
కళాకారులు ప్రతిపక్ష పాత్ర పోషించాలి
⇒ కష్టజీవుల పక్షాన నిలిచిన కానూరి తాత
⇒ సంస్మరణ సభలో సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి
ఖమ్మం మయూరిసెంటర్ : కేంద్రంలో, రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షంగా కళాకారులు వ్యవహరించాలని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. బుధవారం ఖమ్మంలోని పోట్ల రామనర్సయ్య విజ్ఞానకేంద్రంలో ఆవుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన అరుణోదయ వ్యవస్థాపకులు కానూరి వెంకటేశ్వరరావు సంస్మరణ సభను నిర్వహించారు.
హాజరైన నారాయణ మూర్తి మాట్లాడుతూ ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో కానూరి తాత వీరమరణం పొందారన్నారు. ఆయన 99 సంవత్సరాల కాలంలో ప్రజా సాంస్కృతిక కేంద్రాలకు జీవితాన్ని త్యాగంచేశారని అన్నారు. సినిమా జీవితం వందేళ్లయితే 75 ఏళ్లు సాంస్కృతిక రంగానికి సేవ చేశారన్నారు. ఏఎన్‌ఆర్, మిక్కిలినేని లాంటి ఎంతోమంది సీనియర్ నటులతో కలిసి పనిచేశారని పేర్కొన్నారు. ఆయన తుది శ్వాస వరకు ఎర్రజెండా నీడన పనిచేశారని, ఆయన కృష్ణా జిల్లాలోని ఒక దేవాలయంలో భజన పాటలు, కీర్తనల స్ఫూర్తితో తెలంగాణ సాయుధ పోరాటంలో పాటలు పాడి ప్రజలను ఉత్తేజ పరిచారని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే ఇన్ని సంవత్సరాల పాటు కళారంగానికి సేవ చేసిన అరుదైన వ్యక్తి కానూరి తాత అని కొనియాడారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా మన దేశానికి వస్తున్న సమయంలో కూడా ఆయన రాకకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో కానూరి తాత పాల్గొన్నారని గుర్తుచేశారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు. పేదలు ఎప్పుడైతే ప్రజా ప్రతినిధులు అవుతారో అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యమన్నారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అంటున్న రాహుల్ గాంధీ వారి ప్రభుత్వం రైతుల గురించి ఎందుకు మాట్లాడలేదన్నారు. చాయ్‌వాలా అని చెప్పుకునే ప్రధాని మోదీ విదేశీ పెట్టుబడి దారులకు రెడ్‌కార్పెట్ పరుస్తున్నారని విమర్శించారు. దీంతో కులవృత్తులు నిర్వీర్యం అయ్యాయన్నారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, రాయల చంద్రశేఖర్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులు నాగన్న, కృష్ణ మాట్లాడారు. తొలుత కానూరి చిత్రపటానికి ఆర్. నారాయణమూర్తి.
సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, రాయల చంద్రశేఖర్, అరుణోదయ సాం స్కృతిక సమాఖ్య నాయకులు నాగన్న, రామారావు, కృష్ణ, నాయకులు సివై. పుల్లయ్య, బి. వెంకన్న పూల మాల వేసి నివాళి అర్పించారు. విప్లవోద్యమ సాంస్కృతిక నేత అని అరుణోదయ కళాకారులు పాట లు పా డారు. అనంతరం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రచురించిన ప్రజా సాంస్కృతిక ఉద్యమకేతనం అనే పుస్తకాన్ని నారాయణ మూర్తి ఆవిష్కరించారు.