కన్వెన్షన్ సెంటర్ గా ‘కళాభారతి’
♦ సాంస్కృతిక కార్యక్రమాలు
♦ సదస్సుల నిర్వహణకు అనుగుణంగా ఉండాలి
♦ అధికారులకు సీఎం ఆదేశం
♦ ముఖ్యమంత్రి, సీఎస్, స్పీకర్, మండలి చైర్మన్‌లకు కొత్త నివాసాలు
♦ ఐఏఎస్ అధికారులకు అధునాతన క్వార్టర్ల నిర్మాణం
♦ డిజైన్ల ఖరారుకు సీఎస్ సారథ్యంలో ఆరుగురితో కమిటీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ సదస్సులకు వేదికగా మారిన హైదరాబాద్‌లో భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో ప్రతిరోజు ఎన్నో సమావేశాలు జరుగుతున్నాయని, అందుకు తగ్గట్లుగా హెచ్‌ఐసీసీ తరహాలో మరో పెద్ద కన్వెన్షన్ సెంటర్ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇందిరాపార్కు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో కళాభారతి కల్చరల్ సెంటర్‌ను నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సభలు, సమావేశాలు, సదస్సుల నిర్వహణకు అనుగుణంగా ఈ కళాభారతి నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కళాభారతిని కన్వెన్షన్ సెంటర్ కమ్ కల్చరల్ సెంటర్‌గా తీర్చిదిద్దాలన్నారు.
వరుసగా జరుగుతున్న బడ్జెట్ సమీక్షల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఆర్‌అండ్‌బీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నగరంలో చేపట్టనున్న పలు కొత్త నిర్మాణాల అంశం చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ముఖ్య అధికారులు, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్‌కు అధికారిక నివాసాలు నిర్మించాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అఖిల భారత సర్వీస్ అధికారులకు కూడా అధునాతన క్వార్టర్లు కట్టాలని అధికారులకు చెప్పారు. ఈ నిర్మాణాలకు స్థలం, డిజైన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ప్రకటించారు.
సీఎస్‌తోపాటు ఆర్‌అండ్‌బీ కార్యదర్శి, సీఎంవో ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఐఅండ్‌పీఆర్ కార్యదర్శి, ఆర్‌అండ్‌బీకి చెందిన ఇద్దరు ఈఎన్‌సీలు ఇందులో సభ్యులుగా ఉంటారు. సీఎం కొత్త అధికారిక నివాసం నిర్మాణానికి సంబంధించి గ తేడాది నుంచి ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం బేగంపేటలో ఉన్న సీఎం నివాసం వెనుక ఉన్న పాత ఐఏఎస్ క్వార్టర్లను కూల్చివేసి, అదే స్థలంలో కొత్త నివాసం నిర్మించాలనే ప్రతిపాదనలున్నాయి.