జనం పాట గుండె ఆగింది.. | Arunodaya Rama Rao passed away | Sakshi
Sakshi News home page

జనం పాట గుండె ఆగింది..

Published Mon, May 6 2019 2:14 AM | Last Updated on Mon, May 6 2019 2:14 AM

Arunodaya Rama Rao passed away - Sakshi

రామారావు భౌతికకాయం వద్ద రోదిస్తున్న కుమారులు చైతన్య, రాహుల్‌

హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విప్లవోద్యమంలో తన పాటలతో ప్రజల్ని చైతన్యపరిచిన కంఠం మూగబోయింది. గత నలభై ఏళ్లుగా అలుపెరగని సాంస్కృతిక కళాకారుడు, సంస్థ పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న అరుణోదయ రామారావు (65) తీవ్రమైన గుండెపోటుతో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. శనివారం సాయంత్రం అనారోగ్యానికి గురి కావడంతో రాంనగర్‌లోని సౌమ్య ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు చికిత్సకు నిరాకరించారు. దీంతో అక్కడ నుంచి విద్యానగర్‌లోని ఆం్ర«ధ మహిళా సభ ఆస్పత్రికి తీసుకెళ్లగా...డాక్టర్లు పరీక్షించి మైల్డ్‌ హార్ట్‌ స్ట్రోక్‌గా ధృవీకరించి ఐసీయూలో ఉంచి వైద్యం చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం వరకు అందరితో మాట్లాడుతూ ఉన్న రామారావు తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆస్పత్రిలోనే మృతి చెందారు. ఆయనకు భార్య అరుణక్క, ఇద్దరు కుమారులు చైతన్య, రాహుల్‌లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిన తరువాత రాయలసీమకు చెందిన రామారావు ఏపీ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన అంత్యక్రియలు సోమవారం ఉదయం 10 గంటలకు అంబర్‌పేట శ్మశానవాటికలో నిర్వహిస్తున్నట్లు సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి డీవీ కృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు.  

‘జనం పాట’ అలా మొదలైంది..  
1955 జూలై 1వ తేదీన కర్నూల్‌ జిల్లా ఆలూరు మండలం ములగవెల్లిలో రామారావు జన్మించారు. అనంతపురం ఆర్ట్స్‌ కళాశాలలో బీఏ వరకు చదువుకున్న రామారావు తండ్రితో కలసి పౌరాణిక నాటకాలు వేస్తుండేవారు. దీంతో ఇదే ప్రాంతానికి చెందిన సీపీఐ(ఎంఎల్‌) నాయకుడు చండ్ర పుల్లారెడ్డితో పరిచయం ఏర్పడింది. అలా ఓ రోజు ఆ కాలేజీలో ప్రముఖ గాయకుడు ఘంటసాల పాటల కార్యక్రమం జరుగుతోంది. రామారావు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ‘నమో వెంకటేశ.. నమో తిరుమలేశ..’ పాట పాడారు. అనంతరం ఘంటసాల ఆ పాట పాడిందెవరోనని తెలుసుకుని రామారావును పిలిపించారు. కేవీ రెడ్డి దర్శకత్వంలో నిర్మాణమవుతున్న ‘మర్యాదరామన్న’ సినిమాలో ‘చెబితే చాలా ఉంది’ అనే పాటను రామారావు చేత పాడించి రికార్డు చేయించారు. ఆ తరువాత ఏమైందో తెలియదు కానీ సినిమా విడుదలైన తరువాత ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాడించిన పాట అందులో ఉంది. దీంతో రామారావు మనస్తాపానికి గుర య్యారు. ఆయనను చండ్ర పుల్లారెడ్డి సముదాయించారు. ‘మనం పాడాల్సింది సినిమా పాటలు కాదు.. జనం పాటలు పాడదాం’ అని విప్లవ ఉద్యమం వైపు తీసుకువచ్చారు. 

పాటే తోడుగా..  
ఆనాటి నుంచి విప్లవ పార్టీతో పూర్తి సంబంధాలు ఏర్పరచుకున్న రామారావు..1977లో కానూరి వెంకటేశ్వరరావు నాయకత్వంలో తొలిసారి ఉస్మానియావర్సిటీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో తర్ఫీదు పొందడానికి వచ్చారు. అప్పటికే ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాత జీవితం గడుపుతున్న రామారావు తన పాటలతో ప్రజల్ని ఉర్రూతలూగించారు. రామారావు పాటలకు వస్తున్న ఆదరణ చూసిన ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేయండంటూ ఉత్తర్వులు జారీ చేసింది. నాటి ఎమర్జెన్సీలో అప్పటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామనర్సయ్యను ప్రభుత్వం కాల్చిచంపింది. ప్రతి పాటకు సొంతం ట్యూన్‌ కట్టడంలో దిట్టైన రామారావు.. ‘అన్నా అమరుడురా..మన రామనర్సయ్య’, ‘అడవి ఏడ్చింది పెద్దన్న ఏడని’వంటి పాటలు పాడి ప్రజల్ని చైతన్య పరిచారు. ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినా అందులో పాడకుండా తను పాటను అమ్మనని, పాటే తనకు ప్రాణమని కరాఖండిగా తేల్చి చెప్పిన నిబద్ధత ఆయనది. ఖమ్మం జిల్లా పిండప్రోలు సమీపంలోని పాపయ్యగూడెంకు చెందిన అరుణ ఇంటికి పార్టీ పెద్దలు అనేకమంది వచ్చి పోతుండేవారు. ఆమె పార్టీతో అనుబంధం పెంచుకుని దళాల్లోకి పని చేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలో చండ్రపుల్లారెడ్డితో తిరుగుతున్న రామారావుకు అరుణక్కతో ఆయనే దగ్గరుండి వివాహం జరిపించారు.

ప్రముఖుల సంతాపం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేత నారాయణ, మాజీ రాజ్యసభ సభ్యుడు అజీజ్‌ పాషా, తెలుగు వర్సిటీ వీసీ ఎస్‌వీ సత్యనారాయణ, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృçష్ణ మాదిగ, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ తదితరులు రామారావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రామారావు మృతి పట్ల సీపీఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సంతాపాన్ని ప్రకటించింది. సినీ రచయిత సుద్ధాల అశోక్‌తేజ, ప్రభుత్వ సలహాదారు దేశపతి శ్రీనివాస్, సీపీఎం రాష్ట్ర నాయకులు రాములు, విరసం నేత వేణుగోపాల్, విమల, జనశక్తి నేత అమర్, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, కవి జయరాజ్, పీవోడబ్ల్యూ సంధ్య, మానవ హక్కుల వేదిక నాయకుడు జీవన్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి యశ్‌పాల్, టీపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్, ప్రొఫెసర్‌ ఖాసీం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్,  న్యూడెమోక్రసీ నాయకులు వేములపల్లి వెంకటరామయ్య, ప్రొఫెసర్‌ రమా మెల్కొటే, కవి నిఖిలేశ్వర్, ఏపీ అరుణోదయ సమాఖ్య సభ్యులు సన్నశెట్టి రాజశేఖర్, శ్రీనివాస్‌  తదితరులు తమ సంతాపాన్ని ప్రకటించారు. ‘పాట గుండె ఆగింది.. అరుణోదయ రామారావు స్వరం ఆగింది’ అంటూ అరుణోదయ రామారావుకు రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు జూలూరి గౌరీశంకర్‌ కవితా నివాళి అర్పించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement