఉంది. దీంతో మళ్లీ ఎప్పటి మాదిరి వివిధ వేడుకలనిర్వహణకు ప్రభుత్వం వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నిధులతోనేఅంతర్జాతీయ ఫెస్టివల్, థియేటర్, ఆర్ట్ ఫెస్టివల్స్, ఏప్రిల్ 1 నుంచి జూన్ 2 వరకు నిరంతర కళారాధన నిర్వహించాలనినిర్ణయించారు. ఇక సాంస్కృతిక సారథికి రూ.20 కోట్లు అవసరం కానున్నాయి. ఇవన్నీ పోను కళలను బతికించుకునేందుకు, కళాకారులకు చేయూతనిచ్చేందుకుకార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. ఇది ఎలా సాధ్యమని పలువురు వాపోతున్నారు. పర్యాటకాభివృద్ధిని మరిచారు... రాష్ట్ర ఆదాయ వనరుల్లో పర్యాటక శాఖ ఒకటి. దీనికి గుండెకాయ లాంటిదైన తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ)ని ప్రభుత్వం విస్మరించింది. బడ్జెట్లో అరకొరగా రూ.30 కోట్లు కేటాయించింది. మరిన్ని నిధులు కేటాయించి హరిత హోటల్స్, ఇతర హేరిటేజ్ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా దృష్టిసారించలేదు. -
కన్వెన్షన్ సెంటర్ గా ‘కళాభారతి’
♦ సాంస్కృతిక కార్యక్రమాలు ♦ సదస్సుల నిర్వహణకు అనుగుణంగా ఉండాలి ♦ అధికారులకు సీఎం ఆదేశం ♦ ముఖ్యమంత్రి, సీఎస్, స్పీకర్, మండలి చైర్మన్లకు కొత్త నివాసాలు ♦ ఐఏఎస్ అధికారులకు అధునాతన క్వార్టర్ల నిర్మాణం ♦ డిజైన్ల ఖరారుకు సీఎస్ సారథ్యంలో ఆరుగురితో కమిటీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ సదస్సులకు వేదికగా మారిన హైదరాబాద్‌లో భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో ప్రతిరోజు ఎన్నో సమావేశాలు జరుగుతున్నాయని, అందుకు తగ్గట్లుగా హెచ్ఐసీసీ తరహాలో మరో పెద్ద కన్వెన్షన్ సెంటర్ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇందిరాపార్కు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో కళాభారతి కల్చరల్ సెంటర్‌ను నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సభలు, సమావేశాలు, సదస్సుల నిర్వహణకు అనుగుణంగా ఈ కళాభారతి నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కళాభారతిని కన్వెన్షన్ సెంటర్ కమ్ కల్చరల్ సెంటర్‌గా తీర్చిదిద్దాలన్నారు. వరుసగా జరుగుతున్న బడ్జెట్ సమీక్షల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఆర్అండ్బీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నగరంలో చేపట్టనున్న పలు కొత్త నిర్మాణాల అంశం చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ముఖ్య అధికారులు, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్‌కు అధికారిక నివాసాలు నిర్మించాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అఖిల భారత సర్వీస్ అధికారులకు కూడా అధునాతన క్వార్టర్లు కట్టాలని అధికారులకు చెప్పారు. ఈ నిర్మాణాలకు స్థలం, డిజైన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ప్రకటించారు. సీఎస్‌తోపాటు ఆర్అండ్బీ కార్యదర్శి, సీఎంవో ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఐఅండ్‌పీఆర్ కార్యదర్శి, ఆర్‌అండ్‌బీకి చెందిన ఇద్దరు ఈఎన్సీలు ఇందులో సభ్యులుగా ఉంటారు. సీఎం కొత్త అధికారిక నివాసం నిర్మాణానికి సంబంధించి గ తేడాది నుంచి ఆర్అండ్బీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం బేగంపేటలో ఉన్న సీఎం నివాసం వెనుక ఉన్న పాత ఐఏఎస్ క్వార్టర్లను కూల్చివేసి, అదే స్థలంలో కొత్త నివాసం నిర్మించాలనే ప్రతిపాదనలున్నాయి. -
కళాభారతికి కొత్త హంగులు
టవర్‌సర్కిల్: కరీంనగర్‌లోని కళాభారతిని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆధునికీకరణకు యుద్ధప్రాతిపదికన ప్రతిపాదనలు పంపించాలని మున్సిపల్ కమిషనర్‌కు ఉత్తర్వులు అందాయి. ఈ మేరకు అధికారులు హడావుడిగా ప్రతిపాదనలు తయారు చేసే పనిలో పడ్డారు. రూ.10 కోట్లతో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి పంపించేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఆధునిక సౌకర్యాలు కళాభారతికి సకల హంగులు కల్పించి హైదరాబాద్‌లోని రవీంద్రభారతిని తలపించే విధంగా చేయాలనేది ప్రభుత్వ యోచనగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న కళాభారతి రూపురేఖలను పూర్తిగా మార్చేయనున్నారు. సెంట్రల్ ఏసీ, అత్యాధునిక సౌండ్ సిస్టం, లైటింగ్, లగ్జరీ సీటింగ్, ఉడెన్ ఫ్లోర్ విత్ కార్పెట్, డోర్స్ మార్పు, శాటిలైట్ కనెక్షన్‌తో ప్రొజెక్టర్, థియేటర్ స్క్రీన్, ముందుభాగం ఎలివేషన్, మ్యూజికల్ ఫౌంటేన్, సీలింగ్ మార్పు, ఉడెన్ ప్యానల్‌తో సైడ్‌వాల్స్, అందమైన వేదిక, రెండు డ్రెస్సింగ్ రూమ్‌లు, సెన్సార్ సౌకర్యంతో టాయిలెట్స్, ఫైర్ పరికరాలు కల్పించేందుకు అధికారులు అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రేట్లతో రూపొందించిన ప్రాథమిక అంచనాల జాబితాను సిద్ధం చేస్తున్నారు. అయితే అనుభవం ఉన్న కన్సెల్టెన్సీలతో మరోమారు పూర్తిస్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు. హంగులతో ఆదరణ ప్రస్తుతం కళాభారతి సౌకర్యాల లేమితో సతమతమవుతోంది. కార్యక్రమాలకు ప్రతికూలంగా మారింది. కేవలం ఒక్క టాయిలెట్, ఒకే ఒక్క డ్రెస్సింగ్‌రూమ్, విరిగిన చైర్లు, తిరగని ఫ్యాన్లు, వెలగని లైట్లు, ఎప్పుడు విరుగుతాయో తెలి యని స్టేజీ చెక్కలు.. ఇన్ని అసౌకర్యాల మధ్య సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కళాకారులకు కత్తిమీద సాముగా మారింది. దీంతో ఎవరూ కళాభారతి లో కార్యక్రమాలకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం కళాభారతి ఆధునికీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో కళాకారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కార్యక్రమాల నిర్వహణ అంగరంగ వైభవంగా చేసుకోవచ్చనే ధీమా కనబరుస్తున్నా రు. కార్యక్రమాలు పెరిగితే కళాభారతికి ఆదాయం గణనీయంగా పెరగనుంది. -
కళాకారులు భగవత్ స్వరూపులు
కరీంనగర్‌కల్చరల్ : కళాకారులు భగవత్ స్వరూపులని, వారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారులు కేవీ.రమణాచారి అన్నారు. దివంగత ఒగ్గు కథకుడు మిద్దెరాములు కళాపీఠం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నగరంలోని కళాభారతిలో ఏర్పాటు చేసిన స్మారక పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారుతున్న తరుణంలో మిద్దె రాములు తనయుడు పర్శరాములు కళాపీఠం ఏర్పాటు చేసి నాలుగేళ్లుగా కళాకారులను సన్మానించడం, అవార్డులను బహూకరించడం అభినందనీయమన్నారు. మిద్దెరాములు గురించి చెప్పడానికి మాటలు చాలవన్నారు. కళాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఇందులో భాగంగానే పింఛన్లను రూ.1500కు పెంచిందని గుర్తు చేశారు. ఉద్యమానికి ఊతమిచ్చిన ప్రతి కళాకారుడినీ ఆదుకుంటామని వివరించారు. ప్రభుత్వం తరఫున మిద్దెరాములు పురస్కార అవార్డు ఏర్పాటుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. 2013కు గాను ఒగ్గుకథ కళాకారుడు రాజీవ్‌కు ప్రతిభా పురస్కార్, హంస అవార్డు గ్రహీత చుక్క సత్తయ్యకు ప్రకటించిన అవార్డును ఆయన తనయుడు అంజనేయులుకు, 2014కుగాను జానపద కళాకారుడు ఎస్.ప్రభాకర్‌కు అవార్డు ప్రకటించగా.. వారికి రమణాచారి పురస్కారాలను అందించారు. మిద్దెరాములు ఒగ్గుకథ పురస్కారాలను యాంకర్ ఎండీ సలీం, సినీగీత రచయిత గుండేటి రమేశ్, జానపద గాయకులు జడల రమేశ్, ఆకునూరి దేవయ్య, లింగ శ్రీనివాస్, కుమారస్వామి, నృత్య కళానికేతన్ అధ్యక్షుడు ఎల్ల పోశెట్టి, గజల్ గాయకులు నర్సన్, ఒగ్గుకథకులు పూడూరి మల్లయ్య, గోపగాని ఓదెన్న, దీకొండ కొమురయ్య, దనే సాగర్, బొల్లి రాజుకు అందజేశారు. కార్యక్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్, ఆర్డీవో చంద్రశేఖర్, జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వంగ శ్రీనివాస్‌గౌడ్, సుంచు లింగయ్య, పత్తిపాక మోహన్, బుర్ర సతీష్, కోడూరి రవీందర్‌గౌడ్, కె.శ్రీనివాసాచారి, గోగుల ప్రసాద్, జి.కృపాదానం, మాడిశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.